Vetlapalem Blast : కాకినాడ జిల్లా వేట్ల‌పాలెం పేలుడు ఘ‌ట‌నపై సిట్ విచార‌ణ పూర్తి చేసింది. బాణాసంచా భారీ విస్ఫోటనానికి కారణాన్ని అధికారులు తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా తీవ్ర సంచ‌ల‌నం క‌లిగించిన వేట్ల‌పాలెం భారీ విస్పోట‌నం ఘ‌ట‌న తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్ర‌మాదంలో ఘ‌ట‌న స్థ‌లంలోనే 21 మంది వ‌ర‌కు మృతిచెంద‌గా కాకినాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌రో ఎనిమిది మంది మృత్య‌వాత‌ప‌డ్డారు.

ఈ దుర్ఘ‌ట‌న కాకినాడ జిల్లాలోనే కాక తెలుగు రాష్ట్రాల్లో ఉలిక్కిపాటుకు గురిచేసింది.. అయితే ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగిన రోజు రాత్రికే రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు హుటాహుటీన వేట్ల‌పాలెం వ‌చ్చి ఘ‌ట‌న స్థలాన్ని ప‌రిశీలించారు.. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించారు. అక్క‌డే మృతుల‌కు రూ.20 ల‌క్ష‌ల ప‌రిహారాన్ని ప్ర‌క‌టించారు. బాధ్యులైన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, అవ‌స‌ర‌మైతే విస్పోట‌నానికి కార‌కులైన వారి ఆస్తులు జ‌ప్తుచేసి బాధిత కుటుంబాల‌కు అంద‌జేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో ఈ ప్ర‌మాదంపై సిట్ ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

వేట్ల‌పాలెంలో ప‌ర్య‌టించిన సిట్ బృందం...

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన బాణాసంచా తయారీ కేంద్రం భారీ విస్ఫోటనంలో 28 మంది కార్మికులు మృత్యువాత పడిన ఘటనపై ఏపీ ప్ర‌భుత్వం సిట్ ఏర్పాటు చేసిన వేళ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రిన్సిపల్ సెక్ర‌ట‌రీ ఎం.సురేష్ కుమార్ సారథ్యంలోని అధికారుల బృందం బుధ‌వారం వేట్ల‌పాలెంలో ప‌ర్య‌టించింది. ప్ర‌మాదం జ‌రిగిన వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా విస్ఫోటన స్థలాన్ని కమిటీ బృందం పరిశీలించింది.

వేట్లపాలెం గ్రామంలో జరిగిన భారీ విస్పోటనంపై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఆయ‌న‌, ప‌లుశాఖ‌ల అధికారుల‌ను విచారించారు. ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ సురేష్ కుమార్ నేతృత్వంలో సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీ అతిథి గృహంలో ప్రమాదం నుంచి బయటపడి చికిత్స పొందిన కార్మికులను, ఈ ఘటనలో సస్పెండ్ కాబడిన నాలుగు శాఖల అధికారులను సిట్ బృందం విచారించింది. ప్రమాదంపై ప్రాథమికంగా జిల్లా కలెక్టర్, అగ్నిమాపక శాఖ తదితర అధికారుల నుంచి వివరాలు సేకరించిన సిట్ అధికారులు ప్రమాదానికి సంబంధించి రెవెన్యూ, పోలీస్, ఫైర్, లేబర్ డిపార్ట్మెంట్, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అధికారులతో చ‌ర్చించి కీల‌క విష‌యాల‌ను తెలుసుకున్నారు. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ విస్పోట‌నానికి కార‌ణం నిర్వాహకులేన‌ని విచారణ కమిటీ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం సురేష్ కుమార్ స్ప‌ష్టం చేశారు.

భారీగా నిల్వ‌చేసిన మందుగుండు సామాగ్రే ప్రమాదానికి కారణం..

వేట్లపాలెం విస్పోట‌న ఘ‌న‌ట‌పై అధికారుల‌ విచార‌ణ అనంత‌రం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ సురేష్‌కుమార్ మీడియాకు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. బాణాసంచా తయారీ కేంద్రంలో కేవలం 15 కిలోలు మాత్రమే మందు గుండు సామాగ్రి తయారీకి అనుమతులు పొందారని అన్నారు. త‌యారీ కేంద్రంలో పదిమంది లోపు మాత్రమే కార్మికులను పనులకు ఉపయోగించుకునేందుకు అనుమ‌తులున్నాయ‌న్నారు. కానీ యజమానికి వందలాది కిలోల ముడి సరుకు తయారీ కేంద్రంలో నిల్వలు ఉంచడంతోపాటు, 30 మందికిపైగా కార్మికులను ఉపయోగించినట్టు విచార‌ణ‌లో తేలింద‌న్నారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించ‌క‌పోవ‌డం, ప్ర‌మాదానికి కార‌ణంగా గుర్తించామ‌న్నారు.

మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి బాణాసంచా తయారీ కేంద్రాలను పలు శాఖల అధికారులు తనిఖీలు చేయల‌న్నారు. యజమానులే నిబంధనలు కచ్చితంగా పాటించి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అలా గాక యాజమాన్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఇలాంటి ప్రమాదాలకు అవకాశం కలుగుతుందన్నారు. వేట్ల‌పాలెం భారీ విస్ఫోటనంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, దానిలో భాగంగానే సంఘటన జరిగిన వెంటనే నాలుగు శాఖలకు చెందిన ఉన్నతాధికారులను ఇప్ప‌టికే సస్పెండ్ చేశారని వివరించారు. విచార‌ణ నివేదిక‌ను ప్రభుత్వానికి స‌మ‌ర్పిస్తామ‌న్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ. బిందు మాధవ్, జెసీ అపూర్వభరత్, పెద్దాపురం ఆర్డీవో శ్రీధర్, పెద్దాపురం డీఎస్పీ వి.వి. సత్యనారాయణ, ఈ ఘ‌ట‌న‌లో బాధ్యులై సస్పెండ్ కాబడిన ఆర్డీవో, డీఎస్పీలు కే రమణి, డీఎస్పీ డి శ్రీహరి రాజు త‌దిత‌రులు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.