Private Travel Bus Overturns In Rajahmundry: రాజమండ్రిలో (Rajahmundry) బుధవారం అర్ధరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ యువతి మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో బుధవారం విశాఖ (Visakha) నుంచి హైదరాబాద్ బయల్దేరింది. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత రాజమండ్రి శివార్లలో గామన్ వంతెన రహదారిపై కాతేరు - కొంతమూరు వద్ద బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన మోహన కల్యాణి అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు కాగా.. వీరిని 6 అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. వీరు విశాఖ, అన్నవరం ప్రాంతాలకు చెందిన వారిగా తెలుస్తోంది. క్షతగాత్రుల్లో 15 మందికి స్వల్పంగా గాయాలు కావడంతో ప్రథమ చికిత్స అనంతరం తమ స్వస్థలాలకు వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్రేన్ సాయంతో రాత్రి ఒంటి గంట సమయంలో బోల్తా పడిన బస్సును తొలగించి కింద ఉన్న మరికొంతమందిని రక్షించినట్లు చెప్పారు. ఎస్పీ నరసింహ కిషోర్ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. మృతి చెందిన యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం పరీక్ష రాసేందుకు వెళ్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్ అలసత్వమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ప్రమాదం తర్వాత డ్రైవర్, క్లీనర్ పరారయ్యారని పేర్కొన్నారు. దీనిపై రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన