అమెరికా ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలకు స్వర్గధామం. ఇలాంటి చోట ఉద్యోగం సంపాదించాలని కొందరు ప్రయత్నాలు చేస్తే, మరికొందరు అక్రమంగానైనా అమెరికాలో సెటిలైపోవాలని ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దులు దాటుతారు. ఏది ఏమైనా, అమెరికా వలసదారులకు ఒక చక్కటి దేశం. అయితే, డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అవగానే, అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి మరీ వారి వారి స్వదేశాలకు బలవంతంగా పంపేశారు. ఇక, ఇక్కడికి నిపుణులుగా అడుగుపెట్టి, ఆయా బహుళజాతి కంపెనీల్లో పని చేస్తోన్న ఉద్యోగులకు కూడా కొత్త కొత్త నిబంధనలు విధించి చమటలు పట్టిస్తున్నారు.

అయితే, అందుకు కారణం అమెరికన్లలో పెరుగుతున్న అభద్రతా భావమేనని విశ్లేషకులు చెబుతున్నారు. తమకు చెందాల్సిన ఉద్యోగాలను విదేశీ వలసదారులు తన్నుకుపోతున్నారన్నది ప్రధాన ఆరోపణ. అందులో ముఖ్యంగా భారతీయులే ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందుకు కారణం, నైపుణ్యం ఉన్న భారతీయ యువత అతి తక్కువ జీతాలకే ఉద్యోగాల్లో చేరడం వల్ల తమకు స్వదేశీ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడం లేదని అమెరికన్లు చెబుతున్నారు. ఈ కారణంగానే అమెరికన్లలో నిరుద్యోగం పెరుగుతోందన్నది ట్రంప్ అభిప్రాయంగా తెలుస్తోంది. ఈ కారణంతోనే అమెరికన్లలో కొందరు భారతీయులను "చీప్ లేబర్"గా ముద్ర వేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఇందులో వాస్తవమెంతో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

H-1B భారతీయ ఉద్యోగికి, అమెరికన్ ఉద్యోగికి మధ్య వేతన తేడా ఏంతో తెలుసా?

అమెరికాలో సాంకేతిక రంగం వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ పరిశ్రమ ఎన్నో ఉద్యోగాలను సృష్టిస్తోంది. అయితే, ఈ ఉద్యోగాలు అమెరికన్లకు అందని ద్రాక్ష పండుగా మారాయి. ఇందుకు వేతనంలో తేడాలే ప్రధాన కారణం. ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగాన్నే మనం ఉదాహరణగా తీసుకుందాం.

ఒక అమెరికన్ సిటిజన్‌ను సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఉద్యోగంలోకి తీసుకుంటే, ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ప్రాంతం సిలికాన్ వ్యాలీ లాంటి ప్రాంతాల్లో వార్షిక వేతనం $140,000 నుంచి $180,000 డాలర్ల వరకు (సుమారు 1.16 కోట్ల నుంచి 1.50 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. అదే ఉద్యోగంలో, హెచ్-1బీ వీసా ఉన్న భారతీయుడు చేరితే, లేబర్ డిపార్ట్‌మెంట్ నిర్ణయించిన సగటు వేతనం చెల్లించాల్సి ఉంటుంది. ఇది సాధారణంగా $110,000 నుంచి $140,000 డాలర్ల వరకు (సుమారు 91 లక్షల నుంచి 1.16 కోట్ల వరకు) ఉంటుంది.

ఈ లెక్కన అమెరికన్ పౌరుడికే ఎక్కువ జీతం చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు, అమెరికన్ పౌరుడి ఉద్యోగ భద్రత కోసం ఆ దేశ చట్టాల ప్రకారం కంపెనీలు మరికొన్ని అదనపు ప్రయోజనాలు కల్పించాల్సి ఉంటుంది. అవేంటంటే:

1.అమెరికన్ సిటిజన్ తనకు ఇష్టం లేకపోతే వేరే కంపెనీకి మారవచ్చు. కానీ, హెచ్-1బీ వీసా ఉన్న ఉద్యోగి కొత్త కంపెనీకి మారాలంటే, వీసా బదిలీ (H-1B Visa Transfer) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

2.అమెరికన్ సిటిజన్ కంపెనీలో ఎలాంటి తప్పు చేయకుండా ఉద్యోగం కోల్పోతే, నిరుద్యోగ బీమా పొందడానికి అర్హుడు అవుతాడు. ఈ నిరుద్యోగ బీమాను అమెరికన్ కంపెనీలే చెల్లించాల్సి ఉంటుంది. హెచ్-1బీ ఉద్యోగికి ఇలాంటి ప్రయోజనాలు ఉండవు.

3. అమెరికన్ పౌరుడు ఉద్యోగం కోల్పోయినా, తన పౌరసత్వం కారణంగా దేశం విడిచిపెట్టి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ హెచ్-1బీ ఉద్యోగి తన ఉద్యోగం కోల్పోతే, గడువు లోపల మరో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి, లేకపోతే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది.

4. అదనపు ఆదాయం కోసం అమెరికన్ పౌరుడు ప్రస్తుత ఉద్యోగంతోపాటు, ఫ్రీలాన్సింగ్ వంటి ఇతర పనులు చేసుకోవచ్చు. కానీ, హెచ్-1బీ వీసా ఉన్న వలస ఉద్యోగి మాత్రం అలా చేయడానికి చట్టాలు అనుమతించవు.

