Aprilia Military Edition Scooter: భారత యువత పవర్‌ఫుల్, స్పీడ్‌గా వెళ్లే బైక్‌లు, స్కూటర్లు అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే అన్ని కంపెనీలు కూడా ఇవే మోడళ్ల ఆధారంగా తమ బైక్‌లు లేదా స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. భారత టూ-వీలర్ మార్కెట్‌లో స్పోర్టీ, వేగంగా వెళ్లే స్కూటర్ల గురించి మాట్లాడుకుంటే, అప్రిలియా (Aprilia) పేరు అన్నింటికంటే ముందు వరుసలో ఉంటుంది. స్పీడ్, స్టైల్‌ను ఇష్టపడే వారిని మరోసారి ఫిదా చేయడానికి, కంపెనీ 2 అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్స్ Aprilia SR 125, SR 175 ల కొత్త ట్రిబ్యూట్ ఎడిషన్ (Tribute Edition) ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.

ఈ కొత్త స్కూటర్లు భారత సాయుధ దళాల (Indian Armed Forces) గౌరవార్థం ఒక ప్రత్యేకమైన మిలిటరీ థీమ్ (Military Themed Scooter) అవతారంలో వచ్చాయి. వీటి కొత్త, అగ్రెసివ్ లుక్ ఎంత బాగుందంటే, రోడ్డుపై వెళ్తుంటే వీటివైపు ఆసక్తిగా చూస్తారు. మరి ఈ కొత్త స్కూటర్ల గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

మిలిటరీ లుక్ ఆధారంగా లాంచ్

ఈ కొత్త ట్రిబ్యూట్ ఎడిషన్ల యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, వీటి కొత్త ఎక్స్‌టీరియర్ డిజైన్ మరియు కలర్ స్కీమ్. స్కూటర్ల బాడీ మొత్తం మ్యాట్ ఫినిష్‌తో కూడిన మిలిటరీ ఆలివ్ గ్రీన్ బేస్ కలర్‌ను ఉపయోగించారు. ఈ లుక్‌ను మరింత స్పోర్టీగా మార్చడానికి, దీని ఫ్రంట్ అప్రాన్ మరియు సైడ్ ప్యానెల్స్‌పై బ్రైట్ ఎల్లో (మెరిసే పసుపు) మరియు రెడ్ కలర్ గ్రాఫిక్స్ ఇచ్చారు.

Also Read: Bike Customization: సులభంగా కస్టమైజ్ చేయించగల టాప్ 5 బైకులివే..స్పెషల్ లుక్ ఎలా ఇవ్వాలంటే..

ఇది దీనికి ఎంతో ప్రత్యేకమైన, కమాండింగ్ రోడ్ ప్రెజెన్స్‌ను ఇస్తుంది. ఇవే కాకుండా, 14 ఇంచుల పెద్ద బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. ఆరెంజ్ పిన్‌స్ట్రిపింగ్ దీని రేసింగ్ డిఎన్‌ఏను మరింత బ్యూటిఫుల్‌గా మారుస్తుంది.

డిజిటల్ ఫీచర్లు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ

Aprilia కి చెందిన ఈ 2 స్కూటర్లలో స్టైల్‌తో పాటు ఫీచర్లు కూడా బాగుతున్నాయి. ముఖ్యంగా Aprilia SR 175 ట్రిబ్యూట్ ఎడిషన్‌లో ఆధునిక సాంకేతికతపై పూర్తి శ్రద్ధ పెట్టారు. ఇందులో 5 ఇంచుల కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీకి ప్రాపర్ సపోర్ట్ చేస్తుంది.

దీని సహాయంతో రైడర్స్ ప్రయాణంలోనే నావిగేషన్, కాల్స్, మ్యూజిక్ మరియు తమ రైడ్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని స్క్రీన్‌పై చూడవచ్చు. అంతేకాకుండా, రాత్రి వేళల్లో మెరుగైన విజిబిలిటీ కోసం ఇందులో ఫ్రంట్ అప్రాన్-మౌంటెడ్ షార్ప్ LED హెడ్‌ల్యాంప్ మరియు వెనుక వైపు అద్భుతమైన LED టెయిల్‌ల్యాంప్ సెటప్ కూడా ఇచ్చారు.

పవర్‌ఫుల్ ఇంజన్

కంపెనీ వీటి లుక్స్‌ను పూర్తిగా మార్చేసినప్పటికీ, వీటి నమ్మకమైన మెకానికల్ ఇంజన్‌లో ఏ మార్పులు చేయలేదు. SR 125 ట్రిబ్యూట్ ఎడిషన్‌లో పాత 124cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఇచ్చారు. ఇది 10.6 hp పవర్‌ను జనరేట్ చేస్తుంది. మరోవైపు, స్పీడ్‌ను ఇష్టపడే వారి కోసం SR 175 ట్రిబ్యూట్ ఎడిషన్‌లో పెద్ద 174cc ఇంజన్ ఇచ్చారు. ఇది 13.2 hp పవర్‌ను మరియు 14.1 Nm టార్క్‌ను ఆఫర్ చేస్తుంది. సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన ఈ స్కూటర్ రెప్పపాటులో గంటకు 95 కిమీ టాప్ స్పీడ్‌ను అందుకుంటుంది. భద్రత కోసం ఇందులో సింగిల్ ఛానల్ ABS, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.

Also Read: EV vs Petrol Car.. వర్షాకాలంలో ఏది బెటర్? రెండింటి సేఫ్టీ ఫీచర్లు ఎలా ఉంటాయి?

అప్రిలియా స్కూటర్ల ధర ఎంత?

అప్రిలియా ఈ స్పెషల్ ఎడిషన్ల స్కూటర్ల ధరలు తమ స్టాండర్డ్ మోడల్స్ కంటే చాలా తక్కువ ప్రీమియంతో లాంచ్ చేసింది. హైదరాబాద్‌లో Aprilia SR 125 ట్రిబ్యూట్ ఎడిషన్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,11,000 కాగా, ఆన్‌రోడ్ ధర రూ. 1,35,876గా ఉంది. Aprilia SR 125 ట్రిబ్యూట్ ఎడిషన్ ముంబై ఎక్స్-షోరూమ్ ధర ₹1.17 లక్షలుగా ఉంది. రెగ్యులర్ మోడల్ కంటే దాదాపు రూ. 3,000 ఎక్కువ.

మరింత పవర్‌ఫుల్ Aprilia SR 175 ట్రిబ్యూట్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర ₹1.24 లక్షలుగా నిర్ణయించారు. ఇది స్టాక్ వేరియంట్ కంటే దాదాపు రూ.2,000 ఎక్కువ. హైదరాబాద్‌లో Aprilia SR 175 ట్రిబ్యూట్ ఎడిషన్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,21,000 కాగా, ఆన్‌రోడ్ ధర రూ. 1,51,197గా ఉంది. కంపెనీ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో ఈ 2 స్కూటర్ల బుకింగ్స్‌ను ప్రారంభించింది. త్వరలోనే వీటి డెలివరీలు ప్రారంభం అవుతాయి.