కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం సృష్టించింది. దేచర్ల సమీపంలోని క్వారీ వద్ద పెద్దపులి తిష్ట వేయడంతో ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతం ఆ క్వారీ వద్దే సేదతీరుతున్న పులిని ఎలాగైనా బంధించేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పులిని బంధించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.

అటవీ శాఖ ఉన్నతాధికారులు సీసీఎఫ్ (CCF) జ్యోతి, డీఎఫ్ఓ (DFO) ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక రెస్క్యూ బృందాలు పులిని బోనులో బంధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పులి ఉన్న ప్రాంతం ఇబ్బందిగా ఉండటంతో రెస్క్యూ టీమ్‌కు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో పులి కదలికలను నిశితంగా పరిశీలిస్తూ, దాని వద్దకు చేరుకునే సురక్షిత మార్గాలను గుర్తించేందుకు అధికారులు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నారు.

పులికి ఎలాంటి హాని కలగకుండా, అలాగే సిబ్బందికి ప్రమాదం జరగకుండా దాన్ని బంధించేందుకు అటవీ శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కొవ్వూరు ప్రాంతంలో పులి సంచారం దృష్ట్యా స్థానిక ప్రజలు, సమీప గ్రామాల రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను ఖచ్చితంగా పాటించాలని అటవీ శాఖ విజ్ఞప్తి చేసింది.

పెద్దపులిని పట్టుకునేందుకు పూణే నుంచి టీమ్స్

గోదావరి జిల్లాలో పెద్దపులి దోబూతులాడుతోంది. చాలా రోజులుగా అటవీ శాఖను ముప్పుతిప్పలు పెడుతున్న పులి.. ఇప్పుడు చాగల్లు అరటితోటల్లో సంచరిస్తోంది. కొన్నాళ్లుగా పాపికొండల అభయారణ్యంలో తిరిగిన పులి కొన్ని రోజుల కిందట సీతానగరం వద్ద గోదావరి నదిని దాటింది. దేవరపల్లి మీదుగా ఇప్పుడు డెల్టా ప్రాంతానికి వచ్చేయడంతో అటవీ అధికారుల్లో ఆందోళన పెరిగింది. పులిని సాధ్యమైనంత త్వరగా బంధించేందుకు పూణె నుంచి ప్రత్యేక టీమ్‌ను రప్పించారు.

ఢిల్లీ నుంచి దిగిన మరో టీమ్
ఈ క్రమంలో శనివారం ఉదయం పులి చాగల్లు సమీపంలోని ఓ అరటితోటలో రైతులకు కనిపించింది. ఆ తర్వాత ఓ ప్యాక్టరీ సమీపంలో పులి సేదతీరుతున్నట్లు కెమెరాలకు చిక్కింద. పులి అనుసరిస్తున్న వ్యూహం అటవీశాఖ అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. పగటిపూట కోకో తోటలు, వరి పొలాల్లో నక్కుతూ, చీకటి పడగానే ఊర్లు మారుతూ హడలెత్తిస్తోంది. పులి కదలికలను అటవీ శాఖ అధికారులు ఛాలెంజ్‌గా తీసుకుని.. రేడియో కాలర్ సిగ్నల్స్, ప్రత్యేక డ్రోన్ కెమెరాల ద్వారా దాని జాడను ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక మత్తు ఇంజెక్షన్ నిపుణుల బృందం కూడా పులిని బంధించే ఆపరేషన్‌లోకి దిగింది. పూణె టీమ్ మాత్రం సాధ్యమైనంత త్వరగా పులిని పట్టుకుంటామని చెప్పి ఒకరోజు పూర్తయిందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.