<p>హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా తలపెట్టనున్న ఆటోలు, క్యాబ్‌ల సమ్మెను విరమిస్తున్నట్లు ఆటో కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు రవాణా శాఖ ఉన్నతాధికారులతో జేఏసీ నాయకులు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జేఏసీ తమ నిర్ణయంపై వెనక్కి తగ్గకపోతే ఆదివారం అర్ధరాత్రి 12 గంట నుంచి ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమ్మె మొదలయ్యేది.</p>
<p>సమ్మె విరమణపై ఆటో కార్మిక సంఘాల జేఏసీ నేతలు ప్రకటించిన తరువాత మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ఆటో కార్మికుల న్యాయమైన డిమాండ్ల పట్ల తెలంగాణ ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందన్నారు. ఆటో ఛార్జీల సవరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు జీవో విడుదల చేస్తామన్నారు. ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని సైతం హామీ ఇచ్చారు. అలాగే, ప్రైవేట్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా ఓలా, ఉబర్‌ల తరహాలో ప్రభుత్వం తరఫునే సొంతంగా ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించేందుకు ఐటీ శాఖతో కలిసి పనిచేస్తామని శుభవార్త చెప్పారు. </p>
<p>ఆర్టీసీ తరఫున ఈవీ ఆటోలను కొనుగోలు చేస్తారనేది కేవలం దుష్ప్రచారమేనని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎలాంటి ఈవీ ఆటోలు కొనుగోలు చేయడం లేదన్నారు. ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు సెప్టెంబర్ మొదటి వారంలో సంబంధిత ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. </p>