Cyclone Warning: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీవ్ర వర్షపాతంతో వణికిపోతోంది. గడిచిన 24 గంటల్లో బుధవారం ఉదయం 8:30 నుండి గురువారం ఉదయం 7:00 వరకు రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో జలప్రళయాన్ని తలపించేలా వర్షపాతం నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షపాతం రికార్డవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

విశాఖలో కుండపోత

ఈ వర్షాల దాటికి విశాఖపట్నం నగరం తీవ్రంగా ప్రభావితమైంది. విశాఖ రూరల్ పరిధిలోని తులసీనగర్‌లో గరిష్టంగా 236 మిమీ వర్షపాతం నమోదు కాగా, మధురవాడలో 218 మిమీ, ఎండాడలో 210 మిమీ, సీతమ్మధారలో 205 మిమీ, కాపులుప్పాడలో 202 మిమీ, మహరాణిపేటలో 199 మిమీ చొప్పున రికార్డు స్థాయి వర్షాలు కురిశాయి. విశాఖతో పాటు పరిసర ప్రాంతాలైన పెందుర్తి 179 మిమీ , బుచ్చిరాజుపాలెం 171 మిమీ , విజయనగరం జిల్లా కొత్తవలస (188 మిమీ) ప్రాంతాల్లో కూడా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా విశాఖలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమై జనజీవనం పూర్తిగా స్థంభించింది.

కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు

ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, కోనసీమ, ఉమ్మడి గోదావరి, కృష్ణా , ఎన్టీఆర్ జిల్లాల్లోనూ ధారాపాతంగా వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేటలో 158 మిమీ, కాకినాడ రూరల్‌లో 148 మిమీ, తూర్పుగోదావరి గాడాలలో 146 మిమీ, ఎన్టీఆర్ జిల్లా చంద్రాలో 133 మిమీ, కోనసీమ జిల్లా ముమ్మడివరంలో 132 మిమీ వర్షపాతం నమోదైంది. ఏలూరు, పోలవరం దేవిపట్నం ప్రాంతాల్లో సైతం భారీ వర్షాలు రికార్డయ్యాయి. వాయుగుండం తీరం దాటే క్రమంలో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

రో 24 గంటల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాల తీవ్రత

వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. రాబోయే మరో 24 గంటల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. సముద్రం తీవ్ర అలజడిగా ఉన్నందున మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లోనూ వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. ఆకస్మిక వరదలు వచ్చే ముప్పు ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు, కొండచరియలు విరిగిపడే అవకాశమున్న ప్రాంతాల నివాసితులు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు స్పష్టం చేశారు.

ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు

పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం, ప్రభావిత జిల్లాల కలెక్టర్లు మరియు క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని హైఅలెర్ట్‌లో ఉంచింది. అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ , ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, విద్యుత్ తీగలు, పొంగిపొర్లుతున్న వాగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం మైకుల ద్వారా ప్రచారం చేస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు వేగవంతం చేశారు.