Tiruvuru Politics: తిరువూరులో టీడీపీలో ఏర్పడ్డ వివాదం పీక్స్‌కు చేరుకుంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎంపీ చిన్నీని టార్గెట్ చేశారు. తనకు టికెట్ ఇప్పించేందుకు ఐదు కోట్లు అడిగారని ఆరోపించారు. మూడు దఫాలుగా అరవై లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు చెప్పారు. మరో 50 లక్షల రూపాయలను చిన్ని పీఏకు ఇచ్చినట్టు తెలిపారు. మిగిలిన డబ్బులు గురించి రేపు వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. నిజం గెలవాలి నిజమే గెలవాలని అన్నారు.

కొలికపూడి కామెంట్స్‌పై చిన్ని కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తాను డబ్బులకు పదవులు ఇచ్చే వాడిని కాని అన్నారు. చంద్రబాబును అవమానించిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వబోమని స్పష్టంచేశారు. అసలు కోవర్టులకు పదవుల ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.

మొదటి నుంచి కూడా కొలికపూడి వ్యవహారం టీడీపీలో తలనొప్పిగానే ఉంది. పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం, ప్రజల్లోకి వెళ్లే టైంలో దూకుడుతనం అన్నీ రివర్స్ అవుతూనే ఉన్నాయి. వీటికితోడు స్థానిక నేతలతో సున్నం పెట్టుకవడం కొలికపూడిని టీడీపీ అధినాయకత్వం పట్టించుకోవడం మానేసింది. ఈ మధ్యా కాలంలో కేశినేని చిన్నిని టార్గెట్ చేస్తూ తరచూ కొలికపూడి విమర్శలు చేస్తున్నారు. దీన్ని కూడా అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. మొన్నీ మధ్య చంద్రబాబు ఆ ప్రాంతంలో పర్యటించినా కొలికపూడిని చాల దూరం పెట్టారు. ఆయన పర్యటనలో కనిపించినా చంద్రబాబు మాత్రం పట్టించుకోలేదు.

కొలికపూడి వ్యవహార శైలి కారణంగా ఆయన్ని దూరం పెడుతూ వచ్చింది. ఆయన కూడా పార్టీలో గౌరవం లేదని భావించి వేరే దారి చూసుకునందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఫైనల్‌గా రాష్ట్రాధ్యక్షుడితో సమావేశమై తేల్చుకోవాలని భావించారు. ఇంతలో కేశినేని చిన్ని తన నియోజకవర్గంలో పర్యటించడం, ఆయన వెనకాలే నేతలు వెళ్లడంతో తన పని అయిపోయందని కొలికపూడి భావించారు. అందుకే తనను ఒంటరిని చేసి తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న టైంలో కేశినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది ఇప్పుడు తెలుగు దేశం పార్టీలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన విషయంగా మారింది.