Bank Timing Will Change From January 01, 2025: నేటి ప్రపంచంలో, బ్యాంక్‌తో పని లేని వ్యక్తులు అత్యంత స్వల్ప సంఖ్యలో కనిపిస్తారు. డబ్బులు డిపాజిట్ చేయడానికి, ఉపసంహరించుకోవడానికి, కొత్త అకౌంట్‌ ఓపెన్‌ చేయడానికి, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వేయడానికి, డీడీ తీయడానికి, పెన్షన్‌ తీసుకోవడానికి, లోన్‌ కోసం, చెక్‌ మార్చుకోవడానికి లేదా మరో అవసరం కోసం.. ఇలా అనేక రకాల పనుల కోసం మెజారిటీ ప్రజలు బ్యాంక్‌ గడప తొక్కుతున్నారు. ప్రజల జీవితంలో బ్యాంక్‌లు కూడా ముఖ్యమైన ప్రదేశాలుగా మారాయి. ఈ నేపథ్యంలో, బ్యాంకింగ్ సేవలను మరింత మెరుగుపరచడానికి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాదిలో, జనవరి నుంచి, అన్ని జాతీయ బ్యాంకుల పని వేళలను ప్రామాణికంగా మార్చాలని నిర్ణయించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో, 01 జనవరి 2025 నుంచి, జాతీయ బ్యాంకులన్నీ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకే టైమ్‌లో పని చేస్తాయి.

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశంలో ఈ సంస్కరణకు ఆమోదం లభించింది. బ్యాంకింగ్ సేవలను క్రమబద్ధీకరించడం ఈ సంస్కరణ లక్ష్యం.

బ్యాంక్‌ పని వేళ్లల్లో మార్పు ఎందుకు?

ఒకే చోట పని చేస్తున్న వివిధ బ్యాంకులు వేర్వేరు పని గంటలు అనుసరిస్తుండడం వల్ల కస్టమర్లు గందరగోళానికి & అసౌకర్యానికి గురవుతున్నారు. కొన్ని బ్యాంకులు ఉదయం 10 గంటలకు, మరికొన్ని ఉదయం 10:30కు లేదా 11 గంటలకు తలుపులు తెరుస్తున్నాయి. దీనివల్ల, కస్టమర్‌లు వివిధ సేవల కోసం ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్‌లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నారు.

బ్యాంక్‌ పని వేళల్లో మార్పుల వల్ల కస్టమర్లకు ఏంటి ప్రయోజనం?

ఖాతాదార్లకు మరింత సౌలభ్యం: కస్టమర్‌లు ఇప్పుడు వివిధ బ్యాంక్ టైమింగ్స్‌ ప్రకారం తమ పనులు సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉదయం 10 గటంల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఏ జాతీయ బ్యాంక్‌నైనా సందర్శించవచ్చు.

నిరీక్షణ సమయం తగ్గింపు: ఇప్పటి వరకు బ్యాంక్‌లు వేర్వేరు సమయాల్లో లావాదేవీలను ప్రారంభించడం వల్ల ఏర్పడుతున్న గందరగోళాన్ని తగ్గించడానికి, బ్యాంక్‌ల్లో రద్దీని నిర్వహించడానికి ఇకపై వీలవుతుంది. కస్టమర్లు వేచి ఉండే సమయం కూడా తగ్గుతుంది.

బ్యాంకుల మధ్య మెరుగైన సమన్వయం: అన్ని బ్యాంకులు ఒకే సమయాల్లో పని చేయడం వల్ల అంతర్-బ్యాంక్ లావాదేవీలు, కస్టమర్ రిఫరల్స్ వంటి సర్వీసుల్లో మెరుగైన సమన్వయం ఉంటుంది.

ఉద్యోగులకు ఉపయోగం: అన్ని బ్యాంక్‌లు ఒకే సమయంలో ప్రారంభం కావడం వల్ల ఉద్యోగులు కూడా ఏకరీతి సమయం నుంచి ప్రయోజనం పొందుతారు. షిఫ్ట్‌ల వారీగా మెరుగైన ప్రణాళిక రూపొందించందుకు వీలు కలగడంతో పాటు, వ్యవస్థీకృత పని దినాన్ని కూడా అందిస్తుంది. తత్ఫలితంగా అధిక ఉత్పాదకత సాధ్యమవుతుంది.

మధ్యప్రదేశ్‌ను దాటి ప్రభావం చూపే అవకాశం!

మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విజయవంతమైతే, దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. వివిధ బ్యాంక్‌ల పని వేళల్లోని గందరగోళాన్ని అరికట్టడానికి, ఇతర రాష్ట్రాలు కూడా ఈ తరహా నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది.

మరో ఆసక్తికర కథనం: కొత్త సంవత్సరంలో ఛీప్‌ అండ్‌ బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ - ఎయిర్‌టెల్‌, జియో న్యూ ఇయర్‌ ఆఫర్లు