<p>Platying cards in Penna River | నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్‌ కాలనీ సమీపంలోని పెన్నా నదిలో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. 17 మంది యువకులు సోమవారం రాత్రి పేకాట ఆడేందుకు పెన్నా నదిలోకి వెళ్లారు. సోమశిల రిజర్వాయర్ నుంచి ఒక్కసారిగా నీరు విడుదల కావడంతో నది ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది. రెండు వైపులా పెద్ద ఎత్తున నీరు రావడంతో యువకులు నది మధ్యలో చిక్కుకున్నారు. భయాందోళనకు గురైన యువకులు తమను కాపాడండి అంటూ గట్టిగా కేకలు వేశారు. వాళ్లు నదిలోకి వెళ్లింది ఏదో ఘనకార్యం చేయడానికి మాత్రం కాదండోయ్. తీరికగా పేకాట ఆడతామని పెన్నా నది నదిలోకి వెళ్లారని తెలుసుకుని అంతా షాకయ్యారు.</p>
<p>యువకుల అరుపులు విన్న స్థానికులు <a title="టీడీపీ" href="https://telugu.abplive.com/topic/tdp" data-type="interlinkingkeywords">టీడీపీ</a> నేత జహీర్ కు సమాచారం ఇచ్చారు. పెన్నా నదిలో యువకులు చిక్కుకున్నారని ఆయన నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, నవాబుపేట పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి త్వరగా చేరుకున్నారు. అసలే చీకటి కావడంతో అగ్నిమాపక సిబ్బంది ఆక్సా లైట్లను ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై నుంచి నిచ్చెనల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. నవాబుపేట పోలీసులు కూడా పాల్గొన్నారు. ఎలాగోలా శ్రమించి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కలిసి 9 మందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. మరో 8 మంది యువకులు ఎమయ్యారో తెలియడం లేదు. </p>
<p>పెన్నా నది వద్దకు చేరుకున్న సిబ్బంది యువకులను బయటకు రావాలని నిచ్చెనలు వేసి నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, అగ్నిమాపక సిబ్బంది పిలిచారు. లైట్లు వేసి వారికి ధైర్యం చెప్పారు. 9 మంది యువకులు సహకరించడంతో వారిని రక్షించారు. అయితే బయటకు వస్తే తమపై కేసులు పెడతారన్న భయంతో కొందరు అవతలవైపు వెళ్లి ఉంటారని తెలుస్తోంది. పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది పిలుస్తున్నా స్పందించకపోవడం, కొందరు ఫోన్లు కట్‌ చేయడంతో వారిని రక్షించడానికి అడ్డంకులు తలెత్తాయి. కేసుల భయంతో అక్కడి నుంచి తప్పించుకునేందుకే చేసిన ప్రయత్నం చేసిన వారిని కాపాడేందుకు రెస్క్యూ కొనసాగుతోంది. </p>