Venezuela Earthquake: లాటిన్ అమెరికా దేశమైన వెనిజులాలో గురువారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) రెండు పవర్‌ఫుల్ భూకంపాలు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. భారీగా నష్టాన్ని మిగిల్చాయి. రాజధాని కారకాస్‌తో సహా పలు ప్రాంతాల్లో భవనాలు పేకమేడల్లా కుప్ప కూలిపోవడంతో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ప్రకృతి విధ్వంసానికి భారీ నష్టం వాటిల్లినట్లు నివేదికలు వెలువడ్డాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, గత 100 సంవత్సరాలలో వెనిజులాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఇది ఒకటిగా చెబుతోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం లక్ష మంది వరకు మరణించి ఉండవచ్చు.

భూకంపం పూర్తి టైమ్‌లైన్ ఇదే

జూన్ 25, 2026, వేకువజాము 3:34 (భారత్ కాలమానం ప్రకారం)

వెనిజులాలో మొదటి శక్తివంతమైన భూకంపం సంభవించింది.

భూకంప తీవ్రత 7.1 నుంచి 7.2 గా నమోదైంది.

దీని కేంద్రం కారకాస్‌కు పశ్చిమాన సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోరోన్, శాన్ ఫెలిప్ ప్రాంతాల సమీపంలో ఉంది.

జూన్ 25, 2026, వేకువజామున 3:35 (భారత్ కాలమానం ప్రకారం)

మొదటి భూకంపం జరిగిన కొన్ని క్షణాల తర్వాత, రెండో, మరింత శక్తివంతమైన భూకంపం సంభవించింది.

రెండో భూకంప తీవ్రత 7.5గా నమోదైంది.

దీని కేంద్రం కారకాస్‌కు పశ్చిమాన సుమారు 100 మైళ్ల దూరంలో ఉన్న మోంటాల్బాన్ ప్రాంతానికి సమీపంలో ఉంది.

భూకంపం సంభవించిన వెంటనే సునామీ హెచ్చరికలు

భూకంపం తరువాత, యూఎస్ పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ప్యూర్టో రికో, యూఎస్, బ్రిటిష్ వర్జిన్ దీవులు, అరుబా, కురాకో, బొనైర్ తీరాలకు సునామీ హెచ్చరికను జారీ చేసింది. అయితే, పరిస్థితిని అంచనా వేసిన తరువాత సుమారు గంట తర్వాత ఆ హెచ్చరికను ఉపసంహరించుకున్నారు.

రాజధాని కారకాస్‌లో విధ్వంసం

రాజధాని కారకాస్‌లోని అల్టమీరా, చకావో ప్రాంతాలలో అనేక భవనాలు కూలిపోయినట్లు నివేదికలు వెలువడ్డాయి. సహాయక బృందాలు వెంటనే రెస్క్యూ, పునరావాస చర్యలను ప్రారంభించాయి. చకావో ప్రాంతం నుంచి కనీసం 18 మందిని సజీవంగా బయటకు తీశారు.

ఫాల్కన్ రాష్ట్రంలో భారీ నష్టం

ఫాల్కన్ రాష్ట్రంలో 22 మంది గాయపడినట్లు నిర్ధారించారు. పదిహేను మంది ఇంకా గల్లంతయ్యారు. స్థానిక అధికారులు సహాయక, గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.

అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం

తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని చెప్పారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించి, అంతర్జాతీయ సహాయం కోరతామని అన్నారు.

USGS ఆందోళన

యుఎస్ జియోలాజికల్ సర్వే తన ప్రాథమిక అంచనాలో, విస్తృత ప్రాణనష్టం, అపారమైన విధ్వంసం సంభవించవచ్చని పేర్కొంది. మృతుల సంఖ్య లక్ష వరకు ఉండవచ్చని ఆ సంస్థ అంచనా వేసింది. అయితే, మొత్తం మరణాలు, గాయపడిన వారి సంఖ్యను ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు.

విమాన సేవలు, పాఠశాలలపై ప్రభావం

ముందస్తు జాగ్రత్త చర్యగా మైకేటియా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. పలు పాఠశాలలను మూసివేశారు. అయితే, చమురు ఉత్పత్తికి గానీ, ఇంధన మౌలిక సదుపాయాలకు గానీ పెద్ద నష్టం జరిగినట్లు నిర్ధారణ కాలేదు.

వెనిజులాలో భూకంపాలు ఎందుకు ఎక్కువగా వస్తాయి?

వెనిజులా కరేబియన్ ప్లేట్, దక్షిణ అమెరికా ప్లేట్ కలిసే చోట ఉంది, అందువల్ల అక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఏడాదిలో ఒకసారైనా పెద్ద భూకంపం సంభవించే ప్రమాదం ఉంది.

వెనిజులా ప్రధాన భూకంపాల చరిత్ర

1812 నాటి వినాశకరమైన భూకంపం

మార్చి 26, 1812న, కారకాస్, మెరిడాలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ సమయంలో వెనిజులా స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడుతోంది. USGS ప్రకారం, ఈ భూకంపంలో సుమారు 30 వేల మంది మరణించారు. దేశ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన భూకంపంగా దీనిని పరిగణిస్తారు.

1967 కారకాస్ భూకంపం

1967 జూలై 29న కారకాస్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనేక బహుళ అంతస్తుల భవనాలు కూలిపోయాయి. దాదాపు 200 నుంచి 300 మంది మరణించారు. దీని తర్వాత, దేశంలో భవన నిర్మాణ నిబంధనలను మరింత కఠినతరం చేశారు.

2018 సముద్ర భూకంపం

2018 ఆగస్టు 21న, వెనిజులా ఉత్తర తీరానికి సమీపంలో సముద్రంలో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనల ప్రభావం ట్రినిడాడ్-టొబాగో, కొలంబియా వరకు ఉంది. ఆ సమయంలో కేంద్రం సముద్రంలో ఉండటం వల్ల పెద్ద నష్టం జరగలేదు.