బోథ్: ఇటీవల ఓ టీచర్ కొట్టడంతో ఏపీలోని విశాఖలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా ఎవరూ మరిచిపోలేదు. ఆ దృశ్యాలు ఇంకా కళ్లముందు కదలాడుతున్నప్పటికీ కొందరు టీచర్ల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. అలాంటి మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదువుతున్న ఒక చిన్నారిపై లేడీ టీచర్ అత్యంత దారుణంగా కొట్టి పనిష్మెంట్ ఇచ్చింది. స్కూల్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు ప్రతీ ఒక్కరిని తీవ్రంగా కలచివేస్తున్నాయి. ఆమెకు మానవత్వం లేదా, పిల్లల్ని అంత దారుణంగా కొడుతూ హింసిస్తే ఎంత బాధ కలుగుతుందంటూ శరీరంపై ఉన్న గాయాలను చూపిస్తూ కుటుంబసభ్యులు సైతం వీడియో విడుదల చేయడంతో వైరల్ అవుతోంది. స్కూళ్లలో చిన్నారుల భద్రతపై తల్లిదండ్రుల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి.

చెవి మెలితిప్పి, కర్రతో కొడుతూ నరకం..

ఆ టీచర్ మొదట చిన్నారి చెవి మెలితిప్పింది. నర్సరీ చదువుతున్న బాలుడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. అంతటవితో ఆగని మహిళా టీచర్ కర్రతో చెంపలు, వీపుపై పదేపదే కొట్టింది. దాదాపు 6 నిమిషాలకు పైగా బాలుడ్ని టీచర్ కొట్టిందని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. స్కూల్ నుంచి ఇంటికి తిరిగొచ్చిన బాలుడి శరీరంపై పడిన గాయాల గుర్తులను చూసి అనుమానం వచ్చిన తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్లి ఆరా తీయడంతో ఈ అమానుష ఘటన బయటపడింది.

పిల్లల్ని జంతువుల్లా ట్రీట్ చేస్తున్నారంటూ తల్లిదండ్రుల ఆవేదన

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బోథ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్య నేర్పించాల్సిన టీచర్లే ఇలా చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేస్తే స్కూళ్లకు పిల్లలను ఎలా పంపాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తనకు ఏం జరుగుతుందో అర్థం కాక చిన్నారి నొప్పితో విలవిల్లాడుతుంటే సైతం టీచర్ మనసు కరగలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నిమిషాల పాటు రికార్డైన వీడియోలో చాలా సేపు చిన్నారిని కొడుతూనే హింసించిందని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్రతో చిన్నారిని పక్కకు నెట్టివేయడం చూసి.. బాబు ఏమైనా కుక్క అనుకున్నారా ఏంటంటూ కుటుంబసభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

తనను టీచర్ కొట్టిందని ఇంట్లో చెప్పాలంటే కూడా భయపడ్డాడని తల్లిదండ్రులు తెలిపారు. విచక్షణారహితంగా పిల్లల్ని కొడితే వారికి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని, ఇంత దారుణంగా కొడుతుంటే స్కూళ్లకు పిల్లల్ని పంపిస్తారా అని ప్రశ్నించారు. కావాలని పిల్లల్ని కొట్టలేదని టీచర్లు, స్కూల్ మేనేజ్మెంట్ సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంటే కూడా అబద్ధాలు చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.