Vespa Officina 8 Price And Features: ఇటాలియన్ ప్రీమియం స్కూటర్ బ్రాండ్ వెస్పా మరో ప్రత్యేక మోడల్‌తో భారత మార్కెట్లోకి వచ్చింది. ‘ఆఫిసినా 8’ అనే ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌ను రూ.1.34 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధరతో విడుదల చేసింది. ఇది, వెస్పా పుట్టుకకు కారణమైన ప్రయోగశాల గౌరవార్ధం తీసుకొచ్చిన మోడల్.

పేరు వెనుక కథ ఏమిటి?

‘ఆఫిసినా 8’ అనే పేరు, 1944లో ఇటలీలోని పాంటెడెరా పట్టణంలో ఉన్న పియాజియో ప్లాంట్‌లో స్థాపించిన ప్రయోగ విభాగం నుంచి వచ్చింది. అక్కడే ఇంజినీర్లు, డిజైనర్లు, మెకానిక్‌లు కలిసి మొదటి వెస్పా ప్రోటోటైప్‌లను రూపొందించారు. 1946లో అదే ప్రయోగాల ఫలితంగా వెస్పా పేటెంట్ నమోదైంది. ఆ చరిత్రను గుర్తు చేస్తూ ఈ ప్రత్యేక ఎడిషన్ తీసుకొచ్చారు.

డిజైన్‌లో ఏముంది ప్రత్యేకం?

వెస్పా ఆఫిసినా 8 స్టీల్ బాడీతో వస్తుంది. మ్యాట్ మెటాలిక్ ‘బ్లూ ఆఫిసినా 8’ ఫినిష్ దీని ప్రధాన ఆకర్షణ. మెటాలిక్ రివెట్స్, బ్రాస్ & అల్యూమినియం టోన్లు స్కూటర్‌కు ఇండస్ట్రియల్ లుక్ ఇస్తాయి. గుండ్రని హెడ్‌ల్యాంప్‌, సొగసైన బాడీ లైన్స్ వంటివి ఇప్పటికే ఉన్న వెస్పా గుర్తింపులు. ఈ ఎడిషన్‌లో రిబ్డ్ సీట్ డిజైన్ కూడా థీమ్‌కు సరిపోయేలా ఉంది.

ఇంజిన్ ఆప్షన్లు

ఇతర వెస్పా మోడళ్ల మాదిరిగానే ఇది కూడా 125cc & 150cc ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. నగర ప్రయాణాలకు సరిపోయే పనితీరు, స్టైలిష్ లుక్ కలయికతో యువతను ఆకట్టుకునేలా తయారు చేశారు.

అదనపు ఆకర్షణలు

వెస్పా ఈ మోడల్ కోసం ప్రత్యేక ఆఫిసినా 8 అపారెల్ లైన్‌ను కూడా పరిచయం చేసింది. కలర్‌కు మ్యాచ్ అయ్యే టాప్ బాక్స్‌ను ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. ప్రతి స్కూటర్‌తో వెల్‌కమ్ కిట్ అందిస్తారు. అందులో ఆఫిసినా 8 చరిత్రను వివరిస్తూ ఒక పుస్తకం, అలాగే స్కూటర్ కలర్‌కు సరిపోయే హాఫ్ ఫేస్ హెల్మెట్ ఉంటుంది.

ఎక్కడ కొనాలి?

ఈ స్పెషల్ ఎడిషన్ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన వెస్పా డీలర్‌షిప్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లోని ప్రీమియం డీలర్ల వద్ద కూడా లభించే అవకాశం ఉంది.

కొనుగోలు చేయాలా?

స్టైల్‌, వారసత్వం, ప్రత్యేకత కోరుకునే వారికి వెస్పా ఆఫిసినా 8 మంచి ఎంపికగా నిలుస్తుంది. సాధారణ మోడళ్లతో పోలిస్తే ఇది కేవలం రవాణా సాధనం మాత్రమే కాదు, కలెక్ట్‌ చేయదగిన ఐటమ్‌లా కూడా భావించవచ్చు. రూ.1.34 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధర వద్ద, ప్రత్యేక రంగు, థీమ్ ఆధారిత డిజైన్‌, మ్యాచింగ్ హెల్మెట్ వంటి అంశాలు ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

వెస్పా అభిమానులకు, ఇటాలియన్ క్లాసిక్ స్టైల్ ఇష్టపడే వారికి ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన మోడల్.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.