Tirumala Water Scarcity: ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఎల్‌నీనో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వర్షాభావ పరిస్థితులతో శ్రీవారి కొండపై నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. అప్పుడప్పుడు తేలికపాటి వర్షాలు కురుస్తున్నప్పటికీ, జలాశయాల్లో నీటి మట్టాలు పెరగకపోవడం అధికారులు, భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది.

60 లక్షల గ్యాలన్ల నీరు వినియోగం

గతంలో కేవలం సెలవు రోజుల్లో మాత్రమే తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండేది. కానీ, ఇటీవల రోజులతో సంబంధం లేకుండా నిత్యం లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. దీంతో కొండపై నీటి వినియోగం భారీగా పెరిగింది. తిరుమలలోని 7,500 అద్దె గదులు, 5 భక్తుల వసతి సముదాయాలు , బహిరంగ మరుగుదొడ్లు, ఇతర సేవలకు ప్రతిరోజూ సుమారు 60 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతోంది.

నీటి వనరులు

కల్యాణి డ్యామ్ (తిరుపతి): పంపింగ్ ద్వారా రోజుకు 30 లక్షల గ్యాలన్లు

పాపవినాశనం డ్యామ్: రోజుకు 15 లక్షల గ్యాలన్లు

గోగర్భం డ్యామ్: రోజుకు 15 లక్షల గ్యాలన్లు

అడుగంటిన డ్యామ్‌లు.. కేవలం 90 రోజులకే నీరు

తిరుమలలోని కుమారధార, పసుపుధార జలాశయాల్లో నీటి మట్టం పూర్తిగా అడుగంటిపోయింది. ప్రస్తుతం పాపవినాశనం, గోగర్భం డ్యామ్‌లలో మాత్రమే కొద్దిపాటి నీటి నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలు కేవలం 90 రోజులకు మాత్రమే సరిపోతాయని తిరుమల తిరుపతి దేవస్థానం వాటర్ వర్క్స్ ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. భక్తులకు నీటి యద్దడి తలెత్తకుండా నీటి సరఫరా, వినియోగంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

Also Read: చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించే అంశాలివే

భారీ వర్షాలపైనే ఆశలు

మరో వారం రోజుల్లో తిరుమల ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంకేతాలు ఇచ్చింది. సాధారణంగా ప్రతి ఏటా చివరి మాసాల్లో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తాయని, వీటి వల్ల జలాశయాలు మళ్లీ నిండే అవకాశం ఉందని టీటీడీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన