Vijayawada Utsav | విజయవాడ: దసరా సందర్భంగా విజయవాడ నగరానికి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారని, కనకదుర్గమ్మ ఆశీస్సులతో నగర అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని ఎంపీ కేశినేని శివనాథ్ (Kesineni Chinni) పేర్కొన్నారు. ఈ ఏడాది దేవీ నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు నేషనల్ సరస్సు మేళా (SARAS Mela) అక్టోబర్ 8 నుంచి 23 వరకు కొనసాగుతుందని వెల్లడించారు. విజయవాడలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మీడియా సమావేశంలో మాట్లాడారు.

గత ఏడాది కూడా విజయవాడ ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించామని, ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రి సహా లక్షలాది మంది ప్రజలు హాజరై ఈ వేడుకలను విజయవంతం చేశారని కేశినేని చిన్ని గుర్తుచేశారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన కర్టెన్ రైజ్ ఈవెంట్ సోమవారం అంబేద్కర్ కళా వేదికలో జరుగుతుందని, అందులో వివిధ మంత్రులు పాల్గొని ఉత్సవాల్లో జరిగే అన్ని కార్యక్రమాల వివరాలను వెల్లడిస్తారని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

ఈసారి 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పున్నమి ఘాట్, ఎంబీకే (MBK) స్టేడియంలలో విజయవాడ ఉత్సవ్, సరస్సు మేళా వేడుకలు జరగనున్నాయి. విజయవాడ సాంస్కృతిక, కళల రాజధాని అని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ప్రదర్శనలను తీర్చిదిద్దుతున్నామని, 10 రోజుల పాటు కళాకారుల ప్రదర్శనలు కొనసాగుతాయని కేశినేని చిన్ని చెప్పారు. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా మైసూరు ఏనుగులను కూడా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ వెల్లడించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నారని, వారితో పాటు కేంద్ర మంత్రులు కూడా హాజరవుతున్నందున ఆయా రాష్ట్రాల సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ కేశినేని చిన్ని వివరించారు. పర్యాటకులు, అతిథులు అమ్మవారి దర్శనంతో పాటు సరస్సు మేళా, విజయవాడ ఉత్సవాలను చూసుకునేలా సమీకృత ఏర్పాట్లు చేస్తున్నామని, వివిధ రకాల వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు.

ప్రజలు ఉదయం అమ్మవారిని దర్శించుకుని, సాయంత్రం ఈ ఉత్సవాలకు రావాలని, కనీసం 2 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలని భక్తులకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇచ్చే నిధుల కంటే దాతల సహకారంతోనే ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, వచ్చే ఏడాది నుండి స్వయం సమృద్ధి విధానంలో సాగేలా ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు, మీడియా ఇచ్చే విలువైన సలహాలను స్వీకరిస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరలోనే ఈ వివరాలను డ్రాఫ్ట్ రూపంలో మీడియాకు అందిస్తామని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు.