TVS Jupiter 125 New Price After GST Cut: GST 2.0 తగ్గింపు తర్వాత TVS Jupiter 125 ధర గణనీయంగా తగ్గింది. ఈ స్కూటర్ ఇప్పుడు ₹7,731 ఆదా చేస్తుంది. ఈ స్కూటర్‌ మధ్య తరగతి కుటుంబాలు & ఆఫీసు రైడర్లకు మంచి ఆప్షన్‌. హైదరాబాద్‌లో జూపిటర్‌ 125 ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు ₹78,500 నుంచి ప్రారంభమవుతుంది, గతంలో ₹86,231 నుంచి తగ్గింది. ఈ స్కూటర్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది, అవి - డ్రమ్ అల్లాయ్, డిస్క్, స్మార్ట్ఎక్సోనెక్ట్ డ్రమ్ & స్మార్ట్ఎక్సోనెక్ట్ డిస్క్. ప్రతి బడ్జెట్ & ప్రతి అవసరానికి అనుగుణంగా ఈ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

డిజైన్ & ఫీచర్లు
TVS Jupiter 125 ను కుటుంబంతో కలిసి వెళ్లడానికి & రోజువారీ ఉపయోగం కోసం రూపొందించారు. దీని డిజైన్ సింపుల్‌, స్లీక్‌ & మెటల్‌-బేస్‌తో ఉంటుంది. దృఢమైన శరీరంతో ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. రాత్రిపూట మెరుగ్గా కనిపించడం కోసం LED హెడ్‌లైట్లు & టెయిల్‌లైట్‌లు దీని ముఖ్య లక్షణాలు. అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్‌మీటర్ & ఇంధన గేజ్ కూడా ఉన్నాయి. SmartXonnect వేరియంట్ TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, వాయిస్ అసిస్ట్ & ఇన్‌కమింగ్ కాల్/మెసేజ్ అలర్ట్‌ల వంటి హై-టెక్ ఫీచర్‌లను అందిస్తుంది.

TVS Jupiter 125 లో 33 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్‌ ఉంది, దీనిలో రెండు హెల్మెట్‌లను సులభంగా పెట్టుకోవచ్చు. 2-లీటర్ గ్లోవ్ బాక్స్ & USB ఛార్జర్‌ కూడా దీనిలో ఉన్నాయి. దీంతో, ప్రయాణ సమయంలోనే ఇది మీ మొబైల్ లేదా ఇతర గాడ్జెట్‌లను సులభంగా ఛార్జ్ చేస్తుంది.

హ్యాండిల్ బార్ కింద ఎక్స్‌టర్నల్‌ ఫ్యూయల్‌ ఫిల్లింగ్ క్యాప్ ఉంది. దీనివల్ల, పెట్రోల్‌ బంకు దగ్గర బండి దిగి సీటు ఓపెన్‌ చేయాల్సిన అవసరం ఉండదు, చక్కగా సీట్‌పై కూర్చుని ఇంధనం నింపుకోవచ్చు. సీట్ ఓపెనింగ్ స్విచ్, పార్కింగ్ బ్రేక్ సిస్టమ్ & సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) వంటి ఫీచర్లు రైడింగ్‌ను సురక్షితంగా మారుస్తాయి. స్టాండ్ అలారం & హజార్డ్‌ వార్నింగ్‌ (ప్రమాద హెచ్చరిక) లైట్ వంటివి కూడా రైడర్‌ భద్రతకు చాలా ఉపయోగరపడతాయి. ఈ ఫీచర్లన్నీ జూపిటర్ 125 ని స్టైలిష్‌గా మాత్రమే కాకుండా రోజువారీ ఉపయోగం కోసం చాలా ప్రాక్టికల్‌ & నమ్మదగిన స్కూటర్‌గా మార్చాయి.

ఇంజిన్ & పనితీరు
TVS Jupiter 125... 124.8cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 8.15 PS శక్తిని & 10.5 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్ BS6-2.0 కంప్లైంట్ & ఫ్యూయల్ ఇంజెక్షన్ (FI) టెక్నాలజీని కలిగి ఉంది, ఇది సున్నితమైన యాక్సిలరేషన్‌ & మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని ఇస్తుంది. ఈ స్కూటర్ దాదాపు 95 kmph గరిష్ట వేగాన్ని చేరుకోగలదు, నగర ట్రాఫిక్ & హైవే ట్రాఫిక్ రెండింటిలోనూ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

మైలేజ్
TVS Jupiter 125 కోసం ARAI- క్లెయిమ్ చేసిన మైలేజ్ 57.27 kmpl, అయితే నిజ జీవితంలో ఇది సగటున 50 kmpl ఇస్తుంది. దీని 5.1-లీటర్ ఇంధన ట్యాంక్‌ వల్ల, ఫుల్‌ ట్యాంక్‌తో సుమారు 250 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇంధన స్థాయి అయిపోకముందే "డిస్టెన్స్ టు ఎంప్టీ" ఇండికేటర్‌ మిమ్మల్ని హెచ్చరిస్తుంది.