అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలపై చర్చలు జరిపి నిర్ణయాలు ప్రకటించకుండా కాలయాపన చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ రెవెన్యూ భవన్‌లో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర సచివాలయ సమావేశం జరిగింది. జూలై 10, 11 తేదీల్లో మంత్రులతో, జూలై 22న మంత్రివర్గ ఉపసంఘంతో సుదీర్ఘ చర్చలు జరిపినా, ఇప్పటివరకు ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే భావన బలపడుతోందని, ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వమంటే వారి చట్టబద్ధమైన హక్కులను కాపాడడమేనని వారు గుర్తుచేశారు.

రూ.25 వేల కోట్లకు చేరిన ప్రభుత్వ బకాయిలు

ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు సుమారు రూ. 25 వేల కోట్లకు చేరాయని ఏపీ జేఏసీ నాయకులు వెల్లడించారు. తాము ఉచితాలు లేదా బోనస్‌లు అడగడం లేదని, చట్టబద్ధంగా రావలసిన బకాయిలనే డిమాండ్ చేస్తున్నామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ప్రతి ఉద్యోగికి చెల్లించాల్సిన బాకీ వివరాలను వారి వేతన పత్రంలో కచ్చితంగా నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.

అంతేకాకుండా, గత రెండేళ్లుగా కరవు భత్యాలు (DA) చెల్లించకపోవడంతో ఉద్యోగులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే 12వ వేతన సవరణ సంఘాన్ని (PRC) నియమించాలని, అలాగే ఎన్నికల హామీ మేరకు మధ్యంతర భృతిని (IR) ప్రకటించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. విశ్రాంత ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ను పునరుద్ధరించడంతో పాటు ఎన్నికల హామీకి అనుగుణంగా పెన్షనర్ల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని నేతలు కోరారు. అలాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS)ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, గ్రామ- వార్డు సచివాలయ ఉద్యోగుల 27 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఆగస్టు 15లోగా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించకపోతే, విజయవాడలో రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేసి, అదే వారంలో రాష్ట్రవ్యాప్త ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావు హెచ్చరించారు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని, ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.

త్వరలో సచివాలయ ముట్టడి, కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు
ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ఏపీ జేఏసీ సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారిక కార్యాచరణ నోటీసు సమర్పించామని, జూలై 1 నుంచి 8 వరకు జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి తగిన హామీ రాకపోతే రాబోయే రోజుల్లో సచివాలయ ముట్టడి, కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు, ఆపై నిరవధిక సమ్మె దిశగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని స్పష్టం చేసింది. లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు వెంటనే నేరుగా సమీక్ష నిర్వహించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జేఏసీ డిమాండ్ చేసింది.