UPSC Civil Services Personality Tests (Interviews) 2025: సివిల్ సర్వీసెస్-2024 మెయిన్స్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నిర్వహించే.. ఇంటర్వ్యూ తేదీలను యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(UPSC) డిసెంబరు 21న వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అభ్యర్థుల రూల్‌ నంబర్‌, ఇంటర్వ్యూ తేదీ, సమయం వివరాలను యూపీఎస్సీ ప్రకటించింది. ఇంటర్వ్యూకు సంబంధించిన ఇ-సమన్‌ లెటర్లను త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్‌ పేర్కొంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబ‌ర్ 20 నుంచి 29 వ‌ర‌కు సివిల్స్‌ ప్రధాన పరీక్షల నిర్వహించగా... డిసెంబర్‌ 9న ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షలో మొత్తం 2,845 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్‌)కు అర్హత సాధించారు. ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక పూర్తిచేస్తారు.

ఇంటర్వ్యూ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాతి దశలో ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్‌)కు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే డీటైల్డ్‌ అప్లికేషన్‌ ఫాం-2 పూర్తిచేసిన అభ్యర్థులకే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంట‌ర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది. ఇంట‌ర్వ్యూ ప్రతిభ‌, మెయిన్స్, ప్రిలిమ్స్ మార్కుల‌ను బ‌ట్టి ఆలిండియా స‌ర్వీసుల‌కి అభ్యర్థుల‌ను ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు ఫలితాలపై ఏమైనా సందేహాలు ఉంటే 011 23385271, 011 23098543, 011 23381125 ఫోన్ నెంబర్లలో లేదా ఫ్యాక్స్: 011-23387310, 011-23384472 లేదా ఫెసిలిటేషన్ కౌంటర్‌ను లేదా
[email protected] ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సంప్రదించాల్సి ఉంటుంది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 20 నుంచి 29 మధ్య సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. అంతకుముందు సివిల్‌ సర్వీసెస్‌–2024 ప్రిలిమ్స్ ప‌రీక్ష జూన్ 16న ఉద‌యం పేప‌ర్‌-1 (జ‌న‌ర‌ల్ స్డడీస్) ప‌రీక్షను యూపీఎస్సీ నిర్వహించింది. ఈ పేపర్‌–1 ప్రశ్నప‌త్రంలో 100 ప్రశ్నలు 200 మార్కుల‌కు నిర్వహించారు. అలాగే మ‌ధ్యాహ్నం పేపర్‌–2(అప్టిట్యూడ్‌ టెస్ట్‌–సీశాట్‌)ను 80 ప్రశ్నలతో 200 మార్కుల‌కు నిర్వహించారు. జులై 1న ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. జూన్ 16న ఈ రెండు పరీక్షలు దేశ వ్యాప్తంగా 80 నగరాల్లో నిర్వహించగా.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 79,043 మంది దరఖాస్తు చేసుకుంటే, వారిలో 42,560 (53.84 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా ప్రిలిమ్స్‌ పరీక్షకు 13.4 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఈ ఏడాదికి గాను మొత్తం 1056 పోస్టులను భర్తీచేయనున్నారు. వీటిల్లో 40 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు. మిగిలిన ఖాళీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తింజేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...