5. అమెరికన్ సిటిజన్ తన దేశంలో ఎక్కడికైనా వెళ్లి పని చేసే వీలుంటుంది. కానీ, హెచ్-1బీ వీసా ఉన్న ఉద్యోగి పని చేసే స్థలం ముందే నిర్ణయించబడి ఉంటుంది. స్థలం మారాల్సి వస్తే **ఎల్.సి.ఎ. (లేబర్ కండిషన్ అప్లికేషన్)**ను సవరించాల్సిన అవసరం ఉంటుంది.

ఇలా అమెరికన్లకు అదనపు ప్రయోజనాలతోపాటు, పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కానీ, వలస ఉద్యోగికి ఎలాంటి వెసులుబాటు ఉండదు.

వలస ఉద్యోగులతో కంపెనీలకు లాభం

లాభాల కోసం పని చేసే పరిశ్రమలు, ఆయా కంపెనీలు తమ ఖర్చును తగ్గించుకోవడానికి సర్వదా ప్రయత్నిస్తుంటాయి. ఇందుకోసం ఉద్యోగాల కోత, ఉద్యోగుల వేతనాలు, చెల్లించే ప్రయోజనాల్లో కోత ద్వారా తమ ఖర్చులు తగ్గించుకోవడానికి చూస్తాయి. అమెరికన్ కంపెనీలు కూడా వీసా నిబంధనల కారణంగా, అంటే హెచ్-1బీ వీసాల ద్వారా విదేశీ ఉద్యోగులను తీసుకోవడానికి ఇష్టపడుతున్నాయి.

అమెరికన్ సిటిజన్ కు ఉద్యోగం ఇస్తే అధిక వేతనం, ఇతర ప్రయోజనాలు కల్పించాల్సి ఉంటుంది. అదే వలస ఉద్యోగికి అయితే, వేతనం తగ్గించవచ్చు, అదనపు ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం లేదు. ఈ కారణంగా, అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వడం కన్నా విదేశీ ఉద్యోగులకు ఇస్తేనే లాభదాయకం అన్న ఆలోచనలో అక్కడి కంపెనీలు ఉంటున్నాయి.

అంతేకాకుండా, అమెరికన్ల విషయంలో కంపెనీలు అక్కడి స్థానిక పౌరసత్వ చట్టాల మేరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే అక్కడి లేబర్ చట్టాలు, న్యాయస్థానాల ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే వలస ఉద్యోగి అయితే, ఉద్యోగం పోతే ఇబ్బందులు తప్పవన్న ఆందోళనతో కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న ఆలోచనతో కూడా చాలా కంపెనీలు హెచ్-1బీ వీసా ద్వారా విదేశీయులకు అవకాశాలు ఇస్తున్నాయి.

ఉద్యోగ అభద్రతతోనే ఇండియన్లను "చీప్ లేబర్" అని విమర్శిస్తున్న అమెరికన్లు

అమెరికాలో భారతీయ ఉద్యోగుల వల్ల తమకు ఉద్యోగావకాశాలు పోతున్నాయన్న ఆందోళనతో అమెరికన్లు ఉంటున్నారు. ఇది మాత్రమే కాదు, ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న అమెరికన్ల జీతాల పెంపుదల ఆగిపోవడానికి ఇండియన్సే కారణమన్న విమర్శ కూడా ఉంది. తక్కువ వేతనంతో విదేశీయులను ఉద్యోగాల్లో పెట్టుకునే వెసులుబాటు కంపెనీలకు ఉండడంతో, స్థానిక ఉద్యోగులకు వేతనాలు పెంచేందుకు కంపెనీలు సిద్ధపడడం లేదన్న చర్చ అమెరికన్లలో సాగుతోంది.

ఇక, లే-ఆఫ్ పరిస్థితులు తలెత్తితే, కంపెనీలు ఎక్కువ వేతనాలు చెల్లించే అమెరికన్లను తొలగించి, తక్కువ వేతనాలు ఉన్న భారతీయులను తొలగించకపోవడం, తొలగించిన అమెరికన్ల స్థానంలో తక్కువ వేతనంకు పని చేసే వలస ఉద్యోగులను నియమించుకోవడం కూడా అమెరికన్ల అభద్రతకు కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా, ఉద్యోగాలు పొందే విషయంలో కూడా నైపుణ్యం ఉన్న భారతీయ యువత రావడంతో, అమెరికన్లు ఈ పోటీలో వెనకబడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ ఉద్యోగం వచ్చినా, దాన్ని కాపాడుకోవడం కష్టతరంగా మారిందన్న అభిప్రాయంలో అమెరికన్లు ఉన్నారు.

ఆ కారణాల కారణంగానే, అమెరికన్లు అక్కడ పని చేస్తోన్న ఇండియన్స్‌ను "చీప్ లేబర్"గా విమర్శిస్తున్నారు. వీసా నిబంధనలు కఠినతరం చేయాలని, స్థానిక ఉద్యోగులకు అవకాశాలు కల్పించాలని అమెరికన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.