వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి యూఎస్ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఒప్పందానికి సంబంధించిన అంశాలకు ఆమోదం లభించిందని, ఇరాన్‌తో పీల్ డీల్‌పై ఒప్పందం ఈ వారంలోనే జరగవచ్చని గురువారం (11 జూన్) నాడు తెలిపారు. చర్చలకు వేదిక, టైం త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఒప్పందం కుదిరిన తర్వాత ఏ ఆంక్షలు లేకుండా హర్మూజ్ జలసంధి కూడా తెరుచుకుంటుందని ట్రంప్ పేర్కొన్నారు.

ఇరాన్‌పై దాడుల విరమణ.. ట్రంప్ యూటర్న్
ఇరాన్‌పై జరుగుతున్న దాడులను విరమించుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అంతకుముందు ఇరాన్ చమురు రంగాన్ని అమెరికా నియంత్రణలోకి తీసుకుంటామని, ఖర్గ్‌ దీవిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. కొన్ని గంటల్లోనే మాట మార్చి ఈ ప్రకటన చేశారు. ఇరాన్‌తో చర్చలు కొలిక్కి వచ్చాయని, తమ ప్రతిపాదనలకు ఇరాన్ అగ్రనాయకత్వంతో పాటు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి పలు దేశాలు అంగీకరించాయని పేర్కొన్నారు. ఒప్పందంపై సంతకాల వేదిక, సమయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఒప్పందం పూర్తయ్యే వరకు హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు, అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని ఇరాన్ తేల్చిచెప్పింది.

ముందుగా భారీ దాడులు.. ఆపై హెచ్చరికలు
అమెరికా బలగాలు గత రెండు రోజులుగా ఇరాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. బందర్ అబ్బాస్, సిరిక్, మినాబ్, ఖేష్మ్‌ ఐలాండ్, గోర్గాన్ నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. పర్షియన్ గల్ఫ్ వద్ద ఇరాన్ రాడార్, గగనతల రక్షణ వ్యవస్థలను దెబ్బతీశామని అమెరికా స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధి ద్వారా లైట్లు ఆఫ్ చేసి రాడార్లకు చిక్కకుండా ఒక్కరోజే 22 చమురు నౌకలను తరలించామని స్వయంగా ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌కు తెలియకుండా అమెరికా ఆర్మీ సీక్రెట్ ఆపరేషన్ ద్వారా ముడి చమురు తరలించిందని, అందువల్లే ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు అదుపులో ఉన్నాయని ట్రంప్ అన్నారు.

ఆ దాడులకు ప్రతిచర్యగా కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. అమెరికా తమ సహనాన్ని పరీక్షిస్తోందని, తమ సాయుధ దళాలు కచ్చితంగా స్పందిస్తాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించారు. వారు క్షేమంగా ఉండాలంటే అమెరికా బలగాలు వెంటనే ఆ ప్రాంతాన్ని వీడాలని స్పష్టం చేశారు.