ARTICLE AD
నాలుగేళ్ల వయస్సులో ఎ. భీమ్‌సింగ్ కలతుర్ కన్నమ్మ (1960) చిత్రంతో బాలనటుడిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించిన ఈ నటుడు కెరీర్ లో 235 పైగా చిత్రలలో నటించాడు. ఇప్పటికీ బిజీ ఆర్టిస్టుగా ఆర్జిస్తున్నాడు. అతడు ఇటీవలి కాలంలో పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తూ, ఒక్కో చిత్రానికి 100 కోట్లు అందుకుంటున్నారని కథనాలొస్తున్నాయి. ఇప్పటికే 600 కోట్ల నికర ఆస్తులను కూడగట్టిన ఈ హీరో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన తర్వాత దాదాపు 16 సంవత్సరాలు ఇండస్ట్రీలో అవకాశాల కోసం పోరాడాడు. తన 20ఏళ్ల వయసులో తొలిసారి కథానాయకుడిగా నటించే అవకాశం దక్కించుకున్నాడు.
అసలు ఇంతకీ ఈ నటుడు ఎవరు? అంటే.. కచ్ఛితంగా ది గ్రేట్ కమల్ హాసన్ గురించిన ఇంట్రో ఇది. అతడు తన తొలి చిత్రం కలతుర్ కన్నమ్మలో నటనకు గాను ఉత్తమ బాల నటుడిగా రాష్ట్రపతి అవార్డు లభించింది. ఆ తర్వాత అతడి కెరీర్ దశ దిశ గురించి ఎవరూ ఊహించనివి ఎన్నో ఉన్నాయి. అయితే ఆరంభం ఇతర నటుల్లానే అతడు కూడా చాలా కష్టపడ్డాడు. సంవత్సరాల పోరాటం తర్వాత 1974 చిత్రం `కన్యాకుమారి`లో తొలిసారి హీరోగా నటించాడు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. అతడు తన మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును పొందాడు. హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించాడు.
1980ల శకం కమల్ స్వర్ణ యుగంగా గుర్తింపు పొందింది. సాగర సంగమం, నాయకన్, పుష్పక విమానం, అపూర్వ సోదరులు (అపూర్వ సగోదరర్గల్) వంటి కళాఖండాలతో అతడు చిరస్థాయిగా జన హృదయాలలో నిలిచిపోయాడు. అతడు తన అసమానమైన నటనతో మనసులు గెలుచుకున్నాడు. ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1981 చిత్రం `ఏక్ దుజే కే లియే`తో కమల్ బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించడమే గాక, అతడికి దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టింది. 1993 క్లాసిక్ హాలీవుడ్ చిత్రం `మిసెస్ డౌట్‌ఫైర్` తెరానువాదం అయిన `అవ్వాయ్ షణ్ముగి`(తమిళం), చాచి 420 (హిందీ) లతో కమల్ మల్టీ ట్యాలెంటెడ్ ఆర్టిస్టుగా లోకానికి పరిచయం అయ్యాడు.
విలక్షణ నటుడు కమల్ హాసన్ తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించారు. ఆయన దశావతారంలో ఏకంగా పది పాత్రలను పోషించడం సంచలనం. మొత్తం ప్రయాణంలో 21 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నాడు. కేవలం దక్షిణాది నుంచి 19 పురస్కారాలు కమల్ హాసన్ కి దక్కాయి.
రూ. 600 కోట్ల నికర ఆస్తులతో కమల్ హాసన్ భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే అత్యంత పాపులర్ నటులలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఒక్కో సినిమాకి 100 కోట్లు తీసుకుంటున్నారు. సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తదుపరి KH 237ను ప్రకటించింది. అలాగే ప్రభాస్‌తో కలిసి కల్కి 2898 ఏడిలో కూడా నటించనున్నాడు. నాలుగేళ్ల బాలకుడు ఈరోజు ప్రపంచ సినిమా ఐకాన్‌గా మారాడు. వినోద పరిశ్రమలో అతడి ప్రయాణం స్ఫూర్తిదాయకం.

3 weeks ago
2