8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు(Central Government employees ), పెన్షనర్లు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న 8 వేతన సంఘం ప్రక్రియ సంప్రదింపుల దశకు చేరింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఉద్యోగ సంఘాలు, స్టేక్ హోల్డర్లతో చర్చలు జరపడం ద్వారా వారి డిమాండ్లు, అంచనాలను కమిషన్ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న 5 ప్రధాన పరిణామాలు, రాబోయే షెడ్యూల్ వివరాలు గురించి చూద్దాం.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్లు, ఇతర అలవెన్స్‌లు సమీక్షించి, సవరించడం కోసం ఈ తాత్కాలిక కమిషన్ ఏర్పాటు చేస్తారు. సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన సంఘాన్ని నియమించడం ప్రభుత్వం ఆనవాయితీగా వస్తోంది. ఉద్యోగుల సంక్షేమాన్ని పెంపొందించడం, వారి డిమాండ్లను వినడం, ప్రభుత్వ వ్యయ నిర్వహణను బ్యాలెన్స్ చేయడం ఈ కమిషన్ ప్రధాన లక్ష్యం.

ప్రస్తుత 8 వ వేతన సంఘం నవంబర్ 3, 2025న అధికారికంగా ఏర్పాటు అయ్యింది. ఈ సంఘం తీసుకునే నిర్ణయాలు సుమారు1.1 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు వారి కుటుంబ సభ్యులపై నేరుగా ప్రభావం చూపుతాయి.

ఢిల్లీలో కీలక సమావేశం

8వ వేతన సంఘం మే 13, 14 తేదీల్లో ఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లో ప్రధానంగా రక్షణ, రైల్వే యూనిన్లతో కమిషన్ సభ్యులు చర్చలు జరిపారు. ఉద్యోగుల వేతన సవరణ, అలవెన్స్‌లు, పెన్షన్లకు సంబంధించిన ప్రాథమిక అంచనాలను కమిషన్ ముందు యూనియన్లు ఉంచాయి.

మెమోరాండం గడువు పొడిగింపు (memorandum deadline extension)

ఉద్యోగ సంఘాలకు ఊరట కల్పించే విధంగా కమిషన్ తన మెమోరాండం సమర్పణ గడువును పొడిగించింది. తాజా ప్రకటన ప్రకారం ఈ గడువును మే 31, 2026 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల వివిధ సంఘాలు తమ డిమాండ్లను మరింత లోతుగా విశ్లేషించి, నివేదికలను సమర్పించడానికి అదనపు సమయం లభించినట్టైంది.

హైదరాబాద్‌లో టూర్‌లు

దేశవ్యాప్తంగా ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడానికి కమిషన్ వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. మే 18-19 తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటిస్తుంది. ఇక్కడ స్టేక్ హోల్డర్స్‌తో మాట్లాడబోతోంది. జూన్ 1-4 మధ్య జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తారు. జూన్ 8న లడఖ్‌ ప్రాంతంలో చర్చలు జరుపుతారు.

ఈసారి ఫిట్‌మెంట్ ఎంత?

ఉద్యోగులందరి దృష్టి ప్రస్తుతం ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ పైనే ఉంది. ఏడో వేతన సంఘం సమయంలో ప్రభుత్వం 2.57 ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ను వర్తింపజేసింది. ఈసారి అది ఎంత ఉంటుంది అనే దానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ ఉద్యోగ సంఘాలు దీనిని గణనీయంగా పెంచాలని కోరుతున్నాయి.

8 వ వేతన సంఘం ప్రస్తుతం ఫీడ్‌బ్యాక్ సేకరించే దశలో ఉంది. జీతాలు, పెన్షన్లు, అలవెన్స్‌ల విషయంలో అధికారిక సమాచారం కోసం ఉద్యోగులు, పెన్షనర్లు కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌http://8cpc.gov.in/ను పరిశీలించాలన్నారు.

AINPSEF కీలక డిమాండ్లతో మెమోరాండం సమర్పణ

ప్రస్తుతం అమల్లో ఉన్న AINPSEFపై ఉద్యోగుల్లో ఉన్న ఆందోళనలను పరిగణలోకి తీసుకోవాలని ఆల్‌ ఇండియా ఎన్పీస్ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. పలు డిమాండ్లతో సమగ్రమైన మెమోరాండం కమిషన్‌కు సమర్పించింది. ఉద్యోగి పదవీ విరమణ చేసే సమయంలో తీసుకునే చివరి బేసిక్ జీతంలో కనీసం 50 శాతం మొత్తాన్ని దానికి తోడు కరవు భత్యాన్ని కలిపి నెలవారీ పెన్షన్‌గా అందించాలని డిమాండ్ చేసింది. ఒకవేళ పెన్షనర్‌ మరణిస్తే వారి కుటుంబానికి ఆ పెన్షన్ మొత్తంలో 60 శాతాన్ని ఫ్యామిలీ పెన్షన్‌గా ఇవ్వాలి.

ఎన్పీఎస్‌ కింద చేరిన ఉద్యోగులు 2033 నుంచి పెద్ద సంఖ్యలో రిటైర్ కాబోతున్నారు. ద్రవ్యోల్బణం, మార్కెటింగ్ ఒడిదుడుకుల వల్ల వారి పెన్షన్ మొత్తం చాలా తక్కువగా ఉండే ప్రమాదం ఉందని AINPSEF ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తక్కువ వేతన స్థాయయిలో ఉండి, తక్కువ కాలం సర్వీస్‌ చేసిన వారికి పెన్షన్ కేవలం రూ. 300 నుంచి 3000 మధ్య మాత్రమే అందుతోందని పెడరేషన్ పేర్కొంది.