Australia Immigration Policy: ఆస్ట్రేలియాలో వలసలు, అంతర్జాతీయ విద్యార్థులపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చే వలసలకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఆస్ట్రేలియా మంత్రి టోనీ బర్క్ స్పష్టం చేశారు. అయితే, వీసా వ్యవస్థను కేవలం ఆస్ట్రేలియాలో ఎక్కువకాలం నివసించేందుకు మాత్రమేనని, విదేశీయులకు ఇచ్చే వీసాలను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు, ప్రభుత్వం దానిపై మరింత నియంత్రణను తీసుకువస్తుంది. జాతీయ పత్రికా క్లబ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి ఈ కీలక ప్రకటన చేస్తూ.. అంతర్జాతీయ విద్యార్థుల వీసా మార్పులు, నిర్మాణ కార్మికుల అవసరం వంటి అంశాలపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు.

కార్మికులు, యోగా టీచర్లపై అవాస్తవ ప్రచారాలు

ఆస్ట్రేలియాలో నిర్మాణ కార్మికుల కంటే యోగా టీచర్లను ప్రభుత్వం దేశంలోకి ఎక్కువగా అనుమతిస్తోందనే ప్రచారం జరిగింది. అయితే, టోనీ బర్క్ ఇదంతా అవాస్తవమని కొట్టిపారేశారు. గతేడాది ఆస్ట్రేలియాలోకి వచ్చిన నిర్మాణ కార్మికుల సంఖ్య 15,000 వరకు ఉందని, అంతకుముందు ఈ సంఖ్య సుమారు 4,500గా ఉండేదని ఆయన పేర్కొన్నారు. అంటే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నిర్మాణ కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. మరోవైపు, యోగా టీచర్లకు ఇచ్చిన వీసాలు 'సున్నా' అని బర్క్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో భారతదేశంతో కుదిరిన వాణిజ్య ఒప్పందం కింద ఈ యోగా టీచింగ్ నిబంధన ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఏప్రిల్ 2022లో కుదిరిన ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం (ECTA) ప్రకారం.. ప్రతి సంవత్సరం 1,800 మంది వరకు అర్హత కలిగిన భారతీయ నిపుణులను (చెఫ్‌లు, యోగా టీచర్లు సహా) తాత్కాలికంగా అనుమతించవచ్చు. అయితే ఇది గరిష్టంగా అనుమతించే వర్గం మాత్రమే గానీ, ప్రతి ఏడాది ఇన్ని వేల మంది యోగా ఉపాధ్యాయులు వస్తారనేది అవాస్తవం అని టోనీ బర్గ్ అన్నారు.

'వీసా హాపింగ్' కట్టడి

అంతర్జాతీయ విద్యార్థులు ఒక వీసా నుండి మరొక వీసాకు మారే అంశంపై మంత్రి మాట్లాడుతూ.. ప్రతి వీసా మార్పును "వీసా హాపింగ్" అని ముద్ర వేయడం సరికాదన్నారు. నైపుణ్యం గల కార్మికులు తక్కువగా ఉన్న రంగంలో ఒక విద్యార్థి తన చదువు పూర్తి చేసి, గ్రాడ్యుయేట్ వీసాపై ఉద్యోగంలో చేరి, ఆపై శాశ్వత నివాసం పొందితే అది పూర్తిగా చట్టబద్ధమైన మార్గమని తెలిపారు. అయితే చదువుకోవడం కోసం కాకుండా, కేవలం ఆస్ట్రేలియాలో ఎక్కువ కాలం ఉండాలనే ఉద్దేశంతో పదేపదే కోర్సులు లేదా వీసాలు మార్చే వారిపైనే ప్రభుత్వం నియంత్రణ పెంచుతోందన్నారు. విద్యార్థులు తమ చదువులో పురోగతి సాధించాలని ప్రభుత్వం కోరుకుంటుంది. విద్యార్థి వీసాలు కేవలం వలస రావడానికి కాకుండా, చదువు కోసమే ఉపయోగపడేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యం.
Also Read: భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం

భారతీయ విద్యార్థులపై ప్రభావం

ఆస్ట్రేలియన్ డేటా ప్రకారం, 2026 మొదటి ఐదు నెలల్లో ఆస్ట్రేలియాకు వచ్చిన అంతర్జాతీయ విద్యార్థులలో భారతీయ విద్యార్థులు సుమారు 16 శాతం ఉంది. చైనా (సుమారు 160,000) తర్వాత ఆస్ట్రేలియాకు అత్యధికంగా విద్యార్థులను పంపే రెండో అతిపెద్ద దేశంగా భారత్.(లక్షకు పైగా విద్యార్థులు). అందువల్ల ఆస్ట్రేలియా వలస విధానంలో వస్తున్న ఈ మార్పులు భారతీయ విద్యార్థులపై ప్రభావాన్ని చూపనున్నాయి.

Also Read: అమెరికాకు ఇరాన్ 'కోడ్ 100' అల్టిమేటం.. యుద్ధం ముగించడానికి 7 షరతులు!

కుటుంబాలను తీసుకురావడంలో మార్పులు

కొత్త వీసా మార్పులలో.. అంతర్జాతీయ విద్యార్థులు, గ్రాడ్యుయేట్ వీసా హోల్డర్లు తమ కుటుంబ సభ్యులను ఆస్ట్రేలియాకు తీసుకురావడాన్ని నిరోధించే నిబంధనలు రానున్నాయి. అయితే పీహెచ్‌డీల వంటి ప్రత్యేక కోర్సులు అభ్యసిస్తున్నవారు, కొన్ని పసిఫిక్, ఆసియాన్ దేశాల విద్యార్థులకు దీని నుండి మినహాయింపులు లభించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, ఆస్ట్రేలియా ఈ నిబంధనల ద్వారా కేవలం అసలైన విద్యార్థులకు మాత్రమే అవకాశాలు కల్పిస్తూ, వలసల దుర్వినియోగానికి చెక్ పెట్టాలని భావిస్తోంది.

Also Read:  రష్యా ఎన్నికల్లో పుతిన్ పార్టీ భారీ విజయం.. 355 స్థానాలతో రికార్డు!