CRDA Cancels R5 Zone in Amaravati | అమరావతి: రాజధాని అమరావతికి సంబంధించి సీఆర్డీఏ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఆర్-5 (R5) జోన్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్5 జోన్ కింద కేటాయించిన భూములను తిరిగి వెనక్కి తీసుకోవాలని, ఇందుకోసం రెవెన్యూ శాఖకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. ఈ జోన్ పరిధిలోకి వచ్చే 1402.58 ఎకరాల భూమిని తిరిగి సీఆర్డీఏ స్వాధీనం చేసుకునేలా తీర్మానించారు. అమరావతి మాస్టర్ ప్లాన్ కాపాడుతూనే, పేదలకు వారి సొంత ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

2023 కంటే ముందున్న విధంగానే ఆర్-5 జోన్

గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లను, భూ పంపిణీ ఉత్తర్వులను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం రాజధాని మాస్టర్ ప్లాన్ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. వైసిపి హయాంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50 వేల కుటుంబాలకు ఈ ఆర్-5 జోన్ పరిధిలో ఇళ్ల స్థలాలను మంజూరు చేశారు. అయితే, రాజధాని నడిబొడ్డున ఇలాంటి జోన్ ఏర్పాటు చేయడం వల్ల అమరావతి మాస్టర్ ప్లాన్ దెబ్బతింటుందని, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని సీఆర్డీఏ భావించింది. ఈ క్రమంలో అమరావతి రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా 2023 కంటే ముందున్న స్థితిలోనే ఆర్-5 జోన్ ప్రాంతాన్ని కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

🚨APCRDA Authority Decision#APCRDA will serve the final notice to the Revenue Dept and take back "R5-Zone" lands that damage the master plan.

🔸Revenue Dept didn't pay money for 900 Acres to #APCRDA, based on this, the land will be taken back.#AndhraPradesh #Amaravati pic.twitter.com/tb9MMLsjSy

— Andhra & Amaravati Updates (@AP_CRDANews) February 22, 2026

ఇక ఈ జోన్‌లో ఇప్పటికే ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారుల విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయం ప్రకటించింది. వారికి రాజధాని కోర్ ఏరియా వెలుపల, ఆయా జిల్లాల్లోని వేరొక అనువైన చోట ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. తద్వారా అటు పేదలకు ఇళ్ల స్థలాల లబ్ధిని చేకూరుస్తూనే, ఇటు అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించింది. ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు పలు ప్రముఖ బ్యాంకులకు స్థలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణ పనులకు సంబంధించి పెండింగ్‌ పనులకు అనుమతులు ఇచ్చారు.

పెండింగ్ పనుల టెండర్లకు సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్..

గత ప్రభుత్వం విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన కుటుంబాలకు ఇళ్ల స్థలాల కోసం సీఆర్డీఏ భూముల కేటాయింపుల వల్ల రాజధాని మాస్టర్ ప్లాన్ దెబ్బతింటుందని, అభివృద్ధికి సైతం ఆటంకాలు తలెత్తుతాయని సీఆర్డీఏ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. గతంలో బీజేపీ ఆఫీసుకు కేటాయించిన భూమిలో సాంకేతిక కారణాల వల్ల మార్పులు చేస్తూ 1.43 ఎకరాలను వేరే చోట కేటాయించారు. కొత్తగా 7 సంస్థలకు భూ కేటాయింపులు చేయడంతో పాటు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఎంఈపీ (MEP) పనులకు టెండర్లు పిలిచేందుకు సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని భూములకు సంబంధించి రెవెన్యూ శాఖ చెల్లించాల్సిన బాకీలు ఉండటంతో, ఆ భూములను తిరిగి సీఆర్డీఏ స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది.