Asia Cup 2025 Danish Kaneria Comments : టీమిండియా చేతుల్లో వ‌రుస‌గా ఓడిపోతున్న పాకిస్థాన్ పై ఆదేశ మాజీ ప్లేయ‌ర్ డానిష్ క‌నేరియా అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. త‌మ చేష్ట‌ల‌తో అన‌వ‌సరంగా టీమిండియా ఆట‌గాళ్ల‌ను రెచ్చ‌గొట్టార‌ని దుయ్య‌బ‌ట్టాడు. ఆదివారం దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియాక‌ప్ సూప‌ర్-4 లీగ్ మ్యాచ్ లో టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 171 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ షాహిబ్జాదా ఫ‌ర్హాన్ (58) స్ట‌న్నింగ్ ఫిఫ్టీతో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో శివ‌మ్ దూబేకు రెండు వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం ఛేజింగ్ ను 18.5 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల‌కు 174 ప‌రుగులు చేసి .. మరో 7 బంతులు మిగిలి ఉండగానే, భార‌త్ ఈజీ విక్ట‌రీ సాధించింది. ఓపెన‌ర్ అభిషేక్ శర్మ ధ‌నాధ‌న్ ఫిఫ్టీ (39 బంతుల్లో 74, 6 ఫోర్లు, 5 సిక్సర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచి, జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. బౌలర్లలో హరీస్ రౌఫ్ కు రెండు వికెట్లు దక్కాయి. తాజా విజ‌యంతో సూప‌ర్-4 పట్టిక‌లో అగ్ర‌స్తానాన్ని భార‌త్ సాధించింది. మ్యాచ్ త‌ర్వాత క‌నేరియా మీడియాతో మాట్లాడుతూ.. పాక్ ప్లేయ‌ర్ల‌పై ఫైర‌య్యాడు..

అన‌స‌వ‌రంగా క‌వ్వించారు..
పాక్ బ్యాటింగ్ స‌మ‌యంలో ఓపెన‌ర్ షాహిబ్జాదా ఫర్హాన్ ఫిఫ్టీ పూర్తయ్యాక ఏకే-47 సిగ్న‌ల్ తో భార‌త ఆట‌గాళ్ల‌ను క‌వ్వించాడ‌ని క‌నేరియా గుర్తు చేశాడు. ఆ త‌ర్వాత ఇండియా బ్యాటింగ్ స‌మ‌యంలో ఓపెన‌ర్లు అభిషేక్, శుభ‌మాన్ గిల్ బ్ర‌హ్మోస్ మిస్సైళ్ల లాంటి షాట్ల‌తో విరుచుకుప‌డ్డార‌ని పేర్కొన్నాడు. భార‌త విధ్వంస‌క బ్యాటింగ్ కు పాక్ వ‌ద్ద సమాధానం లేకుండా పోయింద‌ని, ఆట‌గాళ్లంతా చేష్ట‌లుడిగి చూస్తూ ఉండిపోయార‌ని తెలిపాడు. ఇండియా బ్యాటింగ్ ముందు ఎంత పెద్ద లక్ష్య‌మైనా ఇట్టే క‌రిగిపోతుంద‌ని, బ్యాటింగ్ ప‌వ‌ర్ స‌త్తా బాగుంద‌ని ప్ర‌శంసించాడు. ఏదేమైనా టీమ్ మేనేజ్మెంట్ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో మైదానంలో బ‌రిలోకి దిగాల్సి ఉంద‌ని పాక్ కు సూచించాడు.

ఫ‌ఖార్ బ‌క‌రా..
ఒట‌ముల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు పాక్ సాకులు వెతుకుతోంద‌ని క‌నేరియా విమ‌ర్శించాడు. తొలి మ్యాచ్ లో హ్యాండ్ షేక్ వివాదం, త‌ర్వాత మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక తాజా మ్యాచ్ లో ఫ‌ఖార్ జ‌మాన్ క్యాచ్ ఔట్ పై రాద్ధాంతం చేస్తోందని, వికెట్ కీప‌ర్ సంజూ శాంస‌న్ ప‌ట్టిన క్యాచ్ క్లీన్ గా ఉంద‌ని ప్ర‌శంసించాడు. ఓట‌మిపై దృష్టి మ‌ళ్లీంచేందుకే పాక్ ఇలా చేస్తోంద‌ని విమ‌ర్శించాడు. ఏదేమైనా ఈ మ్యాచ్ లో పాక్ ఆట‌గాళ్లు క్లూ లెస్ గా క‌నిపించార‌ని, భార‌త బ్యాటింగ్ ముందు తేలిపోయార‌ని పేర్కొన్నాడు. ఇక సూప‌ర్ -4కి నాలుగు జ‌ట్లు అర్హ‌త సాధించాగా.. తమ తొలి మ్యాచ్ ల్లో పాక్ పై ఇండియా, శ్రీలంక‌పై బంగ్లాదేశ్ గెలుపొందాయి. బుధ‌వారం లంక‌తో పాక్, బంగ్లాతో ఇండియా త‌ల‌ప‌డ‌నున్నాయి. లంక‌-బంగ్లా మ్యాచ్ లో ఓడిన జ‌ట్టు దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇండియా-బంగ్లా మ్యాచ్ లో గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్ బెర్త్ దాదాపుగా ఖ‌రారు చేసుకుంటుంది. 2023 లో టోర్నీ గెలిచిన భార‌త్, డిఫెండింగ్ చాంపియ‌న్ హోదాలో బ‌రిలోకి దిగుతోంది.