Anaswara Rajan's With Love Movie Review Telugu: 'ఛాంపియన్'తో తెలుగు చిత్రసీమకు కథానాయికగా పరిచయమైన మలయాళీ అమ్మాయి అనస్వర రాజన్. తమిళ తెరకు కథానాయికగా ఆమె పరిచయమైన సినిమా 'విత్ లవ్'. 'టూరిస్ట్ ఫ్యామిలీ' దర్శకుడు అభిషన్ జీవింత్ హీరో. 'లవర్', 'టూరిస్ట్ ఫ్యామిలీ' చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన మదన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య ఓ నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 6న విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ (With Love Movie Story): సత్య (అభిషన్ జీవింత్) డిజైనర్. పెళ్లి చూపులకు వెళితే... ఆ అమ్మాయి స్కూల్‌లో తనకు రెండేళ్లు జూనియర్ మనీషా (అనస్వర రాజన్) అని తెలుస్తుంది. ఇద్దరూ తమ తమ పాత (స్కూల్) ప్రేమ కథలను గుర్తు చేసుకుంటారు.

స్కూల్‌లో అనీషా (కావ్య అనిల్)ను సత్య... బాలాజీ (సచిన్ నాచియప్పన్)ను మనీషా ఇష్టపడతారు. అయితే... మనసులో విషయాన్ని అవతలి వ్యక్తులకు చెప్పలేకపోతారు. ఇప్పుడు అనీషా, బాలాజీ ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వాళ్ళ దగ్గరకు వెళ్లి అసలు విషయం చెప్పాలనుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? అసలు సత్య, మనీషా 'పెళ్లి చూపులు' ఏమయ్యాయి? ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందా? లేదా? స్కూల్‌లో ప్రేమించిన వ్యక్తులు కనిపించిన తర్వాత ఏం చేశారు? అనేది సినిమా.

విశ్లేషణ (With Love Telugu Review): 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్' గుర్తు ఉందా? పెళ్లికి ముందు హీరో తాను ప్రేమించిన అమ్మాయిలను వెతుకుతూ వెళతాడు. బట్, ఫర్ ఏ ఛేంజ్... 'విత్ లవ్'లో హీరోతో పాటు హీరోయిన్ - ఇద్దరూ కలిసి మాజీ ప్రేమికులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని, గతంలో తమ ఫీలింగ్స్ ఏమిటో చెప్పాలని బయలు దేరతారు. అయితే... రెండు సినిమాల మధ్య చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంది.

'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్', 'విత్ లవ్' సినిమాల్లో కోర్ పాయింట్ ఒక్కటే కామన్. అందులో సిమిలారిటీస్ కనిపిస్తాయి కానీ సన్నివేశాల్లో కాదు. 'విత్ లవ్' మొదలైన సీన్ నుంచి ఎండింగ్ వరకు... హీరో హీరోయిన్ల మధ్య ప్రతి సన్నివేశంలో కొత్తదనం కనిపిస్తుంది. ఇప్పటి వరకు స్కూల్ నేపథ్యంలో చాలా ప్రేమ కథలు చూసుంటాం. కానీ, 'విత్ లవ్'లో ఇద్దరి ప్రేమ కథలు చాలా కొత్తగా ఉంటాయి. అడుగడుగునా నవ్విస్తాయి. మనం చూసిన కథలకు కామెడీ కోటింగ్ ఇవ్వడంలో దర్శకుడు మదన్ సూపర్ సక్సెస్ అయ్యారు.

క్లాస్‌మేట్ మీద ప్రేమ, ఆకర్షణ కలగడం సహజం. ఆ తరహా సన్నివేశాలను వినోదాత్మకంగా చూపించిన తీరు బావుంది. సాధారణంగా సినిమాల్లో హీరో రెబల్ అన్నట్టు, హీరోయిన్ అమాయకంగా కనిపిస్తారు. కానీ, ఈ సినిమాలో రివర్స్. హీరోయిన్ రెబల్ & హీరో కొంచెం సిగ్గరి, భయస్తుడు. ఆ పాయింట్స్ నుంచి మంచి కామెడీ జనరేట్ చేశారు దర్శకుడు మదన్.

