Jagan criticized Chandrababu for bringing disaster: ఆంధ్రప్రదేశ్ లో తుపాను మొంథా చంద్రబాబు తెచ్చిన విపత్తు అని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. బుధవారం బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన ఆయన గురువారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు తుపాను వచ్చినందున దిగుబడులు బాగా తగ్గిపోతాయన్నారు. నేలకొరిగిన పంట తిరిగి నిలబడటం కష్టమవుతుంది తెలిపారు. 25 జిల్లాల్లో 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని జగన్ తెలిపారు. 11 లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం దాటిల్లిందని.. 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరు శనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్‌ పంటలు దెబ్బతిన్నాయన్నారు. రైతులకు పార్టీ పరంగా తోడుగా నిలబడాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.

రైతులకు టీడీపీ ప్రభుత్వం సాయం చేయడం లేదన్నారు. మన ప్రభుత్వంలో ఆర్బీకేల వ్యవస్థ అప్రమత్తంగా ఉండేది. ప్రతి పంటకూ ఇ-క్రాప్‌ చేసే వాళ్లమని గుర్తు చేశారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు సమన్వయంతో పని చేసి.. ఉచిత పంటలబీమాతో రైతులకు భరోసా ఉండేదన్నారు. 80 లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండటం వల్ల 70 లక్షల ఎకరాల పంట బీమా పరిధిలో ఉండేది. ప్రీమియం కట్టిన రైతులు 19 లక్షలమందికి మాత్రమే బీమా అందుబాటులో ఉంది. మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలని జగన్ ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో అల్పపీడనలు, వాయుగుండాలు, తుపాన్లు కారణంగా 16 వచ్చాయని జగన్ లెక్క చెప్పారు. ఎన్ని విపత్తులు వచ్చినా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోలేదన్నారు. ఏ రైతునూ ఆదుకున్న పరిస్థితి లేదు. ఇ-క్రాప్‌ అందించిన పరిస్థితి కూడా లేదు. వాళ్లు వేసిన అరకొర లెక్కల ప్రకారమే 5.5 లక్షలమంది రైతులకు రూ.600 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. మిర్చికి క్వింటాలుకు రూ.11,781కి కొనుగోలు చేస్తామన్నారు ఒక్క రూపాయికూడా రైతుకు ఇవ్వలేదు. పొగాకును కొనుగోలు చేస్తామ న్నారు దిక్కూ మొక్కూ లేదు. మామిడిని కిలో రూ.12లకు కొనుగోలు చేస్తామన్నారు. ఒక్క రైతు నుంచీ కొనుగోలు చేయలేదన్నారు. ఉల్లి రైతులకు హెక్టారుకు యాభై వేలు ఇస్తామన్నారు. అదికూడా ఇచ్చిన పాపాన పోలేదు.

ఇ-క్రాప్‌ నీరుగార్చారని జగన్ అన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వం తరఫున ప్రీమియం కట్టి 54.55 లక్షల మంది రైతులకు రూ.7800 కోట్లు ఇన్సూరెన్స్‌ ఇప్పించగలిగాం. కాని ఇవాళ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం రైతుల నడ్డి విరిచింది. చంద్రబాబు సృష్టించిన విపత్తు ఇది అని జగన్ విమర్శలు గుప్పించారు. పార్టీ నేతలందరూ.. రైతులకు మేలు చేయాలని.. సాయం చేయాలని పిలుపునిచ్చారు.