BJP Star Campaigners | కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సహా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆదివారం విడుదల చేసింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, సినీ, వ్యాపార ప్రముఖుల పేర్లు ఉన్నాయి.

బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, అశ్విని వైష్ణవ్ ఉన్నారు. అలాగే మిథున్ చక్రవర్తి, స్మృతి ఇరానీ, కంగనా రనౌత్ హేమమాలిని, మనోజ్ తివారీ కూడా బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. వీరితో పాటు ఇటీవల బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కూడా పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు.

బీజేపీ తరఫున ప్రచార బరిలోకి పలు రాష్ట్రాల సీఎంలు

అసోం సీఎం హిమంత బిస్వా శర్మ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సహా దేవేంద్ర ఫడ్నవీస్, మోహన్ చరణ్ మాఝీ, భూపేంద్ర యాదవ్, మాణిక్ సాహా, అనురాగ్ ఠాకూర్, అన్నపూర్ణా దేవి, అర్జున్ ముండా, బాబూలాల్ మరాండీలను కూడా బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. సునీల్ బన్సల్, సామ్రాట్ చౌదరి, బిప్లబ్ కుమార్ దేబ్, సువేందు అధికారి, మంగళ్ పాండే, అమిత్ మాలవీయ, సామిక్ భట్టాచార్య, దిలీప్ ఘోష్, డాక్టర్ సుకాంత మజుందార్, శంతను ఠాకూర్, రాజు బిస్తా, డాక్టర్ జయంత కుమార్ రాయ్, మనోజ్ తిగ్గా, బిజన్ గోస్వామి వంటి ప్రముఖ నేతలు బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి బీజేపీ తరఫున ప్రచారం చేయనున్న స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు.

మొత్తం 292 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టిన బీజేపీ

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ తొలి జాబితాలో 144 మంది అభ్యర్థులు, రెండో జాబితాలో 111, మూడో జాబితాలో 19 మంది, నాలుగో జాబితాలో 13 మంది, 5వ జాబితాలో ఐదుగురు అభ్యర్థుల పేర్లను అధిష్టానం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో పోలింగ్ జరగనుందని ఈసీ కొన్ని రోజుల కిందట ప్రకటించింది. మొదటి దశలో ఏప్రిల్ 23న, రెండో దశలో ఏప్రిల్ 29న ఈసీ పోలింగ్ నిర్వహించనుంది. అందుకు ఏర్పాట్లు చేస్తోంది. మే 4న ఓట్లు లెక్కించి విజేతల్ని ప్రకటించనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఈసారి సైతం బెంగాల్‌లో ఎలక్షన్ హోరాహోరీగా జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ఈసారి సీఎం మమతా బెనర్జీ టీఎంసీ పార్టీకి గట్టి పోటీ తప్పదనిపిస్తోంది.