Telangana requests Toll free travel on the Hyderabad Vijayawada highway : హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని, వాహనదారులకు ఊరట కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక ప్రతిపాదనను కేంద్రం ముందుంచింది. పండుగ సమయంలో టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు.

ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు మరియు తిరిగి వచ్చేందుకు వీలుగా మంత్రి కోమటిరెడ్డి రెండు విడతలుగా టోల్ ఫ్రీ కావాలని కోరారు. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు జనవరి 9 నుండి 14 వరకు ఈ మినహాయింపు ఇవ్వాలన్నారు. అలాగే విజయవాడ నుండి హైదరాబాద్ వైపు జనవరి 16 నుండి 18 వరకు టోల్ వసూళ్లను నిలిపివేస్తే, వాహనాలు వేగంగా కదులుతాయని, తద్వారా కిలోమీటర్ల మేర పేరుకుపోయే ట్రాఫిక్ జామ్‌లకు అడ్డుకట్ట వేయవచ్చని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

సాధారణ రోజులతో పోలిస్తే సంక్రాంతి సమయంలో ఈ హైవేపై ట్రాఫిక్ దాదాపు 200 శాతం పెరుగుతుందని టోల్ డేటా గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగా టోల్ గేట్, సూర్యాపేట జిల్లా కోర్ పహాడ్, ఏపీలోని చిలకలూరిపేట వంటి ప్రధాన టోల్ ప్లాజాల వద్ద రద్దీ విపరీతంగా ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్ అమలులో ఉన్నప్పటికీ, లక్షలాది వాహనాలు ఒక్కసారిగా రావడంతో స్కానింగ్ సమస్యలు ,సాంకేతిక లోపాల వల్ల ప్రయాణికులు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది.

పండుగ పూట ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడం ప్రజా ప్రయోజనార్థం అత్యవసరమని మంత్రి స్పష్టం చేశారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), ట్రాఫిక్ పోలీస్ , ఇతర విభాగాలతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమన్వయం చేసుకుంటోందని, కేంద్రం సానుకూలంగా స్పందిస్తే లక్షలాది మందికి లబ్ధి చేకూరుతుందని ఆయన వివరించారు. ఈ ప్రతిపాదన గనుక అమలైతే, పండుగ ప్రయాణం కేవలం ఆర్థికంగానే కాకుండా, సమయం పరంగా కూడా సులభతరం కానుంది.

Telangana requests Toll-free travel on the Hyderabad–Vijayawada highway during Sankranti to ease massive festive traffic

Minister Komatireddy Venkat Reddy has written to Union Minister Nitin Gadkari seeking
• Toll-free travel Hyderabad → Vijayawada from January 9 to 14
•… pic.twitter.com/ZyvCjehbYt

— Naveena (@TheNaveena) December 30, 2025

సాధారణంగా టోల్ ఫ్రీ ప్రకటించినప్పుడు ఆ నష్టాన్ని ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. గతంలో కొన్ని సందర్భాల్లో ఇలాంటి వెసులుబాటు కల్పించిన దాఖలాలు ఉన్నప్పటికీ, జాతీయ రహదారిపై పూర్తిస్థాయిలో అనుమతి లభిస్తుందా లేదా అనేది కేంద్రం నిర్ణయంపై ఆధారపడి ఉంది. కేంద్రం నుంచి అనుమతి వస్తే, ఇది తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి పెద్ద సంక్రాంతి కానుకగానే భావించవచ్చు.