నర్సంపేట: దసరా ఉత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో బహిరంగంగా జంతుబలి చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. అది కూడా ప్రత్యేకించి గాంధీ జయంతి రోజు ఈ జంతుబలి జరిగింది. ఈ జంతుబలి కార్యక్రమాన్ని పోలీసులే పర్యవేక్షించడంతో నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా పట్టించుకోరా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. నర్సంపేట సీఐ రఘుపతి రెడ్డి స్వయంగా దగ్గరుండి జంతుబలిని పర్యవేక్షించారు. సీఐ రఘుపతిరెడ్డి తో పాటు మరికొందరు పోలీసు సిబ్బంది జంతుబలికి భద్రత కల్పించారని స్థానిక వర్గాలు తెలిపాయి. ఇది నిబంధనల ఉల్లంఘన అని, పోలీసులే గాంధీ జయంతి రోజు రూల్స్ పాటించకపోవడం... అందులోనూ ప్రజలను ప్రోత్సహించడంపై విమర్శలు వస్తున్నాయి. పొట్టేలును బహిరంగంగా బలి ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

గాంధీ జయంతి రోజు – నిబంధనల ఉల్లంఘన

దేశవ్యాప్తంగా గాంధీ జయంతి రోజున జంతుబలితో పాటు మద్యపాన నిషేధం అమలులో ఉంటుంది. ఇది మానవతా విలువల ప్రతీకగా భావించబడే రోజు. అదేరోజు జంతుబలిని బహిరంగంగా జరిపిన పోలీసుల తీరుపై హక్కుల పరిరక్షణ సంఘాలు, జంతు సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.

పోలీసులే నిబంధనలు ఉల్లంఘిస్తే?

ఒకవైపు పోలీసులు ప్రజలలోకి వెళ్లి జంతు బలి, మద్యం, మాంసం విక్రయం నేరమని ప్రచారం చేస్తుంటే, మరోవైపు వారే నిబంధనలు ఉల్లంఘించి జంతుబలి జరగడానికి అనుమతించడం, పర్యవేక్షించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు కేవలం ప్రజలకేనా? నేతలు, పోలీసులు, అధికారులకు ఎందుకు వర్తించవు అని ప్రశ్నిస్తున్నారు. గాంధీ సిద్ధాంతాలను అవమానించేలా పోలీసులే ఇలాంటి పనులు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తమవుతోంది.

చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు

పోలీసుల పట్ల ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలంటే, ఈ ఘటనపై స్పష్ట విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో న్యాయం, సమానత్వం, నిబంధనలపై నమ్మకం ఉండాలంటే, తప్పు చేసిన వారు ఎవరైనా శిక్షించాలని కోరుతున్నారు. దీనిపై పోలీసు శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడక తప్పదు.