తోయగూడ గ్రామస్తుల ఆత్మీయ సమ్మేళనం

40 ఏళ్ల తరువాత కలుసుకున్న గ్రామస్థులు

40 ఏళ్ల కిందట ఆ గ్రామం సాత్నాల ప్రాజెక్టులో ముంపునకు గురయింది. దీంతో ఆ గ్రామస్తులు జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు. తాత ముత్తాతల కాలంగా నివాసమున్న తాము పుట్టిన ఊరులో.. ఆ నేలతల్లిని మర్చిపోలేని గ్రామస్తులకు తోచిన ఓ ఆలోచన అందరినీ ఏకం చేసింది. ఒక్కొకరుగా సమాచారం అందించి 40ఏళ్ల కిందట ఉన్న వారంతా ఏకమయ్యారు. పుట్టిన నేల తల్లి పై ఓ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. 40 ఏళ్ల కిందటి గ్రామ ఆనవాళ్లు చూస్తూ అప్పటి గ్రామస్తులంతా ఒకరినొకరు కలుసుకోని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అదిలాబాద్ జిల్లా బేల మండలంలోని తోయగూడ గ్రామస్తుల ఆత్మీయ సమ్మేళనంపై abp దేశం ప్రత్యేక కథనం.

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని తోయగూడ గ్రామస్తులు 40 ఏళ్ల తరువాత ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 1975 లో ఈ ప్రాంతంలో ఏడు నదులు కలిసే చోట సాత్నాల ప్రాజెక్టు ఏర్పాటుకు దారి తీసింది. 1976లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చేతుల మీదుగా సాత్నాల ప్రాజెక్టు శంకు స్థాపన జరిగింది. ఆపై ప్రాజెక్టు ఏర్పాటుతో తోయగూడా గ్రామం ముంపునకు గురయింది. 1979 నుండీ 1983 మధ్య తోయగూడ గ్రామం ఖాళీ అయింది. గ్రామంలోని అందరు ఒక్కో దారి పట్టుకొని జీవనోపాధి కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు.

40ఏళ్ల కిందట తోయగూడలో రైతులు సారవంతమైన నేలలో ఎన్నో రకాల పంటలు పండించేవారు. గ్రామంలోని పాఠశాలలో నేర్చుకున్న పాఠాలతో ఎంతోమంది విద్యావేత్తలయ్యారు. కానీ సాత్నాలా ప్రాజెక్టు ఏర్పడడంతో తోయగూడ గ్రామం ముంపుకు గురై ఖాళీ అయింది. వివిధ ప్రాంతాల్లో జీవనోపాధి కోసం వెళ్ళిపోయిన వారంతా ఉన్న ఊరిలో నేల తల్లి పై ఉన్న ప్రేమ అనుబంధాన్ని పంచుకుంటూ కలుసుకునేలా సంబరంగా ఓ వినూత్న ప్రయత్నం చేశారు. 40 ఏళ్ల తర్వాత ఒకరి సహాయంతో ఒకరు సమాచారం చేరవేసుకొని తోయగూడా గ్రామస్తులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఊరిలో ఉన్న ఆనవాళ్లను చూస్తూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అందరూ ఒకే చోట కలుసుకొని భావోద్వేగానికి గురవుతూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు కలుసుకుంటూ ప్రేమానురాగాలను పంచుకున్నారు. అందరూ ఎంతో సంబరంగా అప్పటి కాలంలో పెద్దలను గుర్తు చేసుకుంటూ గ్రామంలోని వారంతా తమ పిల్లాపాపలతో కలిసివచ్చి వారి చిన్ననాటి జ్ఞాపకాలను పరిచయం చేసుకున్నారు. ఆడుతు పాడుతు డప్పు చప్పుల మధ్య తమ గ్రామ దేవతకు మొక్కులు చెల్లించారు.

గ్రామంలో నిజాం కాలంలో నిర్మించిన బావి, పాఠశాల, దేవాలయం తమ ఇళ్ళను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు కలుసుకుంటూ బంధుమిత్రులను కలుసుకున్నారు. ఆడుతు పాడుతు సంబరంగా తమ పుట్టిన నేల తల్లి పై సంబరంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆపై అందరు భోజనాలు చేసుకుని తిరిగి తమ తమ గ్రామాలకు బయలుదేరారు. గత మూడు ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తోయగూడ గ్రామస్తులు abp దేశంతో వివరించారు. తమ పాత జ్ఞాపకాలను వివరిస్తూ పలువురు భావోద్వేగానికి లోనై అక్కడి పాతకాలం నాటి ఆనవాళ్లను పరిచయం చేశారు. తాము పుట్టి పెరిగిన నేల తల్లిని మర్చిపోకుండా అందరూ కలుసుకునేలా మూడేళ్లుగా ఈ పాత తోయగూడా గ్రామస్తుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.