TDP Alliance Broken Promises Women: ఆంధ్రప్రదేశ్‌లో మహిళా స్వయం సహాయక సంఘాలకు అందుతున్న రుణ సహాయంలో తీవ్ర క్షీణత కనిపిస్తోందని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీస్తోందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన మరో హామీని నిలుపుకోవడంలో ఘోరంగా విఫలమైందని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గ్రామీణ ఆర్థిక రంగానికి జీవనాడి లాంటి డ్వాక్రా రుణాల వృద్ధి పడిపోవడం అనేది.. నేడు రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులకు, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడానికి నిదర్శనమని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఆర్థిక సంక్షోభానికి అద్దం పడుతున్న పన్నుల ఆదాయం!

రుణాల వృద్ధి రేటు తగ్గడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పాదక పెట్టుబడులు, తద్వారా ఆదాయాలు తగ్గిపోయాయని వైఎస్ జగన్ విశ్లేషించారు. దీని ప్రభావం నేరుగా వినియోగంపై పడిందని, అందుకే 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ పన్నుల ఆదాయ వృద్ధి రేటు మైనస్ లో నమోదు కావడం స్పష్టమైన ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తోందని గుర్తుచేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం వడ్డీ లేని రుణాల పథకం కింద రూ. 4,969 కోట్ల నేరుగా సాయం అందించడంతో పాటు ఆసరా , చేయూత వంటి విప్లవాత్మక కార్యక్రమాలతో మహిళలను ఆర్థికంగా నిలబెట్టామని ఆయన వివరించారు.

రూ. 10 లక్షల హామీ ఏమైంది? కూటమిపై జగన్ ప్రశ్నల వర్షం

ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ-జనసేన కూటమి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక పూర్తిగా గాలికొదిలేశారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. డ్వాక్రా మహిళల వడ్డీ లేని రుణ పరిమితిని రూ. 3 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచుతామని చెప్పి, నేడు ఉన్న పథకాన్ని కూడా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. గత రెండేళ్ల బడ్జెట్ గణాంకాలను ప్రస్తావిస్తూ.. 2024-25లో వడ్డీ సబ్సిడీ కింద విడుదల చేసిన నిధులు సున్నా అని, 2025-26 బడ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయించినా విడుదల చేసింది మళ్లీ సున్నా అని ఎండగట్టారు. పెంచిన హామీ ప్రకారం చూసుకుంటే.. ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఇవ్వాల్సిన దాదాపు రూ. 6,000 కోట్ల నిధులను నొక్కేసిందని జగన్ విమర్శించారు.

రూ. 49 వేల కోట్ల నుండి రూ. 41 వేల కోట్లకు పడిపోయిన రుణాలు

గత వైసీపీ పాలనలో మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ రుణాలు క్రమబద్ధంగా పెరిగాయని, ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అవి దారుణంగా పడిపోయాయని జగన్ గణాంకాలతో సహా నిరూపించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 49,696 కోట్లుగా ఉన్న ఎస్‌హెచ్‌జీ రుణాలు.. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024-25 నాటికి రూ. 41,623 కోట్లకు, అలాగే 2025-26 నాటికి మరింతగా రూ. 41,105 కోట్లకు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లేకపోవడం వల్లే బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడానికి వెనకాడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

𝗖𝗼𝗻𝘀𝗲𝗾𝘂𝗲𝗻𝗰𝗲𝘀 𝗼𝗳 𝗮𝗻𝗼𝘁𝗵𝗲𝗿 𝗯𝗿𝗼𝗸𝗲𝗻 𝗽𝗿𝗼𝗺𝗶𝘀𝗲 𝘁𝗼 𝘄𝗼𝗺𝗲𝗻

Credit growth to Self Help Groups is vital and is regarded as the lifeblood of rural economy. Credit growth indicates productive investments strengthening the SHGs' income generating ability… pic.twitter.com/Ql4wamJ4mg

— YS Jagan Mohan Reddy (@ysjagan) June 25, 2026

మహిళల ద్రోహంపై వైసీపీ క్షేత్రస్థాయి పోరాటం!

కూటమి ప్రభుత్వం మహిళా లోకాన్ని మోసం చేసిందని, దీనిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని వైఎస్ జగన్ అన్నారు. కేవలం గ్రాఫిక్స్, అబద్ధపు ప్రచారాలతో కాలం వెళ్లదీస్తున్న పాలకులకు డ్వాక్రా మహిళలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బడ్జెట్ కేటాయింపులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, తక్షణమే మహిళా సంఘాల వడ్డీ సబ్సిడీ నిధులను విడుదల చేయాలని, రూ. 10 లక్షల రుణ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సాధికారతను దెబ్బతీసే ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలపై వైసీపీ క్షేత్రస్థాయిలో పోరాడుతుందని స్పష్టం చేశారు.