Virender Sehwag News: భారత దిగ్గజ ఓపెనర్లలో వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత టెస్టు క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ క్లబ్బును స్థాపించింది సెహ్వాగే కావడం విశేషం. అతని కంటే ముందు గావస్కర్, సచిన్ ఇలా ఎంతోమంది హేమాహేమీలు ఆడినా భారత 'ట్రిపుల్' కలను నెరవేర్చలేకపోయారు. 2005లో పాకిస్థాన్ పర్యటనలో ముల్తాన్‌లో జరిగిన టెస్టులో 309 పరుగులు చేసి భారత కలను సాకారం చేశాడు. అలాగే ఈ ఫార్మాట్లో రెండు ట్రిపుల్ సెంచరీ చేసిన అతి కొద్దిమంది క్రికెటర్లలో అతను ఒకడు. అయితే తాజాగా అతని వ్యక్తిగత జీవితం ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. అతని భార్య ఆర్తితో త్వరలోనే సెహ్వాగ్ విడిపోనున్నట్లు సమాచారం. 2004 డిసెంబరులో ఈ ఇద్దరికీ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. 2007లో పెద్ద కొడుకు ఆర్యవీర్ జన్మించగా, 2010లో చిన్న కొడుకు వేదాంత్ జన్మించాడు. అయితే కొంతకాలంగా సోషల్ మీడియాలో సెహ్వాగ్‌ను గమనిస్తున్న విశ్లేషకులు అతని వివాహ బంధానికి త్వరలోనే ఎండ్ కార్డు పడబోతోందని అంచనా వేస్తున్నారు.

ఒకరినొకరు అన్ ఫాలో..
నిజానికి ఒక జంట మధ్య సఖ్యత ఉందా..? లేదా అని తెలుసుకోడానికి కొన్ని కొండగుర్తులు ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం. వాటిని బట్టి, ఈ జంట కొన్ని నెలలుగా విడిగా ఉంటోంది. అలాగే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకుంటున్నారు. ఈ కపుల్ తాలుకు పాత ఫొటోలు సెహ్వాగ్ సోషల్ మీడియాలో కన్పించడం లేదు. మరోవైపు ఆర్తి ప్రొఫైల్ మాత్రం ప్రైవేట్‌లో ఉంది. ఇక ఇటీవల దీపావళి సెలెబ్రెషన్స్‌ను ఒంటరిగా జరుపుకొని, సెహ్వాగ్ వాటిని పోస్ట్ చేశాడు. దీన్ని బట్టి సెహ్వాగ్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు దీనిపై ఈ కపుల్ స్పందించలేదు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే సెహ్వాగ్ నుంచి కానీ, ఇటు ఆర్తి నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం మరింత అనుమానాలను రాజేస్తోంది.

మరో సెహ్వాగ్ రెడీ..
మరోవైపు సెహ్వాగ్ పెద్ద కొడుకు ఆర్యవీర్ అప్పుడే క్రికెట్లో ప్రకంపనలు రేపుతున్నాడు. ఇటీవల ఢిల్లీ తరపున కూచ్ బీహార్ ట్రోఫీలో ఆడిన అతను విధ్వంసకర బ్యాటింగ్‌తో సెహ్వాగ్‌ను గుర్తుకుతెచ్చాడు. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 309 బంతుల్లో 297 పరుగులు చేసి త్రుటిలో ట్రిపుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. దీనిపై సెహ్వాగ్ మాత్రం స్పందించాడు. తన కొడుకు కాస్తలో ఫెరారీ కారును కోల్పోయాడని సరదాగా తెలిపాడు. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కొడుకుల్లో ఎవరైనా కానీ, తన అత్యధిక స్కోరు 319ని దాటితే వారికి ఫెరారీ కారును కొనిస్తానని ప్రకటన చేశాడు. అయితే 23 పరుగుల తేడాతో ఫెరారీ కారును మిస్సయ్యాడని అన్నాడు. దక్షిణాఫ్రికాపై 319 పరుగులను సెహ్వాగ్ సాధించాడు. అలాగే శ్రీలంకపై 293 పరుగులు చేసిన సెహ్వాగ్.. త్రుటిలో మూడో ట్రిపుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఒకవేళ తను మూడో ట్రిపుల్ సెంచరీని సాధించినట్లయితే, ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ అయ్యేవాడు. ఏదేమైనా సెహ్వాగ్ ఘనతలను గుర్తుకు తెచ్చుకుంటున్న అతని అభిమానులు.. అతని వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులు తొలగిపోవాలని కోరుకుంటున్నారు.

Also Read: Abhishek Sharma: ఆ అనుభవమే అక్కరకొచ్చింది - ఇంగ్లీష్ బౌలర్లు అలా చేస్తారని ఊహించా, అన్నింటికీ సిద్ధంగా ఉన్నా!