<p>హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన, రాజకీయంగానూ వివాదాస్పదంగా ఉన్న 22ఏ నిషేధిత భూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ నిషేధిత భూముల జాబితాలో తలెత్తుతున్న వివాదాలను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించేందుకు వీలుగా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.</p>
<p><strong>హైలెవెల్ కమిటీ చైర్మన్, సభ్యులు వీరే</strong></p>
<p>ఈ మేరకు ముగ్గురు సీనియర్ అధికారులతో కూడిన కమిటీని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. ఈ హైలెవెల్ కమిటీకి సీసీఎల్‌ఏ (CCLA) కమిషనర్ లోకేష్ కుమార్ ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, సభ్యులుగా అధికారులు పాపిరెడ్డి, రాజీవ్ గాంధీ హనుమంతు బాధ్యతలు నిర్వర్తిస్తారు. భూ బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ కమిటీ త్వరలోనే విధివిధానాలు ఖరారు చేయనుంది.</p>