సింగిల్ విండోలో సినిమా ఖ‌త‌మ్

2 months ago 3
ARTICLE AD

సింగిల్ విండో విధానంలో షూటింగుల‌కు అనుమ‌తులు, సినిమాకి సంబంధించిన స‌ర్వ‌స‌మాచారం ఒకేచోట అందుబాటులోకి తెస్తాము అంటూ జ‌మానా కాలం నుంచి ప్ర‌భుత్వాలు చెబుతూనే ఉన్నాయి. సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధి గురించి సినిమాటోగ్ర‌ఫీ మంత్రులు ఊద‌ర‌గొడుతూనే ఉన్నారు. కానీ `ప్ర‌క‌ట‌న‌లు ఘ‌నం- ప‌నులు శూన్యం` అన్న చందంగా అవ‌న్నీ మాట‌ల వ‌ర‌కే ప‌రిమితం అని నిరూప‌ణ అయింది.

అయితే ఈ ద‌శ నుంచి మ‌రో ద‌శ‌కు సినిమా ఎదిగేందుకు ఇప్పుడు కొన్ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. పరిశ్ర‌మ త‌ర‌పున అగ్ర నిర్మాత దిల్ రాజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో క‌లిసి కొన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎఫ్.డి.సి ఛైర్మ‌న్ హోదాలో దిల్ రాజు తెలంగాణ ప‌ర్యాట‌కం, ఇత‌ర శాఖ‌ల‌తో అనుసంధాన‌మై `ఫిలింస్ ఇన్ తెలంగాణ‌` పేరుతో నిర్వ‌హించిన ఒక కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ... ఇక‌పై సినిమాల షూటింగుల‌ను స‌ర‌ళ‌త‌రం చేసేందుకు సింగిల్ విండో వ్య‌వ‌స్థను ఏర్పాటు చేస్తున్నామ‌ని, దీనికోసం అధునాత‌న వెబ్ సైట్ ని అందుబాటులోకి తెస్తున్నామ‌ని అన్నారు. సినిమాకి సంబంధించిన స‌ర్వ‌స‌మాచారం ఇక్క‌డ అందుబాటులో ఉంటుంది. ప‌రిశ్ర‌మ సాంకేతిక నిపుణులు, స్టూడియోల వ్య‌వ‌స్థ‌, లొకేష‌న్లు వ‌గైరా వివ‌రాల‌ను ఇందులో అందుబాటులో ఉంచుతారు.

ముఖ్యంగా జాతీయ అంత‌ర్జాతీయ స్థాయి ఫిలింమేక‌ర్ హైద‌రాబాద్ లేదా తెలంగాణ‌లో ఎక్క‌డైనా షూటింగ్ చేసుకునేందుకు సులువుగా అనుమ‌తులు పొందేలా వెబ్ సైట్ లోనే ద‌ర‌ఖాస్తు చేసుకునేలా ప్ర‌తిదీ సుల‌భ‌త‌రం చేస్తున్నామ‌ని తెలిపారు. అలాగే థియేట‌ర్ల నిర్వ‌హ‌ణ కోసం సంబంధిత అధికారులను సంప్ర‌దించాల్సి వ‌చ్చేది. క‌మిష‌నర్లు, అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ల ఇన్వాల్వ్ మెంట్ తో థియేట‌ర్ యాజ‌మాన్యానికి కొన్ని చిక్కులు ఉన్నాయి. కానీ ఆ చిక్కుముడుల‌ను తొల‌గిస్తూ వెబ్ సైట్ లోనే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించేలా ఏర్పాటు ఉంటుంద‌ని కూడా దిల్ రాజు బృందం తాజా స‌మావేశంలో ప్ర‌క‌టించింది. మొత్తానికి తెలంగాణ సినిమాని మ‌రో స్థాయికి తీసుకుని వెళ్లేందుకు రాజుగారి ప్ర‌య‌త్నం ప్ర‌శంస‌లు అందుకుంటోంది. వెబ్ సైట్ రెడీ కాగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టిరెడ్డి స‌మ‌క్షంలో ప్రారంభించ‌నున్నారు.

Read Entire Article