విశాఖపట్నం: విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో కమర్షియల్ విమానాల సేవలు ముగియడంతో భోగాపురం ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. ఆగస్టు 17 నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ సేవలు ప్రారంభం కావడంతో విశాఖ ఎయిర్‌పోర్ట్ లో పనిచేసే కార్మికుల జీవితం ప్రశ్నార్థకంగా మారింది. కూటమి ప్రభుత్వ తీరు వందలాది కుటుంబాలను అగాధంలోకి నెట్టిందని ఆరోపించారు. ఎయిర్‌పోర్టు కార్మికులు బుధవారం ఉదయం తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ ఆధ్వర్యంలో ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సిహెచ్.ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు.

అనంతరం మహిళా కార్మికులు బి.జ్యోతి, కే.చిన్నారి, పి.రాధ మీడియాతో మాట్లాడుతూ.. మేం చంద్రబాబుకు ఓటు వేసిన పాపానికి మా బతుకులు రోడ్డున పడ్డాయి. విశాఖకు వచ్చిన మంత్రి నారా లోకేష్ 'తప్పకుండా న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చి మాట తప్పాడని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఎంపీ భరత్ మా చేత పొగిడించుకొని, న్యాయం చేస్తానని చెప్పి ఇప్పుడు కనిపించకుండా పరారీలో ఉన్నాడు. స్థానిక ఎమ్మెల్యే గణబాబు కనీసం మా గురించి పట్టించుకోవడం లేదు. ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులకు మా మీద కనీస జాలి కూడా లేదని మండిపడ్డారు.

న్యాయం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష

మా కాంట్రాక్టర్ (అరుణ్ ఏవియేషన్) లావణ్య మేడం యూనిఫామ్స్ ఇవ్వమని బెదిరిస్తోంది. కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చడం కోసం ప్రభుత్వం పేద కార్మికుల బతుకులతో చెలగాటం ఆడుతోంది. పెద్దవాళ్లకు ఒక న్యాయం, పేదవాళ్లకు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. "నెల జీతానికి బతికే మేం ఇంటి అద్దెకట్టలేకపోతున్నాం. పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం. మా పిల్లలు కూడా రోడ్డున పడతారు. ప్రభుత్వానికి మా కష్టాలు కనిపించడం లేదా?" అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కష్ట సమయంలో తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ మాత్రమే మా కోసం పోరాడుతున్నారు. మిగతా వారంతా మౌనంగా ఉన్నారని, మాకు న్యాయం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ఒక వేళ మేం ఆత్మహత్యలు చేసుకుంటే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని మహిళా కార్మికులు హెచ్చరించారు.

కార్మికులకి ఏం న్యాయం చేస్తారో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెప్పాలి

అసెంబ్లీ సాక్షిగా ఏర్పోర్ట్ కార్మికులపై చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయాలని తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు కార్మికులకు ఏం న్యాయం చేస్తారో చెప్పాలని లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ డిమాండ్ చేశారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టును డొమెస్టిక్‌గా అయినా వెంటనే పునరుద్ధరించాలి. కార్మికులకు ఉద్యోగ భద్రత, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరారు. కాంట్రాక్టర్ బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని, ఇచ్చిన హామీలను కూటమి నేతలు నిలబెట్టుకోవాలన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు, కానీ విశాఖ ఎయిర్ పోర్టును పూర్తిగా మూయడానికి వీల్లేదని.. వందలాది కార్మికులతో పాటు ప్రయాణికులకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పప్పూర్ నికుంజ్, బొల్లినేని వెంకటేశ్వరరావు, ఎయిర్పోర్ట్ కార్మికుల భారీ సంఖ్యలో పాల్గొన్నారు