ABP Southern Rising Summit 2025 | తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విద్యా రంగం పట్ల చాలా సీరియస్‌గా ఉన్నారని, రాబోయే రోజుల్లో విద్యను పూర్తిగా మార్చే చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర పాఠశాల విద్యాశాక మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యమొళి అన్నారు. రాష్ట్ర విద్యా విధానం, భాషా సమస్యలు, కొత్త టెక్నాలజీ ఎడ్యుకేషన్‌పై ఆయన కీలక ప్రకటనలు చేశారు.

చెన్నైలో వేదికగా మంగళవారం నాడు ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ మూడో ఎడిషన్ నిర్వహిస్తోంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాజకీయ నాయకులు, విద్య, సినీ, సాంస్కృతిక రంగాలకు చెందిన సంబంధించిన ప్రముఖలు ఒకే వేదికపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. దక్షిణ భారతదేశ అభివృద్ధి, కొత్త విధానాలు, సామాజిక సమస్యలు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై బహిరంగంగా చర్చించడం సదరన్ రైజింగ్ సమ్మిట్ లక్ష్యం.

విద్యా శాఖ మంత్రి అంబిల్ మహేష్ పొయ్యమోళి

సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న తమిళనాడు మంత్రి అంబిల్ మహేష్ తన ప్రసంగంలో మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుత్వం ఆలోచన కేవలం ఆర్థికాభివృద్ధికి మాత్రమే పరిమితం కాలేదు. మెరుగైన సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. మన నైతికత కేవలం ఆర్థికపరమైనది కాదు. విద్య, అవగాహనతో పాటు కొత్త సవాళ్లను ఎదుర్కొనే సమాజాన్ని నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

భాష గురించి కీలక వ్యాఖ్యలు

తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఈ సమ్మిట్‌లో కేంద్రంపై విమర్శలు గుప్పించారు. హిందీనే కాదు ఏదైనా ఇతర భాషలను తమిళనాడు ప్రజలపై రుద్దాలని ప్రయత్నిస్తే తాము మరో భాషా ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలిచ్చారు. ఇదే విషయంపై మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యమొళి భాషపై తన స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాము అన్ని భాషలను స్వాగతిస్తున్నామని, అయితే ప్రతి భాషకు దాని సొంత గుర్తింపు, ఆవశ్యకత ఉందన్నారు. కానీ ఏదైనా భాషను తమిళనాడు ప్రజలపై బలవంతంగా రుద్దితే, మేం దానిని కచ్చితంగా వ్యతిరేకిస్తాము అన్నారు.

TN SPARK గురించి ప్రస్తావించిన విద్యాశాఖ మంత్రి

‘తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతికతను భారీగా వినియోగిస్తుంది. పాఠశాల విద్యాశాఖను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి TN SPARK అనే పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమం కింద విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, కోడింగ్, డిజిటల్ టూల్స్ నేర్పిస్తున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పిల్లలు కూడా మోడ్రన్ టెక్నాలజీని నేర్చుకుంటున్నారు. TN SPARK విద్యార్థులను తక్కువ వయసులోనే డిజిటల్ ప్రపంచంతో అనుసంధానిస్తోంది. దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విధానం సైతం మరింత వేగవంతం అవుతుందని’ అన్బిల్ మహేశ్ పొయ్యమొళి పేర్కొన్నారు.