పెరుగుతున్న పెట్రోల్ ఖర్చుల నుంచి ఉపశమనం పొందడానికి, కొత్త కారు కొనుగోలు చేయడానికి రూ.10 లక్షలు బడ్జెట్ కేటాయిస్తే సరిపోతుంది. దాంతో భారత మార్కెట్‌లో ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్‌జీ కార్లు మంచి ఎంపిక కాగలవు. ఇప్పుడు చిన్న హ్యాచ్‌బ్యాక్‌ల నుండి కాంపాక్ట్ ఎస్‌యూవీలు, సెడాన్ల వరకు CNG ఆప్షన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ కార్ల వల్ల తక్కువ రన్నింగ్ కాస్ట్ (నిర్వహణ వ్యయం) అవుతుంది. రియల్ మైలేజ్ అనేది ట్రాఫిక్, డ్రైవింగ్ తీరు, రోడ్డు పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని తెలిసిందే.

రూ.10 లక్షల బడ్జెట్‌లో మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి బ్రాండ్లు అనేక ఆప్షన్లు అందిస్తున్నాయి. కొన్ని కార్లలో మెరుగైన బూట్ స్పేస్ కోసం ట్విన్-సిలిండర్ టెక్నాలజీ లభిస్తుంది. ఇక్కడ మేం సీఎన్‌జీ వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధర రూ.10 లక్షల లోపు ఉన్న కార్ల వివరాలు అందిస్తున్నాం. కొనుగోలు చేసే ముందు మీ సిటీలో ధర, మోడల్ వేరియంట్‌ చెక్ చేసుకోవాలి.

మారుతి ఆల్టో కె10(Maruti Alto K10), సెలెరియో సీఎన్‌జీ (Maruti Celerio CNG)

తక్కువ బడ్జెట్‌లో సీఎన్‌జీ కారు కావాలనుకునే వారికి మారుతి సుజుకి ఆల్టో కె10 బెస్ట్ ఛాయిస్. దీని CNG వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర 4.82 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు కేజీకి 33.85 కిలోమీటర్లు మైలేజీ లభిస్తుంది.

మరోవైపు, మారుతి సుజుకి సెలెరియో సీఎన్‌జీ ప్రత్యేకత దాని మెరుగైన ఫ్యూయల్ ఎఫిషియెన్సీ. ఈ కారు క్లెయిమ్డ్ మైలేజ్ దాదాపు కేజీకి 34.43 కిలోమీటర్లు అని కంపెనీ పేర్కొంది. ఈ 2 కార్లు నగరంలో ప్రతిరోజూ జర్నీకి, చిన్న పార్కింగ్ స్థలాలకు చాలా ఉపయోగపడతాయి. పెద్ద కార్లతో పోలిస్తే వీటిలో స్పేస్, ఫీచర్లు తక్కువగా ఉంటాయి.

టాటా టియాగో (Tata Tiago)

మీరు హ్యాచ్‌బ్యాక్‌లో కొంచెం స్ట్రాంగ్ ఆప్షన్ కోరుకుంటే మాత్రం మీరు టాటా టియాగో సీఎన్‌జీని చెక్ చేయాలి. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. ఇది సీఎన్‌జీ మోడ్‌లో దాదాపు 73 PS పవర్‌ ఇస్తుంది. దీని కొన్ని వేరియంట్లలో ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. ఇది ఈ సెగ్మెంట్‌లో బెస్ట్ ఆప్షన్ అని చెబుతారు.

Also Read: Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?

హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ (Hyundai Exter CNG)

హ్యుందాయ్ ఎక్స్‌టర్ CNG ఎస్‌యూవీ తరహా ఎత్తైన సిట్టింగ్ పొజిషన్, కాంపాక్ట్ సైజ్ కోరుకునే వారికి అనుకూలం. ఇందులో 1.2 లీటర్ ఇంజన్, ట్విన్ సీఎన్‌జీ సిలిండర్ సెటప్ వస్తుంది. కారు బూట్ స్పేస్‌ను మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు. ఈ 2 కార్ల ధరలు మీరు సెలక్ట్ చేసుకునే వేరియంట్‌ను బట్టి మారతాయి.

మారుతి డిజైర్ (Maruti Dzire), బలేనో (Maruti Baleno)

సెడాన్లను ఇష్టపడే వారికి మారుతి సుజుకి డిజైర్ CNG మంచిదని చెప్పవచ్చు. ఇందులో 1.2 లీటర్ ఇంజన్ ఇస్తారు. ఈ సీఎన్‌జీ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు 8.11 లక్షలకు ప్రారంభమవుతుంది. ఆన్ రోడ్ ధర ఎక్కువగా ఉంటుంది.

ఎక్కువ కేబిన్ స్పేస్, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కోరుకునే వారు మారుతి సుజుకి బలేనో సీఎన్‌జీని తీసుకోవచ్చు. ఈ కారు ధర దాదాపు రూ.7.77 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

టాటా పంచ్ సీఎన్‌జీ (Tata Punch CNG)

SUV తరహా బాడీ స్టైల్ ఇష్టమైతే, టాటా పంచ్ సీఎన్‌జీపై ఫోకస్ చేయాలి. ఈ సీఎన్‌జీ ప్రారంభ ధర దాదాపు రూ. 6.80 లక్షలుగా ఉంది. ఇందులో ట్విన్-సిలిండర్ టెక్నాలజీ వస్తుంది. అయితే ఇక్కడ పేర్కొన్నవి కేవలం బేస్ మోడల్ ప్రారంభ ధరలు మాత్రమే. మిగతా వేరియంట్లు, టాప్ వేరియంట్లు 10 లక్షల లోపు ఉండవని గమనించాలి. కారు తీసుకునే ముందు టెస్ట్ డ్రైవ్, బూట్ స్పేస్, మీ ప్రాంతంలో CNG స్టేషన్ల లభ్యతను కూడా చెక్ చేసుకోవడం మంచిది.