Declining Birth Rate In India | దేశంలో హిందువుల జననాల రేటు తగ్గుతోందని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి హిందూ కుటుంబంలో కనీసం ముగ్గురు పిల్లలు ఉండేలా చూసుకోవాలని పిలుపునిచ్చింది. ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్ నగర్‌లో జరిగిన విరాట్ సంత్ సమ్మేళన్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్, వీహెచ్‌పీ కేంద్ర ప్రధాన కార్యదర్శి బజరంగ్ లాల్ బాంగ్రా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బజరంగ్ లాల్ బాంగ్రా మాట్లాడుతూ.. హిందువుల జననాల రేటు తగ్గడం వల్ల దేశంలోని హిందూ జనాభాలో సమతుల్యత లోపించిందన్నారు. హిందువుల జననాల శాతం తగ్గుతోందన్నారు. అందుకే ప్రతి హిందూ కుటుంబంలో కనీసం ముగ్గురు పిల్లలును కనాలని కోరారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై చర్చ
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపైనా సమావేశంలో చర్చించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన అవసరం ఉందని బాంగ్రా అన్నారు. బంగ్లాదేశ్లో తలెత్తిన పరిస్థితులు భారత్లోనూ వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఈ అంశంపై హిందువులు లోతుగా ఆలోచించాలని ఆయన కోరారు. వక్ఫ్ బోర్డు నిరంకుశ, అపరిమిత హక్కులను పరిమితం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చట్ట సంస్కరణల చట్టాన్ని తీసుకువస్తోందన్నారు.

ప్రయత్నాల ఫలితాన్నిప్రపంచం చూస్తోంది
కార్యక్రమానికి హాజరైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం చూసే ఈ మహా కుంభమేళాలో భారతదేశ సనాతన సంప్రదాయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. యావత్ దేశం సుభిష్ఠంగా ఉండాలని విశ్వహిందూ పరిషత్ చేస్తున్న కృషిని కొనియాడారు. వీహెచ్పీ ప్రయత్నాల ఫలితాన్ని ఈ రోజు ప్రపంచం మొత్తం చూస్తోందని ఆయన పేర్కొన్నారు.

అశోక్ సింఘాల్‌ ఆత్మ ఉప్పొంగుతుంది
యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ..‘గంగా, యమునా, సరస్వతి లాంటి పవిత్ర నదుల ఒడ్డున ఉన్న మన పుణ్యభూమిపై వీహెచ్‌పీ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. నమధ్య భౌతికంగా లేని అశోక్ సింఘాల్‌ని మనం గుర్తుచేసుకున్నాం. సనాతన ధర్మం 500 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం చూసి అశోక్ సింఘాల్‌ ఆత్మ ఉప్పొంగిపోతుంది’ అని అన్నారు.

మధుర, కాశీ కల సాకారం కాబోతోంది
2016లో కేవలం రెండు లక్షల మంది మాత్రమే అయోధ్యను సందర్శించారని, 2024లో 15 కోట్ల మంది మహాకుంభాన్ని సందర్శించారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కొత్త అయోధ్య, కొత్త కాశీకి దివ్యమైన రూపం కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. శ్రీరామ జన్మభూమి తర్వాత మధుర, కాశీ కల సాకారం కాబోతోందని ఆయన పేర్కొన్నారు.

Also Read: Monalisa: భద్రత కారణాలతో కుంభమేళా నుంచి వెళ్లిపోయిన మోనాలిసా - తీవ్ర ఇబ్బందులకు గురయ్యానంటూ వీడియో