Autonomous shipbuilding center in Nellore: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు వేదిక అయింది. దేశీయ సముద్ర సాంకేతికత , రక్షణ రంగ ఉత్పత్తిని బలోపేతం చేసే దిశగా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సమీపంలో ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైమ్ షిప్‌బిల్డింగ్ అండ్ సిస్టమ్స్ సెంటర్ ఏర్పాటు కానుంది. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బోగోలు మండలం బంగాళాఖాతం తీరంలో ఈ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూమిపూజ నారా లోకేష్ చేతుల మీదుగా జరిగింది.

దాదాపు 29.58 ఎకరాల విస్తీర్ణంలో మొదటి విడతగా చేపడుతున్న ఈ ప్రాజెక్టులో స్వయంప్రతిపత్తి కలిగిన నౌకల నిర్మాణం , పరిశోధన మరియు అభివృద్ధి , షిప్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఒకే ప్రాంగణంలో ఉండనున్నాయి. ప్రధానంగా రక్షణ, వాణిజ్య , తీరప్రాంత భద్రతా అవసరాల కోసం మానవరహిత ఉపరితల నౌకలు, అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ డిజైన్ చేయడం, నిర్మించడంపై ఈ కేంద్రం దృష్టి సారించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెరైన్ రోబోటిక్స్ వంటి అధునాతన సాంకేతికతలను ఇక్కడ వినియోగించనున్నారు.

ఈ కేంద్రం ఏర్పాటుతో రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ ఊతం లభించనుంది. దీని ద్వారా దాదాపు 300 మందికి పైగా ఇంజనీర్లు, నేవల్ ఆర్కిటెక్టులు , ఇతర సాంకేతిక నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అంతేకాకుండా, ఇక్కడి ఎంఆర్‌ఓఫెసిలిటీ వల్ల స్థానిక మత్స్యకారుల బోట్లు, కోస్ట్‌గార్డ్ , నేవీ నౌకల మరమ్మతులు వేగంగా జరిగి, పనిదినాల నష్టం తగ్గుతుంది. మత్స్యకారులకు రియల్ టైమ్ ఫిష్ లొకేషన్ మ్యాప్స్, శాటిలైట్ వెదర్ అలర్ట్స్ వంటి సాంకేతిక సాయం కూడా అందనుంది.

Sagar Defence Engineering to establish the World’s 1st Autonomous Maritime Shipbuilding & Systems Centre

29.58 acres of land allotted at Juvvaladinne Fishing Harbour, Nellore district. AP Cabinet approved

Defence, Commercial Shipping, Fisheries, Port operations#AndhraPradesh pic.twitter.com/7DFUNtxSHu

— Amaravati News24 (@amaravatinews24) December 13, 2025

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే నెల్లూరు జిల్లా అంతర్జాతీయ సముద్ర సాంకేతిక చిత్రపటంలో కీలక స్థానాన్ని ఆక్రమిస్తుంది. అత్యాధునిక సెన్సార్ ఇంటిగ్రేషన్, నావిగేషన్ సిస్టమ్స్ మరియు రిమోట్ కంట్రోల్ టెక్నాలజీలతో రూపొందే ఈ నౌకలు సముద్ర నిఘా, మైన్ డిటెక్షన్ , లాజిస్టిక్స్ సపోర్ట్ వంటి కీలకమైన కార్యకలాపాల్లో దేశానికి రక్షణ కవచంలా మారనున్నాయి.