Recover After an Abortion : అబార్షన్ తర్వాత శారీరకంగా, మానసికంగా కోలుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కో సమయం పడుతుంది. అబార్షన్ మెడికేషన్ ద్వారా జరిగిందా లేదా శస్త్రచికిత్స ద్వారా జరిగిందా అనే దానిపైనా రికవరీ ఆధారపడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. చాలామంది ఎలాంటి తీవ్రమైన సమస్యలు లేకుండానే కోలుకుంటారు.

అబార్షన్ తర్వాత ఏ లక్షణాలు సాధారణమైనవి? ఎలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి? అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు హైదరాబాద్ యశోద హాస్పిటల్స్కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ అబ్‌స్టెట్రీషియన్, గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం శారద. మరి అబార్షన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో.. రికవరీ సమయంలో గమనించాల్సిన విషయాలపై పలు విషయాలు సూచించారు.

Also Read : అబార్షన్కి కారణాలు ఇవే.. ప్రెగ్నెన్సీతో ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

అబార్షన్ తర్వాత రక్తస్రావం

అబార్షన్ తర్వాత కొన్ని రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు కడుపు నొప్పి లేదా క్రాంప్స్, యోని నుంచి రక్తస్రావం ఉండటం సాధారణంగా ఉంటాయని డాక్టర్ శారద తెలిపారు. రోజులు గడిచే కొద్దీ రక్తస్రావం తగ్గుతుంది. అయితే కొంతమందిలో అడపాదడపా రెండు వారాల వరకు రక్తస్రావం కొనసాగవచ్చని.. దానికి కంగారు పడనవసరం లేదని వెల్లడించారు. రక్తస్రావం పరిమాణం ఒక్కసారిగా పెరగడం లేదా తగ్గకుండా కొనసాగడం వంటి మార్పులు కనిపిస్తే మాత్రం వైద్యులను సంప్రదించాలని సూచించారు.

నీరసం, అలసట

అబార్షన్ తర్వాత కొన్ని రోజుల పాటు అలసటగా లేదా నీరసంగా అనిపించవచ్చు. కాబట్టి శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. ఆరోగ్యం మెరుగుపడుతున్న కొద్దీ రెగ్యులర్ పనులు చేసుకోవచ్చు.

వికారం, రొమ్ముల్లో సెన్సిటివిటీ

గర్భధారణ సమయంలో పెరిగిన హార్మోన్ల స్థాయిలు అబార్షన్ తర్వాత క్రమంగా తగ్గుతాయి. దీనివల్ల వికారం, రొమ్ముల్లో నొప్పి లేదా సున్నితత్వం పెరుగుతాయి. అలాగే గర్భధారణ లక్షణాలు వెంటనే పూర్తిగా తగ్గకపోవచ్చు. కొంత సమయం పడుతుందని గైనాకాలజిస్ట్లు చెప్తున్నారు.

Also Read : థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీలో ప్రమాదమా? అబార్షన్ అవుతుందా? తల్లి, బిడ్డకి జరిగే నష్టాలు ఇవే

అబార్షన్ తర్వాత కోలుకోవడానికి ఏం చేయాలి?

అబార్షన్ తర్వాత శరీరానికి కోలుకునే సమయం అవసరం. కొన్ని రోజుల పాటు అధిక శ్రమ, బరువులు ఎత్తడం, శారీరకంగా ఎక్కువగా అలసిపోయే పనులు చేయకపోవడం మంచిది. అలాగే శరీరం సౌకర్యంగా అనిపించిన తర్వాత మీ పనులు మీరు చేసుకోవచ్చు. వ్యాయామం ఎప్పుడు ప్రారంభించాలి అనేది మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు సూచిస్తారు.

నీరు తాగకపోతే ఇబ్బందే..

అబార్షన్ తర్వాత తగినంత నీటిని తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా రక్తస్రావం ఎక్కువగా జరిగినట్లయితే డీహైడ్రేషన్ జరగకుండా తగినంత నీరు, ద్రవాలు తీసుకోవాలి.

రికవరీ కోసం పోషకాహారం

రికవరీ సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలు అందాలి. ముఖ్యంగా రక్తస్రావం ఎక్కువగా జరిగినట్లయితే ఐరన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. పాలకూర వంటి ఆకుకూరలు, పప్పులు, కాయధాన్యాలు, శనగలు, బీన్స్, మాంసం వంటి ఐరన్ ఉండే ఆహారాలను డైట్‌లో చేర్చుకోవచ్చు.

Also Read : అబార్షన్ చేయించుకోవడమంటే మానవ హక్కులను ఉల్లంఘించడమే.. గర్భస్థ శిశువులను చంపే హక్కు ఎవరికీ లేదు

నొప్పిని తట్టుకునేందుకు..

