అమరావతి: యూట్యూబర్‌ ప్రశ్న రావణ్ (బచ్చలకూరి జోసెఫ్‌)కు విదేశాల నుంచి భారీగా నిధులు సమకూరినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సైతం పర్యటించారని, వారి భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు పోలీసులు భావిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా పోలీసులు రావణ్‌ను 7 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.

నిందితుడు రావణ్‌కు విదేశాల నుంచి విడతల వారీగా సుమారు రూ.29 లక్షలకు పైగా నిధులు బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పలుమార్లు పర్యటించడంతో పాటు వారి భావజాలాన్ని వ్యాప్తిచేయాలని చూసినట్లు అనుమానిస్తున్నారు. పలు నిషేధిత సంస్థల సానుభూతిపరులతో నిరంతరం కాంటాక్టులో ఉన్నట్లు ఆధారాలు లభించాయి. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ లావాదేవీలపై పోలీసులు ప్రశ్నించినప్పటికీ రావణ్ నోరువిప్పలేదు.

వైఎస్‌ఆర్‌సీపీ నేత నుంచి నిధులు

వైసీపీ నేత ఇంద్రసేనా నాయుడు ఖాతా నుంచి పలు విడతల్లో దాదాపు రూ.25 లక్షల వరకు రావణ్‌కు చేరినట్లు దర్యాప్తులో గుర్తించారు. నిందితుడు ప్రయాణాలకు విమాన టికెట్లను కూడా ఆయనే బుక్ చేసినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, కీలక రాజకీయ నాయకులే లక్ష్యంగా చేసుకొని దుష్ప్రచారం చేస్తూ వీడియోలు రూపొందించేందుకే ఈ నిధులు సమకూర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇంద్రసేనా నాయుడు ఫ్లాట్‌ నుంచే ప్రశ్న యూట్యూబ్ ఛానల్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

మావోయిస్టు ఉద్యమానికి మద్దతుగా కంటెంట్

నిషేధిత మావోయిస్టు ఉద్యమాన్ని, ఆ పార్టీ అగ్రనేతలను పొగుడుతూ రావణ్‌ తన ఛానల్‌లో అనేక వీడియోలు రూపొందించాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని ఏజెన్సీ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పలుమార్లు పర్యటిస్తూ, అక్కడి సానుభూతిపరులతో తరచూ ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు కాల్ డేటా ద్వారా గుర్తించారు. సాయుధ పోరాటానికి మద్దతుగా కంటెంట్ తయారీ, ఎడిటింగ్, ప్రచారంలో రావణ్ కీలక పాత్ర పోషించాడని దర్యాప్తులో వెల్లడైంది. అతడి యూట్యూబ్‌ ఛానల్‌ సబ్‌స్క్రైబర్లలో భారీగా ఫేక్ కఅౌంట్లు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విదేశీ నిధులతో పాటు వైసీపీ నేత ఇంద్రసేనా నాయుడు నుంచి నగదు రావణ్‌కు ఎందుకు వచ్చిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.