Abhinandan Varthaman Retirement: 2019 బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం పాకిస్థాన్ ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసి దేశవ్యాప్తంగా హీరోగా నిలిచిన గ్రూప్ కెప్టెన్ మాజీ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్, భారత వైమానిక దళం నుంచి ఘనంగా రిటైర్మెంట్ తీసుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా నిబద్ధతతో దేశ రక్షణ రంగంలో అందించిన విశిష్ట సేవలకు ముగింపు పలికి, ఆయన ఇప్పుడు తన కెరీర్‌లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. వైమానిక దళం నుంచి వీడ్కోలు పొందిన అనంతరం ఆయన ఒక ప్రముఖ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ లో కీలక బాధ్యతలు స్వీకరించారు.

ఎఫ్-16 విమానాన్ని లాక్ చేసి కూల్చివేసిన అభినందన్

2019 ఫిబ్రవరి 27న జరిగిన చారిత్రాత్మక పోరాటంలో అభినందన్ చూపించిన తెగువ భారత మిలిటరీ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడింది. పాతతరం మిగ్-21 బైసన్ ఫైటర్ జెట్‌ను నడుపుతూనే, అత్యాధునిక అమెరికన్ మేడ్ పాకిస్థానీ ఎఫ్-16 విమానాన్ని లాక్ చేసి కూల్చివేసారు. ఆ సమయంలో తన విమానం కూడా దెబ్బతినడంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలో పారాచూట్ ద్వారా దిగాల్సి వచ్చింది. పాకిస్థాన్ ఆర్మీ కస్టడీలో ఉన్నప్పటికీ, ఎలాంటి బెದరింపులకు లొంగకుండా ఆత్మస్థైర్యంతో, ఆర్మీ సమాచారాన్ని బయటపెట్టకుండా నిలబడిన తీరు దేశ ప్రజలందరినీ ముగ్ధులను చేసింది.

అభినందన్‌ను భారత్‌కు అప్పగించిన పాక్

విశ్వవ్యాప్తంగా దౌత్యపరమైన ఒత్తిడి, భారత ప్రభుత్వ కఠిన వైఖరి కారణంగా పాకిస్థాన్ ప్రభుత్వం 60 గంటల్లోపే అభినందన్‌ను వాఘా సరిహద్దు ద్వారా సురక్షితంగా భారత్‌కు అప్పగించక తప్పలేదు. ఆయన చూపిన అసాధారణ ధైర్యసాహసాలకు గాను భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత మిలిటరీ పురస్కారం వీరచక్ర తో గౌరవించింది. ఆ తర్వాత ఆయన సైనిక హోదా పెరుగుతూ గ్రూప్ కెప్టెన్ స్థాయికి చేరుకున్నారు. సుదీర్ఘ వైద్య పరీక్షలు, పునరావాసం అనంతరం ఆయన తిరిగి యుద్ధ విమానాలను నడిపి తనలోని అసమాన ప్రతిభను నిరూపించుకున్నారు.

🚨 BIG BREAKING: 🇮🇳

GROUP CAPTAIN ABHINANDAN VARTHAMAN RETIRES FROM IAF

Group Captain Abhinandan Varthaman has taken remature retirement from the Indian Air Force after nearly 22 years of service.

He has now reportedly joined regional airline FLY91 as a commercial pilot.

He… pic.twitter.com/2qqsmDTfnb

— Megh Updates 🚨™ (@MeghUpdates) September 3, 2026

ప్రైవేటు విమానయాన సంస్థలో కొత్త కెరీర్

సైనిక సేవలకు వీడ్కోలు చెప్పిన అభినందన్, ఇప్పుడు ప్రైవేట్ విమానయాన రంగంలోకి అడుగుపెడుతున్నారు. డిఫెన్స్ విమానాలను నడపడంలో ఉన్న ఆయన సుదీర్ఘ అనుభవం, పైలటింగ్ నైపుణ్యాలు , క్లిష్ట సమయాల్లో నిర్ణయాలు తీసుకునే వ్యూహాత్మక సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి ప్రధాన ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ ఆయనకు కీలక సీనియర్ కమాండ్ బాధ్యతలను అప్పగించింది. వాణిజ్య విమానయాన రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, అభినందన్ లాంటి నిపుణులు పౌర విమానయానంలో చేరడం ఆ సంస్థకు మాత్రమే కాకుండా ప్రైవేట్ విమానయాన రంగానికే సరికొత్త బలాన్ని చేకూరుస్తుంది.

సుదీర్ఘ కాలం పాటు దేశ సరిహద్దులను రక్షించి, దేశభక్తికి నిలువెత్తు రూపంగా నిలిచిన అభినందన్ వర్ధమాన్ రిటైర్మెంట్ వార్త విన్న శ్రేయోభిలాషులు, నెటిజన్లు సోషల్ మీడియాలో ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. భారత సైనిక దళాల గర్వకారణంగా నిలిచిన వింగ్ కమాండర్ అభినందన్, వాణిజ్య విమానయాన రంగంలోనూ తన సరికొత్త ఇన్నింగ్స్‌తో ఎంతోమంది యువ పైలట్లకు ఆదర్శంగా నిలవడం ఖాయం.