Hero Glamour X Review 2025: 125cc బైక్ సెగ్మెంట్‌లో హీరో గ్లామర్ X ఈ మధ్య కాలంలో యువత దృష్టిని బాగా దృష్టిని ఆకర్షిస్తోంది. గ్లామర్ ప్లాట్‌ఫామ్ మీదే వచ్చిన ఈ కొత్త వెర్షన్‌లో శక్తిమంతమైన ఇంజిన్‌, కొత్త టెక్నాలజీ, రైడ్ కంఫర్ట్ వంటి చాలా ముఖ్య అప్‌డేట్‌లు ఉన్నాయి. అయితే... ప్రతి బైక్‌లాగానే ఇందులో కూడా కొనాల్సిన మంచి కారణాలు ఉన్నట్లే, ఇబ్బంది పెట్టే కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. కాబట్టి హీరో గ్లామర్ X గురించి క్లియర్‌గా తెలుసుకున్నాకే ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది, లేదంటే చింతించాల్సి వస్తుంది.

హీరో గ్లామర్ X కొనదగిన 3 కారణాలు

1. సెగ్మెంట్‌లో మొదటిసారిగా ఇచ్చిన టెక్నాలజీ ఫీచర్లు

హీరో గ్లామర్ X లో అందించిన టెక్నాలజీ 125cc రేంజ్‌లో నిజంగా అద్భుతం. ఈ బైక్‌ ప్రధాన ఆకర్షణ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్. భారతదేశంలో అత్యంత చవక ధరలో క్రూయిజ్ కంట్రోల్ ఇచ్చిన మోటార్‌సైకిల్ ఇదే అని చెప్పాలి. ఇదికాకుండా, రైడ్-బై-వైర్ థ్రాటిల్ కారణంగా మూడు రైడింగ్ మోడ్స్ – Power, Road, Eco కూడా వచ్చాయి. ఇవి థ్రాటిల్ రెస్పాన్స్ మార్చినా, టాప్ స్పీడ్‌ను మాత్రం తగ్గించవు.

అదే విధంగా.... కలర్ LCD డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆటో అడ్జస్టింగ్ LED హెడ్‌ల్యాంప్స్‌, పానిక్ బ్రేక్ అలర్ట్ వంటి ఫీచర్లు ఈ బైక్‌ను 125cc క్లాస్‌లో ప్రత్యేకంగా నిలబెడతాయి.

2. మరింత శక్తిమంతమైన ఇంజిన్ - Xtreme 125R ఇంజినే

గ్లామర్ X లో ఉన్న 124.7cc ఇంజిన్ Xtreme 125R నుంచే తీసుకున్నారు. ఇది 11.5hp పవర్ మరియు 10.5Nm టార్క్ ఇస్తుంది. ఈ గణాంకాలు ఈ సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో నిలవకపోయినప్పటికీ, సాధారణ గ్లామర్‌తో పోలిస్తే స్పష్టమైన పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్‌ కనిపిస్తుంది.

నగర రైడింగ్‌లో ఈ బైక్ చురుగ్గా ఉంటుంది, హైవేలో స్పీడ్‌ను స్టెడీగా నిలుపుకోవడంతో ఇంజిన్‌పై ఒత్తిడి పడదు. ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ నగరాల్లో ఉండే స్టార్ట్-స్టాప్ ట్రాఫిక్‌లో ఇది మంచి ప్రయోజనకరం.

3. రైడ్ కంఫర్ట్ & ఎర్గోనామిక్స్ - డైలీ యూజర్లకు పర్ఫెక్ట్

గ్లామర్ X లో కమ్యూటర్ (రోజువారీ వినియోగం) బైక్‌కు కావలసిన కంఫర్ట్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టారు. సస్పెన్షన్ ట్యూనింగ్ బాగా బ్యాలెన్స్‌గా ఉండడం వల్ల చిన్న గుంతలు, రఫ్ రోడ్లు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఈ కొత్త వెర్షన్‌లో 30mm వెడల్పైన హాండిల్‌ బార్‌ పెట్టారు, ఇది ట్రాఫిక్‌లో బైక్‌ను తేలికగా హ్యాండిల్ చేయడానికి సహాయపడుతుంది. సీటు విశాలంగా ఉండటం వల్ల రైడర్, కో-రైడర్‌ ఇద్దరికీ కంఫర్ట్ బాగా ఉంటుంది.

హీరో గ్లామర్ X కొనకూడదు అనిపించే 2 కారణాలు

1. గేర్‌బాక్స్ స్మూత్‌గా పని చేయకపోవడం:

ఇంజిన్ స్మూత్‌గా పని చేసినా, గేర్‌బాక్స్ మాత్రం కొంచెం నాటీగా ఉందని రివ్యూలో వెల్లడైంది. న్యూట్రల్ నుంచి ఫస్ట్‌లో పెట్టేటప్పుడు గేర్ సరిగ్గా పడకపోవడం కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కలిగిస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో ఇది తరచుగా ఎదురయ్యే అవకాశం ఉంది. కమ్యూటర్ బైక్‌లో గేర్ షిఫ్ట్స్ స్మూత్‌గా ఉండటం చాలా ముఖ్యం.

2. ABS ఆప్షన్ లేకపోవడం

గ్లామర్ X లోని ఏ వేరియంట్‌లోనూ ABS లేదు. డ్రమ్, డిస్క్ వేరియంట్లు ఉన్నా, ABS లేకపోవడం ఇప్పటి ట్రెండ్‌లో పెద్ద లోపమే. అదే సమయంలో... Xtreme 125Rలో సింగిల్ చానల్ ABS అందిస్తున్నారు, ధర కూడా దాదాపు దగ్గరగా ఉంటుంది. అందుకే గ్లామర్ X ఈ అంశంలో వెనకబడింది.

మొత్తంగా చూస్తే, హీరో గ్లామర్ X టెక్నాలజీ, కంఫర్ట్, ఇంజిన్ పనితీరు కోరుకునే వారికి మంచి ఆప్షన్. కానీ స్మూత్ గేర్‌బాక్స్, ABS వంటి అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.