Warangal Crime News: వరంగల్‌లో సంచలనం సృష్టించిన యువ డాక్టర్ సుమంత్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు వెబ్‌సిరీస్ మాదిరి ట్విస్టులు ఉన్నాయి. జిమ్మ ట్రైనర్‌తో లవ్‌లో ఉన్న సుమంత్ భార్య అసలు నిందితురాలిగా గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

గత వారం వరంగల్‌ సమీపంలోని ఉర్సుగుట్ట-భట్టుపల్లి రోడ్డులో యువ డాక్టర్‌ సుమంత్ రెడ్డిపై దాడి జరిగింది. ఆయనపై జరిగిన హత్యాయత్నం సంచలనంగా మారింది. అంతక ముందు రోజే ఓ వ్యక్తిని దుండగులు హత్య చేశారు. తర్వాత రోజే సుమాంత్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. దీంతో దీన్ని సవాల్‌గా తీసుకున్న పోలీసులు కేసును ఛేదించారు. అసలు దోషి భార్యేనని తేల్చారు.

సుమంత్‌ రెడ్డి వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్‌లోని ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. అక్కడే ప్లోరా మరియ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఉంటున్న క్రమంలో కథలో ట్విస్ట్ చోటు చేసుకుంది.

రోజూ జిమ్‌కు వెళ్లే ప్లోరా మరియకు అక్కడ జిమ్‌ ట్రైనర్‌ శామ్యూల్‌తో పరిచయం అయ్యాడు. అది కాస్త వక్రమార్గం పట్టింది. సుమంత్‌ను కాకుండా శామ్యూల్‌తో తిరగడం ప్రారంభించింది ప్లోరా మరియ. విషయం తెలుసుకున్న భర్త సుమంత్ వార్నింగ్ ఇచ్చాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినా ఆమెలో ఎలాంటి మార్పు లేదు.

Also Read: SLBC సొరంగం వద్దకు ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌! వీళ్లు ఏం చేస్తారు?

భార్య ప్లోరా మరియ వివాహేతర సంబంధంతో విసుగుపోయిన సుమంత్ మకాం కాజీపేటకు మూడేళ్ల క్రితం మార్చేశాడు. అక్కడ క్లినిక్‌ స్టార్ట్ చేశాడు. ఇంతలో భార్యకు రెసిడెన్షియల్‌ స్కూల్‌లో టీచర్‌గా ఛాన్స్ వచ్చింది. అంతా సవ్యంగా సాగుతుందని అనుకుంటున్న టైంలో ప్రేమ కథ మళ్లీ మొదలైంది.

కాజిపేటకు మకాం మార్చినా శామ్యూల్ మాత్రం ఆమెను వదల్లేదు. తరచూ కాజీపేట వచ్చే వాడు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటే వాళ్లు. మళ్లీ భర్తకు తెలియడంతో కుటుంబంలో రోజూ గొడవలు జరుగుతుండేవి. తన ఆనందానికి భర్త అడ్డుగా ఉన్నాడని అనుకుంది మరియ.. ప్రియడితో కలిసి హత్యకు ప్లాన్ చేసింది.

భర్త సుమంత్‌ను అడ్డుతొలగించుకోవాలని మరియ ప్లాన్ తెలుసుకున్న శామ్యూల్‌ అందుకు ఓకే చెప్పాడు. దీనికి స్నేహితుడైన ఓ కానిస్టేబుల్ సహాయం కూడా తీసుకున్నాడు. మర్డర్ చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చూశారు. సుమంత్ చనిపోయి ఉంటే అదే అని అంతా నమ్మేవాళ్లేమో కానీ... అతను బతికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న పోలీసులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. డాక్టర్‌ సుమంత్‌ చెప్పిన ప్రాథమిక వివరాలతో కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. ఫోన్‌ కాల్ లిస్ట్‌ను కూడాా వెరిఫై చేశారు. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు ఇంటి దొంగను పట్టుకున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

Also Read: SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!