విశాఖపట్నం: ఇటీవల మృతిచెందిన వైజాగ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాధా గాయత్రి కేసులో ఉత్తరాఖండ్ పోలీసులు చర్యలు చేపట్టారు. మృతురాలి తండ్రి సుధాకర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్త శ్రీచరణ్‌పై మసూరీ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మసూరీలో అనుమానాస్పద స్థితిలో రాధా గాయత్ని చనిపోవడం తెలిసిందే. తన కూతురు రాధా గాయత్రిని భర్త శ్రీ చరణ్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాడని, ఆమె మరణానికి కారణమయ్యే కొన్ని రకాల మందులను వాడేలా ఒత్తిడి తెచ్చాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గాయత్రి చనిపోయిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులకు శ్రీచరణ్‌ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌ లో ముస్సోరి పోలీసులు పేర్కొన్నారు.

శ్రీచరణ్‌, రాధాగాయత్రిలు గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి గతేడాది నవంబరులోనే వివాహం జరిగింది. ఇటీవల వీరిద్దరూ ఉత్తరాఖండ్‌ టూర్‌కి వెళ్లారు. ఈ క్రమంలో జూన్ 14న మసూరీలోని ఒక హోమ్‌స్టేలో బస చేయగా, అక్కడే రాధా గాయత్రి అనుమానాస్పద రీతిలో చనిపోయింది. ఆమె ముక్కు నుంచి రక్తం వచ్చినట్లు మసూరీ పోలీసులు గుర్తించారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినప్పటికీ, మృతురాలి తండ్రి సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు, ప్రాథమిక ఆధారాలతో ఆమె భర్తపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Also Read: అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?

రాధా గాయత్రి మృతిపై ఆమె తండ్రి సుధాకర్‌ శనివారం మసూరీ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కుమార్తె మరణానికి సంబంధించి అల్లుడు శ్రీచరణ్‌పై పలు సంచలన అనుమానాలు వ్యక్తం చేశారు. కేవలం రుషికేశ్, హరిద్వార్‌ టూర్‌లకు వెళ్తున్నామని చెప్పారని, ఉత్తరాఖండ్ (మసూరీ)కి వెళ్తున్నట్లు తమకు చెప్పలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో జూన్ 14వ తేదీ అర్ధరాత్రి 1.38 గంటల సమయంలో భార్యాభర్తలిద్దరూ సన్నిహితంగా ఉన్న ఒక సెల్ఫీ ఫొటోను అల్లుడు పంపాడని తెలిపారు. ఎప్పుడూ లేనిది ఇంత అర్ధరాత్రి ఫొటో పంపడం ఏంటని తాము అనుకున్నట్లు పేర్కొన్నారు. తాము బంగీజంప్‌కు వెళ్లామని శ్రీచరణ్‌ చెబుతున్నాడని, అందుకు సంబంధించిన ఒక్క ఫొటో, సాక్ష్యాలు కూడా వారి ఫోన్లలో లేవన్నారు. తన కుమార్తె రాధా గాయత్ని మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపి తప్పు చేసిన వారిని శిక్షించాలని తండ్రి నాగరాజు తన ఫిర్యాదులో కోరారు.

పోలీసులు ప్రస్తుతం భార్యాభర్తలిద్దరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి పంపిన సెల్ఫీ ఫొటో వెనుక ఉన్న టైమ్‌స్టాంప్ నిజమైందేనా లేక గాయత్రి చనిపోయిన తర్వాత ఫోటోను క్రియేట్ చేశారా అనే కోణంలో సైబర్ క్రైమ్ టీమ్ విచారిస్తోంది.

Also Read: Wife Killed Husband: భర్తకు గుండెజబ్బు - శారీరక సుఖం కోసం భార్య ఘాతుకం! ప్రియుడి ఒక్క మెసేజ్‌తో క్రైమ్ స్టోరీ లీక్!

సెక్షన్ 307 కింద కేసు నమోదు: ప్రాథమిక ఆధారాలు, మందుల దుర్వినియోగం ఆధారంగా పోలీసులు శ్రీచరణ్‌పై బీఎన్‌ఎస్ సెక్షన్ల ప్రకారం హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఒకవేళ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో విషప్రయోగం లేదా ఊపిరాడకుండా చేసి చంపినట్లు తేలితే హత్య కేసు (Murder Case)గా మారుస్తారు.

మహిళలపై గృహహింస - హెల్ప్‌లైన్: వివాహమైన కొద్ది నెలలకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి ఇలా అనుమానాస్పదంగా మృతి చెందడం విశాఖలో విషాదాన్ని నింపింది. అయితే గృహహింస లేదా మానసిక వేధింపులకు గురయ్యే మహిళలు సహాయం కోసం జాతీయ మహిళా హెల్ప్‌లైన్ నంబర్ 181 లేదా పోలీసు హెల్ప్‌లైన్ నంబర్ 112ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.