అబార్షన్ తర్వాత వచ్చే క్రాంప్స్ లేదా నొప్పికి వైద్యులు సూచించిన మందులనే తీసుకోవాలి. సొంతంగా మందులు వేసుకోవడం మంచిది కాదు. అలాగే కడుపుపై కొద్దిసేపు హీట్ ప్యాడ్ పెట్టుకోవడం కూడా మంచిది. దీనివల్ల క్రాంప్స్ నుంచి ఉపశమనం పొందవచ్చని డాక్టర్ శారద తెలిపారు.

వైద్యుల సూచనలు..

అబార్షన్ సమయంలో వైద్యులు ఏవైనా మందులు సూచిస్తే.. వాటిని వారు చెప్పిన విధంగానే వాడాలి. ఫాలో-అప్‌ చెకప్‌కు రావాలని చెప్తే తప్పకుండా వెళ్లాలి. అబార్షన్ పూర్తిగా జరిగిందా? శరీరం సాధారణంగా కోలుకుంటుందా? వంటి విషయాలను అవసరమైతే మెడికల్ టెస్ట్లు చేసి నిర్ధారిస్తారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రక్తస్రావం జరుగుతున్న సమయంలో యోనిలో ఏది కూడా చొప్పించకూడదు. టాంపూన్లు వాడటం లేదా లైంగిక కార్యకలాపాలు ప్రారంభించడం వంటివి వైద్యుడి సూచనలతో ఫాలో అవ్వాలి. అబార్షన్ పద్ధతి, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎప్పుడు సురక్షితంగా ఉంటుందో వైద్యులు సూచిస్తారు.

Also Read : అబార్షన్ తర్వాత ఇలా చేస్తే వేగంగా కోలుకుంటారు

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..

అబార్షన్ తర్వాత కొన్ని లక్షణాలు సాధారణంగా ఉండవచ్చు. కానీ కొన్ని వాటిలో ఏదైనా కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదని చెప్తున్నారు నిపుణులు. చాలా ఎక్కువగా లేదా తగ్గకుండా నిరంతరం రక్తస్రావం అవుతుంటే లైట్ తీసుకోకూడదు. కడుపులో లేదా పెల్విక్ నొప్పి ఎక్కువగా ఉంటే జాగ్రత్తగా ఉండాలి. జ్వరం, చలి లేదా ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు అనిపిస్తే వైద్యుడికి చెప్పాలి.

యోని నుంచి దుర్వాసనతో కూడిన స్రావం రావడం, తల తిరగడం, స్పృహ తప్పడం లేదా తీవ్రమైన నీరసం కూడా లైట్ తీసుకోకూడదు. గర్భధారణ లక్షణాలు తగ్గకుండా కొనసాగడం, అబార్షన్ పూర్తిగా కాలేదేమోననే అనుమానం ఉంటే కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి లక్షణాలు ఇన్ఫెక్షన్, అధిక రక్తస్రావం లేదా గర్భధారణ కణజాలం పూర్తిగా బయటకు రాకపోవడం వంటి సమస్యలకు సంకేతాలు కావచ్చు.

Also Read : పీరియడ్స్ సమయంలో ప్రెగ్నెంట్ అవ్వొచ్చా? ఆ రోజుల్లో ట్రై చేస్తే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయా?

మానసిక ఆరోగ్యం

అబార్షన్ తర్వాత శారీరక రికవరీతో పాటు మానసికంగా కోలుకోవడం కూడా ముఖ్యమే. కొందరికి అబార్షన్ తర్వాత బాధ, ఆందోళన లేదా గందరగోళంగా అనిపించవచ్చు. అందరిలోనూ ఇలాంటి లక్షణాలు ఉండకపోచ్చు. ప్రతికూల భావాలు ఎక్కువ కాలం ఉండి.. రోజువారీ జీవితంపై ప్రభావం చూపిస్తుంటే.. వైద్య నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది.

ఫాలో-అప్ కేర్

అబార్షన్ తర్వాత ప్రతి ఒక్కరి రికవరీ ఒకేలా ఉండదు. అందుకే ఫాలో-అప్ కేర్ కూడా వ్యక్తిగతంగా ఉండాలి. రికవరీ ఎలా కొనసాగుతోందో వైద్యులు నిర్ధారించి, వ్యాయామం, లైంగిక కార్యకలాపాలు, గర్భనిరోధక పద్ధతులను ఎప్పుడు తిరిగి ప్రారంభించవచ్చో సూచిస్తారు.

Also Read : ఆ సామర్థ్యం పెరగాలంటే.. మగవారు, ఆడవాళ్లు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.