Vadapalli Venkateswara Swamy Brahmotsavam | కోనసీమ తిరుమలగా ప్ర‌సిద్ధి చెందిన వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి.. ఏడు శ‌నివారాల వెంక‌న్న‌గా పిలుచుకునే భ‌క్త జ‌నం బ్ర‌హ్మోత్స‌వాల‌కు పోటెత్తుతోంది.. విద్యుత్ వెలుగులు, మరోపక్క పరిమళాలను వెదజల్లే పూల అలంకరణలతో ఆలయ ప్రాంగణం దేదీప్య‌మానంగా వెలిగిపోతుండ‌గా భ‌క్తులకు కను విందు చేస్తోంది.. రెండు క‌న్నులూ చాల‌వ‌న్న‌ట్లు తిల‌కిస్తున్న భ‌క్తులు వెంక‌న్న‌కు జ‌రిగే నిత్య పూజ‌ల్లో పాల్గొని త‌రిస్తున్నారు.. గోదావరి తీరంలో వేద పండితుల వేద ఘోషతో భ‌క్త జ‌నం మైమ‌రిచిపోతోంది.. శుక్ర‌వారం నుంచి అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మైన వాడ‌ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర‌స్వామి బ్ర‌హోత్స‌వాలు శుక్ర‌వారం, శ‌నివారం ప్ర‌త్యేక పూజ‌ల‌తో భారీ సంఖ్య‌లో వేలాదిమంది స్వామిని ద‌ర్శించుకున్నారు..

బ్రహ్మోత్సవాల మొదటి రోజు ఇలా...

స్వస్తివచనము, విశ్వక్సేనపూజ, పుణ్యహవచనము, దీక్షా ధారణ, కల్మశ‌ హోమము, అగ్ని ప్రతిష్టాపన, అగ్ని ప్రతిష్టాపన, దిగ్దేవతా ప్రార్ధన, విశేషార్చన, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను పండితులు అత్యంత రమణీయంగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన వసంత మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయంత్రం ధ్వజారోహణం నిర్వహించి అంకుర్పారణ చేశారు. ధ్వజపీఠం వద్ద వేదపండితులు అత్యంత నియమ నిష్ఠలతో.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకార మండపం, ఆలవార్ల మండపంలో పుష్పాలంకరణ, ఆలయ అలంకరణ, మాదవీధుల అలంకరణలు వేలాదిగా తరలివచ్చిన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ప‌రా వాసుదేవ అలంకరణలో శేషవాహనంపై!

మొద‌లి రోజు రోజు రాత్రి యాగశాలలో పండితులు ప్రత్యేక హెమాలు నిర్వహించారు. ధ్వజస్తంభం బలిపీఠం వద్ద ఉత్సవమూర్తులు కొలువుతీరారు. ధ్వజపటాన్ని ఊరేగిస్తూ.. దేవతలను ఆహ్వానించారు. ధ్వజస్తంభంలో ప్రతిష్టించిన గరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బ్రహ్మోత్సవాలకు అంకుర్పారణ చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన వాయిద్య, జానపద కళాకారుల ప్రదర్శనలు అందరినీ అమితంగా ఆకట్టుకున్నాయి. అనంతరం
రాత్రి శ్రీవారు పరా వాసుదేవ అలంకరణలో శేషవాహనంపై కొలువుతీరారు, విద్యుత్ వెలుగులు, మేళతాళ మంగళవాయిద్యాలు, వేదఘోష, బాణసంచా కాల్పుల నడుమ శ్రీవారు తిరుమాడవీధులలో విహరించారు. అశేష భక్తజన గోవిందనామస్మరణ నడుమ ఆయన సేవ అత్యద్భుతంగా ముందుకు సాగింది. వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుండి తరలివచ్చిన భక్తజనం బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి సేవలను తిలకించారు.
ఉప కమిషనరు నల్లం సూర్య చక్రధరరావు, కనకదుర్గాదేవి, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు, సత్యశ్రావణి దంపతులు.. స్వామివారి పూజా మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారికి, అమ్మవార్లకు పట్టు
వస్త్రాలు అందజేశారు.

రెండో రోజుల మ‌రింత క‌న్నుల పండువ‌గా..