ప్రతి ప్రేక్షకుడి పాఠశాల జీవితంలోనూ ఓ ప్రేమ / ఆకర్షణ తప్పకుండా ఉంటాయి. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసేలా 'విత్ లవ్' ఫస్టాఫ్ అంతా సరదాగా, అసలు సమయం తెలియకుండా ముందుకు వెళుతుంది. సెకండాఫ్ వచ్చేసరికి అసలు కథలోకి వెళ్లడం, ఎమోషనల్ & సీరియస్ టాపిక్స్ టచ్ చేయడంతో సన్నివేశాలు కాస్త నిదానంగా ముందుకు సాగుతాయి. అప్ అండ్ డౌన్స్ రైడ్ అనిపిస్తుంది. చివరకు హృదయానికి హత్తుకునే మంచి మెమరీతో బయటకు పంపిస్తారు. కథలో బలమైన అంశాల అంటే సన్నివేశాల్లో మూమెంట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు మదన్.

Also Read: With Love OTT: విత్ లవ్ ఓటీటీ... హీరోగా టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

దర్శకుడికి టెక్నికల్ టీమ్ నుంచి సూపర్బ్ సపోర్ట్ లభించింది. హీరో ఫ్లాట్, కాఫీ షాప్, స్కూల్, పార్క్... సినిమాలో పెద్దగా లొకేషన్లు లేవు. కానీ ప్రతి సీన్ చక్కటి ఫీల్ ఇచ్చేలా శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ సాగింది. సియాన్ రోనాల్డ్ మ్యూజిక్ కూడా బావుంది. పాటలతో పాటు నేపథ్య సంగీతం కథకు చక్కగా సరిపోయింది. 'అయ్యో కదలే', 'మరచిపోవాలి మనసా...' బాణీలు బావున్నాయి. అయితే సాహిత్యంలో మరింత కేర్ తీసుకోవాల్సింది. కానీ, డబ్బింగ్ డైలాగ్స్ అన్నట్టు కాకుండా తెలుగు యువత వాడుక భాషలో కలిసిన మీమ్ లాంగ్వేజ్ వాడిన తీరు సూపర్బ్. నిర్మాణ విలువలు బావున్నాయి.

మదన్ రచన, దర్శకత్వానికి తోడు 'విత్ లవ్'కు అసలైన బలం హీరో హీరోయిన్లు అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ నటన. వాళ్లిద్దరూ నటించలేదు. తమ పాత్రల్లో జీవించారు. తెరపై అభిషన్ జీవింత్ కనిపించిన ప్రతిసారీ మన పక్కింటి కుర్రాడు అన్నట్టు ఉంటారు. అతని నటన సహజంగా ఉంది. అనస్వర రాజన్ అయితే ప్రతి సీన్, పాటలో 'ది బెస్ట్' ఇచ్చారు. సన్నివేశంలో లోపాలు ఉన్నా కవర్ అయ్యేంతలా ఆమె స్క్రీన్ ప్రజెన్స్, నటన సాగాయి. కావ్య అనిల్, సచిన్ నాచియప్పన్ సైతం చక్కగా నటించారు.

స్కూల్ లైఫ్‌లో ప్రతి ఒక్కరికీ ఎవరో ఒకరి మీద ప్రేమ లేదా ఆకర్షణ తప్పకుండా ఉంటాయి. నచ్చిన వాళ్ళకు మనసులో మాట చెప్పలేని వ్యక్తులు సైతం కొందరు ఉంటారు. అటువంటి వాళ్లందరికీ ఆ లైఫ్ మళ్ళీ గుర్తు చేస్తూ... నోస్టాల్జియా ఫీల్ ఇచ్చే మంచి సినిమా 'విత్ లవ్'. ఇందులో ప్రేమ కంటే వినోదం ఎక్కువగా ఉంది. ప్రేక్షకులను పుష్కలంగా నవ్విస్తుంది. హాయిగా సాగిపోయే, నవ్వించే చిత్రమిది. కుటుంబంతో కలిసి చూడవచ్చు.

Also Read: Barabar Premistha Controversy: బూతు పాటపై విమర్శలు... వెనక్కి తగ్గని యాటిట్యూడ్ స్టార్... అసలు ఏంటీ బరాబర్ కాంట్రవర్సీ?