Suvendu Adhikari | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో భాగంగా బుధవారం (ఏప్రిల్ 29) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి ఓటు హక్కు అవకాశాన్ని కల్పించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ బెంగాల్‌లో తన కంచుకోటను నిలబెట్టుకుంటుందా లేదా బీజేపీ ఈసారైనా పాగా వేసి అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అనేది తేల్చే ఎన్నికలు ఇవి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల రెండో దశలో భాగంగా నేడు 142 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. కోల్‌కతా సహా ఆరు జిల్లాల్లోని 142 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. ఈ విడతలో 3.21 కోట్లకు పైగా ఓటర్లు మమతా బెనర్జీ, సువెందు అధికారి సహా 1,448 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

బెంగాల్ రెండో దశలో 142 స్థానాల్లో ఓటింగ్

ఎన్నికల సంఘం తెలిపిన ప్రకారం ఎన్నికలు జరుగుతున్న 142 స్థానాల్లో మొత్తం 3,21,73,837 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,64,35,627 మంది పురుషులు కాగా, 1,57,37,418 మంది మహిళా ఓటర్లు, 792 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఇదివరకే ఓటర్లకు ఫోటో గుర్తింపు కార్డులు అందజేశారు. ఓటర్లలో 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారు 3,243 మంది ఓటర్లు ఉండగా, 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 1,96,801గా ఉండటం విశేషం. 146 మంది NRI ఓటర్లు, 39,961 మంది సర్వీస్ ఓటర్లు ఈ రెండో దశలో ఓటు వేయనున్నారు.

బరిలో 1,448 మంది అభ్యర్థులు

బెంగాల్ రెండో దశలో 142 స్థానాల్లో మొత్తం 1,448 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరిలో 1,228 మంది పురుషులు, 220 మంది మహిళా అభ్యర్థులున్నారు. ఈ స్థానాల్లో 107 సాధారణ కేటగిరీ కాగా, 34 స్థానాలు షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), ఒక స్థానం షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) రిజర్వ్డ్ ఉన్నాయి. దక్షిణ 24 పరగణా జిల్లాలోని భాంగర్‌లో అత్యధికంగా 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. హుగ్లీ జిల్లాలోని ఒక స్థానంలో అత్యల్పంగా ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు.

కేంద్ర బలగాల మోహరింపు

కోల్‌కతాతో పాటు ఓటింగ్ జరిగే జిల్లాల్లో నదియా, హుగ్లీ, పూర్వ బర్ధమాన్, హౌరా, దక్షిణ 24 పరగణా, ఉత్తర 24 పరగణా ఉన్నాయి. మొత్తం 41,001 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. వీటిలో 39,301 ప్రధాన కేంద్రాలు, 1,700 సహాయక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసి పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలను మోహరించారు. వీటితో పాటు పశ్చిమ బెంగాల్ పోలీసులు, కోల్‌కతా పోలీసులు కూడా డ్యూటీలో ఉన్నారు.

ఐదు సంవత్సరాల క్రితం బీజేపీ దూకుడుగా ప్రచారం చేసినప్పటికీ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ దక్షిణ బెంగాల్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది మరియు రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈ ఫలితం ఏమిటంటే, మీరు పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని పొందాలనుకుంటే, దక్షిణ బెంగాల్‌లో గెలవడం చాలా ముఖ్యం.

రెండో దశలో మమత వర్సెస్ సువేందు..

కీలకమైన భవానిపూర్ అసెంబ్లీ స్థానానికి కూడా ఇదే దశలో పోలింగ్ జరుగుతోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కంచుకోట కాగా, బీజేపీ ఇక్కడ ప్రతిపక్ష నేత సువేందు అధికారిని బరిలో నిలిపింది. ఇది బీజేపీకి కీలకం కానుంది. గత ఎన్నికల్లో మమతాను ఎమ్మెల్యేగా ఓడించిన సువేందు మరోసారి తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు. అధికార వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, పౌరసత్వ రాజకీయాలు మమతపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మాట్లాడుతూ 'ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. అన్ని భద్రతా బలగాలను ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మోహరించాం. సీసీటీవీలు అమర్చి, వాటిని పరీక్షించారని’ తెలిపారు.