బ్ర‌హ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు రెండవ రోజు శనివారం ఉదయం గం 8.30 లకు సంకల్పము, విష్వ‌క్సేన పూజ‌, పుణ్యహవచనము, సప్త కళశారాధనతో బాటు స్వామి వారికి విశేష అభిషేకాల‌ను ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు దంపతులు, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఆలయ కార్యనిర్వహణ అధికారి నల్లం సూర్యచంద్రరావు దంపతులచే ఆల‌య అర్చక బ్రహ్మలు జరిపించారు. అనంతరం ఋత్విక్ష‌ బ్రహ్మత్వంలో ప్రధాన హెమాలు జ‌రిపారు. దిగ్దేవతా ప్రార్ధనతో పాటు మహాపుష్ప యాగం కన్నుల పండువ‌గా నిర్వహించారు. చివరిగా ఉదయ బేవరులతో కూడిన మల‌యప్ప స్వామికి నీరాజన మంత్ర పుష్పములు సమర్పించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తరలివచ్చిన భక్త జన సందోహంతో ఆల‌య ప్రాంగ‌ణం అంతా కిక్కిరిసింది.. స్వామి వారి తీర్థ ప్రసాదాలను దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో పంపిణీ చేశారు..

రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం 5.15 గంట‌ల‌కు స్వ‌స్తి వ‌చ‌నం, ప్ర‌ధాన హోమాలు, స‌హ‌స్ర దీపాలంక‌ర‌ణ సేవ‌, దిగ్దేవ‌తా బ‌లిహ‌ర‌ణ, విశేషార్చ‌న‌ల అనంత‌రం స్వామి వారికి నీరాజ‌న‌, మంత్ర పుష్ప స‌మ‌ర్ప‌ణ గావించారు. శ్రీమలయప్పస్వామి సరస్వతీ అలంకరణలో హంస వాహన సేవ కోనసీమ తిరుమల బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు రాత్రి క్రీ మలయప్పస్వామి సరస్వతిదేవి అలంకరణలో వీణను చేత బూని హంస వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహ కార్య‌క్ర‌మం క‌న్నుల పండువ‌గా జ‌రిగింది. హంస వాహనం అనేది అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానోదయాన్ని వెలిగిస్తుంది. ఆహంతారాన్ని అంది శవాన్ని అనుగ్రహించే విష్ణు రూపానికి ఇది ప్రతీక హంస అనేది స్వచ్ఛతకు జ్ఞానోదయానికి చిహ్నంగా ఆధ్యాత్మిక ప్రస్తావిస్తారు.

వాడ‌ప‌ల్లి వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యం ఇదీ..

బ్రహ్మోత్సవాల విశిష్టత పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వెంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలో లోక కల్యాణం కోసం బ్రహ్మదేవుడ్ని పిలిచి తనకు ఉత్సవాలు నిర్వహించమని ఆజ్ఞాపించాడట. బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించాడనీ అందుకే వీటికి 'బ్రహ్మెత్సవాలు' అని పేరు వచ్చిందని ప్రతీతి. ఈ బ్రహ్మోత్సవాలు వీక్షించడానికి ముక్కోటి దేవతలు భూమిపైకి వస్తారని భక్తుల విశ్వసిస్తారు. ముఖ్యంగా గరుడ సేవ రోజున ఇది స్పష్టంగా కనిపిస్తుందని భావిస్తారు. ఈ ఉత్సవాలు చోక కళ్యావార్థం నిర్వహించబడతాయి. తిరుమలలో ఆచరించిన సాంప్రదాయాలను అనుసరించి తిరుమలలోనూ వార్షిక బ్రహ్మెతనాలను నిర్వహిస్తున్నారు. పుష్కర కాలం క్రితం ప్రారంభమైన కోనసీమ తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రస్తుతం 13వ ఏడాది జరుపుతున్నారు.

వెంకటేశ్వర స్వామివారిని వివిధ రూపాల్లో, అవతారాల్లో దర్శనం చేసుకున్న వారు రోగుకునే కోరికలు నెరవేరడంతో పాటు, పుణ్యఫలాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఆటు దేవస్థానం చైర్మన్ ముడుసూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ ముఖ్య నిర్వహణాధికారి నల్లం చక్రధరరావులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు.