Vice President Polls |న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం (సెప్టెంబర్ 9న) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ నూతన భవనంలోని ‘ఎఫ్‌-101 వసుధ’లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కించి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజేతను ప్రకటించనున్నారు. పార్లమెంటు ఉభయసభలలో మొత్తం 788 మంది సభ్యులు ఉండాలి, ఏడు స్థానాలు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం సభ్యుల సంఖ్య 781గా ఉంది. ఈ ఎన్నికలను బిజూ జనతాదళ్ (7 మంది), భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ 4 మంది), శిరోమణి అకాళీదల్ బహిష్కరించాయి. ఎన్నికల్లో పాల్గొనడం లేదని ప్రకటించాయి.

ఎవరి బలమెంత..
ఎన్డీయేకు ఇప్పటికే సొంతంగా 425 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ, ఇతర మిత్ర పక్షాల మద్దతుతో ఈ సంఖ్య 438 దాటి పోనుంది. మరోవైపు, ప్రతిపక్ష ఇండి కూటమి అభ్యర్థి, తెలుగువ్యక్తి జస్టిస్ బీ. సుదర్శన్ రెడ్డికి 314 మంది ఎంపీల మద్దతు ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్‌దే గెలుపు అని స్పష్టమవుతోంది. కానీ తమ బలాన్ని పరీక్షించుకునేందుకు విపక్ష కూటమి అభ్యర్థిని బరిలో నిలిపాయి. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు మాజీ జడ్జిని పోటీలో నిలిపాయి.

రహస్య బ్యాలెట్ విధానం
ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎన్నిక రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. కనుక పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి పార్టీలకు అతీతంగా ఓటేయొచ్చు. కానీ పలు పార్టీలు ఇదివరకే తమ నిర్ణయాన్ని వెల్లడించాయి. బీజేడీ, బీఆర్ఎస్, శిరోమణి అకాళీదళ్ లాంటి పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. ఎన్డీయే ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కూటమిలో లేని పార్టీలను సైతం మద్దతు కోరింది.

తొలి ఓటు వేయనున్న ప్రధాని మోదీ
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని మోదీ తొలి ఓటు వేయనున్నారు. అనంతరం పంజాబ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మోదీ ఏరియల్ సర్వే చేయనున్నారు. సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ ఎన్డీయే ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై ఎంపీలకు సలహాలు, సూచనలు ఇచ్చారు.

బలం తగ్గిన ఎన్డీయేదే పైచేయి
ఈసారి ఎన్డీయే బలం కొంత తగ్గింది. కానీ వారి విజయానికి ఏ ఇబ్బంది లేదు. మంచి మెజార్టీతోనే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే నెగ్గే అవకాశాలున్నాయి. బ్యాలెట్ పత్రాల ద్వారా ఓటింగ్ జరుగుతుంది. ఎంపీలు తాము కోరుకున్న అభ్యర్థికి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేస్తారు. తొలి ప్రాధాన్యత ఉన్న అభ్యర్థికి 1 అని పెన్నుతో రాయాలి. తరువాత అభ్యర్థి పేరు వద్ద 2 అని రాస్తారు. ఈ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులకు సరిగ్గా సమానమైన ఓట్లు పోలైతే, రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించి విజేతను తేల్చుతారు.

గత ఎన్నికల్లో ఏం జరిగింది..
2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలో మొత్తం 725 మంది పార్లమెంట్ సభ్యులు ఓటు వేశారు. ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌కు 528 ఓట్లు (74.37 శాతం) రాగా, ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాకు 182 ఓట్లు (25.63 శాతం) మాత్రమే వచ్చాయి. 55 మంది ఓటింగ్‌లో పాల్గొనలేదు, మరో 15 ఓట్లు చెల్లలేదని తెలిసిందే.