DMK AIADMK Vote Share TN:  తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన మదురాంతకం, ధారాపురం శాసనసభ నియోజకవర్గాల ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి, సినీ నటుడు జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ రెండు స్థానాలనూ కైవసం చేసుకుని విజయం సాధించింది. అన్నాడీఎంకే నుంచి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను వ్యూహాత్మకంగా తమ పార్టీలోకి ఆహ్వానించి, వారితో రాజీనామా చేయించి మళ్లీ బరిలోకి దింపిన విజయ్ రాజకీయ ప్రయోగం ఫలితాన్ని ఇచ్చింది. అయితే పైకి ఇది టీవీకే ఘన విజయంగా కనిపిస్తున్నప్పటికీ, లోతైన ఓటింగ్ విశ్లేషణలు మాత్రం అధికార పార్టీకి స్పష్టమైన ముందస్తు హెచ్చరికలు పంపుతున్నాయి.

భారీ మెజారిటీలు రాలేదు!

శాసనసభ ఎన్నికల్లో పొందిన మైలేజ్, విజయ్ మేనియా క్షేత్రస్థాయిలో ఏకపక్షంగా పనిచేస్తుందని, భారీ మెజారిటీలతో ఉపపోరును క్లీన్ స్వీప్ చేయవచ్చని భావించిన టీవీకే వర్గాలకు ఈ ఫలితాలు గట్టి షాక్‌నే ఇచ్చాయి. ధారాపురంలో టీవీకే అభ్యర్థి సత్యభామ సమీప డీఎంకే అభ్యర్థి సుగణ్యపై దాదాపు 9,800 ఓట్ల తేడాతో విజయం సాధించగా, మదురాంతకంలో టీవీకే అభ్యర్థి మెరకాతం కుమారవేల్ డీఎంకే అభ్యర్థి పరంధామన్‌పై సుమారు 17,000 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ గ్లామర్, అధికారబలం ముందు ఈ స్థాయిలో పోటీ ఎదురవ్వడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.

డీఎంకే, అన్నాడీఎంకే ఓట్లు కలిస్తే టీవీకేకు ఓటమే

ఫలితాల సరళిని పరిశీలిస్తే.. డీఎంకే రెండు నియోజకవర్గాల్లోనూ అత్యంత బలమైన పోటీనిచ్చి రెండో స్థానంలో నిలవగా, అన్నాడీఎంకే మూడో స్థానానికి పరిమితమైంది. అయితే, ఇక్కడే ఒక కీలకమైన రాజకీయ గణాంకం దాగి ఉంది. మదురాంతకం, ధారాపురం రెండింట్లోనూ ప్రతిపక్ష డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులకు వచ్చిన ఓట్లను కలిపి లెక్కిస్తే.. అవి విజేతగా నిలిచిన టీవీకే అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్ల కంటే కనీసం 40,000 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. తమిళనాడులో దశాబ్దాలుగా పాతుకుపోయిన సంప్రదాయ ద్రవిడ ఓటుబ్యాంకు డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య చీలడం వల్లే టీవీకే అభ్యర్థులు బయటపడగలిగారని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.

విజయ్‌కు పెద్ద సమస్య తీరినట్లే

ఈ ఉపఎన్నికల ఫలితాలు టీవీకే ప్రభుత్వ సంఖ్యాబలానికి, మనుగడకు అత్యంత కీలకమైనవి. శాసనసభలో సాధారణ మెజారిటీకి అత్యంత సమీపంలో ఉన్న సంఖ్యాబలంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వేళ.. ఈ రెండు స్థానాల్లో పొరపాటున ఒక్కటి చేజారినా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర రాజకీయ అస్థిరతలోకి జారుకునే ప్రమాదం ఉండేది. విజయ్ నేతృత్వంలోని టీవీకేకి లభించిన ఈ విజయం సాంకేతికంగా సాంత్వననిచ్చినా.. క్షేత్రస్థాయిలో ఓటింగ్ సునామీ ఏమీ లేదని, అభ్యర్థుల సొంత బలం, ద్రవిడ పార్టీల మధ్య ఓట్ల చీలికే తమను కాపాడాయని స్పష్టమైంది. ఈ ఫలితాలు అధికార డీఎంకేకు, విపక్ష అన్నాడీఎంకేకు కొత్త పాఠాలు నేర్పాయి. క్షేత్రస్థాయిలో టీవీకే సిద్ధాంత పరంగా లేదా సంస్థాగతంగా ఇంకా పూర్తిస్థాయిలో ఊపందుకోలేదని ఈ ఉపపోరు నిరూపించింది. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తన క్యాడర్‌ను తిరిగి ఏకీకృతం చేస్తుండగా, మూడో స్థానంలో పడిపోయిన అన్నాడీఎంకే ఉనికి కోసం పోరాడుతోంది. ఈ రెండు ద్రవిడ పక్షాలు రాబోయే సార్వత్రిక పోరు నాటికి వ్యూహాత్మకంగా కలిసినా లేదా అవగాహనకు వచ్చినా టీవీకే గెలుపు సమీకరణాలు పూర్తిగా తలకిందులయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

విజయ్‌కు డేంజర్ సిగ్నల్స్ కూడా

ఫలితాలు విజయ్ నాయకత్వానికి సరికొత్త సంకేతాన్ని ఇస్తున్నాయి. కేవలం సినిమా గ్లామర్, పాపులారిటీ, స్టార్ ఇమేజ్‌లతో సులువుగా ఎన్నికలను స్వీప్ చేయవచ్చనే భ్రమల నుంచి బయటకు వచ్చి.. వార్డు, బూత్ స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ద్రవిడ సిద్ధాంత మూలాలు బలంగా ఉన్న తమిళనాడు మట్టిపై ఓటు బ్యాంక్‌ను శాశ్వతంగా దక్కించుకోవాలంటే కేవలం ఆకర్షణీయమైన పథకాలు, ప్రకటనలు సరిపోవని క్షేత్రస్థాయి సవాళ్లు హెచ్చరిస్తున్నాయి. మదురాంతకం, ధారాపురం బై-పోల్స్ విజయ్ సర్కార్‌కు అధికారికంగా ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ, రాబోయే రోజుల్లో ఎదురయ్యే పెద్ద రాజకీయ తుఫానుకు ముందస్తు సూచికగా మారాయి.