Former Bus Driver Cash Recovery:  పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో బుధవారం నిర్వహించిన ఒక భారీ తనిఖీ సంచలనం సృష్టించింది. ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా పనిచేసి, కొన్నేళ్ల క్రితం ఆ ఉద్యోగాన్ని వదిలేసి రాళ్ల వ్యాపారిగా మారిన మినార్ మోండల్ ఇంట్లో పోలీసులు నిర్వహించిన దాడిలో కోట్ల కొద్దీ నోట్ల కట్టలు, భారీగా బంగారం బయటపడింది. బీర్భూమ్ జిల్లాలోని మహమ్మద్‌బజార్ పోలీసు స్టేషన్ పరిధిలోని దేవుచ ప్రాంతంలో ఉన్న ఆయన నివాసంలో పోలీసులు జరిపిన తనిఖీలు బెంగాల్ రాజకీయ, వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి.

మినార్ మోండల్ స్థానికంగా పేరుగాంచిన రాళ్లు , ఇసుక వ్యాపారి తులూ మోండల్‌కు సమీప బంధువు . కొన్ని సంవత్సరాల క్రితం వరకు సాధారణ రవాణా సంస్థ బస్సు డ్రైవర్‌గా పనిచేసిన మినార్, ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి తులూ మోండల్ వద్ద భాగస్వామిగా చేరారని పోలీసులు తెలిపారు. తులూ మోండల్‌కు ఉన్న రాజకీయ, వ్యాపార ప్రాబల్యాన్ని ఉపయోగించుకుని, అక్రమ మైనింగ్ , ఇసుక మాఫియా వ్యాపారాల్లో మినార్ మోండల్ కొద్దికాలంలోనే వందల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు మినార్ ఇంట్లోకి ప్రవేశించగానే గోనె సంచుల్లో నింపి ఉన్న వందలాది నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లను చూసి నోరెళ్లబెట్టారు. దాదాపు 15 కిలోల బరువున్న బంగారు బిస్కెట్లు, బిస్కెట్ రూపంలో ఉన్న తులాలతో పాటు సుమారు రూ. 20 కోట్లకు పైగా నగదు లభ్యమైనట్లు ప్రాథమిక అంచనా. నగదు లెక్కింపు వేగవంతం చేయడానికి పోలీసులు ఐదు నోట్ల కౌంటింగ్ యంత్రాలను, లెక్కింపు పూర్తయిన సొమ్మును భద్రపరచడానికి ఐదు భారీ ఇనుప ట్రంకు పెట్టెలను ఘటనా స్థలానికి తరలించాల్సి వచ్చింది.

రాతి పారిశ్రామిక క్లస్టర్ల నుంచి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన పన్నులు, రాబడిని దారిమళ్లించి అక్రమ మార్గాల్లో ఈ ఆస్తులను కూడబెట్టినట్లు ఆధారాలు లభించాయని అధికారులు ప్రకటించారు. నెలకు దాదాపు రూ. 83 కోట్లు వసూలు కావాల్సిన చోట కేవలం రూ. 2 నుంచి 5 కోట్లు మాత్రమే ప్రభుత్వానికి జమ చేసి, మిగిలిన మొత్తాన్ని సిండికేట్ నెట్‌వర్క్ ద్వారా మళ్లించినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అక్రమ మార్గాల్లో ఆర్జించిన డబ్బు మూలాలను అన్వేషించేందుకు దర్యాప్తు తీవ్రతరం చేశామని అధికారులు వెల్లడించారు.

ఒక సాధారణ బస్సు డ్రైవర్ కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే ఇంత అపారమైన ధనరాశులను ఎలా సంపాదించాడనేది స్థానికంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి శోధన ప్రక్రియను కొనసాగిస్తున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ మైనింగ్ నెట్‌వర్క్‌పై జీరో టాలరెన్స్ విధానంతో కఠిన చర్యలు ఉంటాయని, చట్టం ముందు ఎంతటి వారైనా సమానమేనని పోలీసులు , ప్రభుత్వ యంత్రాంగం స్పష్టం చేశాయి.